Sunday, December 16, 2018

తిరుప్పావై అంటే ఏమిటి?

తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ''తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగితేలినవారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.


భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...