Thursday, December 18, 2025

భోజన వడ్డన, భోజన విధి

 1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి.

2.తూర్పు, దక్షిణ, పడమర ముఖంగా కూర్చుని తినాలి. 

3..మోదుగ, అరటి, పనస, మేడి ఆకులలో భోజనం ఉత్తమం 

4.ఎడమవైపుగా కొస ఉండాలి.

5.ఆకును నీటితో కడిగి మండలంపై ఉంచి ముందుగా నీతి చుక్కని ఆకు మీద వేసి వడ్డన చేయాలి.

6.ఎదురుకుండా కూరలు తరువాత మధ్యలో అన్నం, కుడివైపు పాయసం, పప్పు ఎడమవైపు పిండివంటలు చారు లేక పులుసు, చివర పెరుగు కలిపిన లవణం వడ్డన చేయాలి.

అన్ని వడ్డన అయ్యాక నెయ్యి వడ్డన చేయాలి.

7.ఆజ్య అభిఘారం లేకుండా అన్నము తినరాదు.

8.'త్రిసుపర్ణం' గాని 'అహంవైశ్వానరో భూత్వా '

మొదలగునవి పఠించవలయును.

9.చేతిలో నీరు గ్రహించి గాయత్రీ మంత్రముచే అన్నము పరిషేచన చేయవలెను. 

10.తర్జనీ మధ్యమ అంగుష్ఠములచేత ఎదుటభాగం నుండి ఓం ప్రాణా...స్వాహా అని ఆహుతి గ్రహించవలేను 

11.అనామిక, అంగుష్ఠములచేత దక్షిణభాగం నుండి ఓం అపానా...స్వాహా అని

12.కనిష్ఠ, అనామిక అంగుష్ఠములచేత 

పడమర భాగం నుండి ఓంవ్యాన..స్వాహాఅని

13.కనిష్ఠికా తర్జనీ అంగుష్ఠములచేత ఉత్తరభాగం నుండి ఓం ఉదానా.. స్వాహా అని

14.అన్ని వేళ్ళు కలిపి మధ్యభాగం నుండి ఓం సమానా...స్వాహా అని ప్రాణాహుతులు దంతములకు తగలకుండా ఇవ్వవలయును. 

15.ఉదయం రాత్రిపూట మాత్రమే భోజనము గృహస్తు చేయవలెను. 

16. మౌనంగా భోజనం చేయవలెను. 

17 భోజనకాలమందు మంచినీరు కుడిభాగమందు ఉంచవలెను. 

18.భోజనకాలమందు జలపాత్రను కుడిచేతి మణికట్టుపై ఉంచి ఎడమ చేతితో పట్టుకొని త్రాగవలయును.

19.భోజనం చేయుచూ పాదములు ముట్టుకొనరాదు. 

20. చిరిగిన ఆకులో తినరాదు.

21.కాళ్ళకి చెప్పులతోను, మంచాలపైన కూర్చుండి, ఓడిలో పెట్టుకొని భోజనం చేయరాదు.

22.భోజనం అయిన పిదప చేతిని కడుగుకొని 

నీరు పుక్కిలించి పాదప్రక్షాళన చేయవలెను. 

23భోజనమునకు ముందు వెనుక ఆచమనం చేయవలయును.


ఏమి తింటే ఏమి లాభాలు

* అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

* కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

* నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

* గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

* అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

* జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

* బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

* సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

* బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.

* మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

* దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

* ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

* అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

* కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

* మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

* ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

* బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

* క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

* మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

* ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

* అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

* పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

* సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

* దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

* ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

* చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

* కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

* క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

* యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

* వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

* పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

* ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

* ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

* ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

* జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

* నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

* మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

* మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

బల అతిబల

 #అఖండ సినిమాలో బల అతిబల గురించి చెబుతారు కదా. అది ఏమిటంటే...*

✍️ఆదిత్యయోగి

విశ్వామిత్రుడు శ్రీరాముడికి బోధించిన బల – అతిబల సాధారణ మంత్రాలు కాదు. అవి ప్రకృతి శక్తులతో మమేకమై జీవించే జీవన విజ్ఞానం అని చెప్పాలి.


బల – అతిబల అంటే ఏమిటి?


బల అంటే,

శరీరానికి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా శక్తిని నిలబెట్టే విద్య. ఆకలి, దాహం, అలసటలను జయించే మంత్రశక్తి. ప్రాణశక్తి ని నియంత్రించే సామర్థ్యం


అతిబల అంటే,

మానసికంగా భయం, మోహం, శోకంను జయించే శక్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరచిత్తం, అంతర్గత దృష్టి, అవగాహన పెంపొందించే విద్య


పై రెండూ కలిసే ఉంటే

శరీరం + మనస్సు + ప్రకృతి ఒకే లయలో పనిచేస్తాయి.


ప్రకృతితో మమేకం ఎలా?


బల–అతిబల సాధించిన రాముడు, 

అడవుల్లో నడిచినా అలసట లేకుండా ముందుకు సాగాడు

పర్వతాలు, నదులు, వృక్షాలు ఇవన్నీ శత్రువులు కాదు, సహచరులు అని భావించాడు

ప్రకృతి సంకేతాలను (గాలి, పక్షులు, జంతువుల ప్రవర్తన) అర్థం చేసుకునే స్థితి లో తనని తాను జయించాడు

“నేను ప్రకృతిలో లేను – నేనే ప్రకృతి” అన్న భావన రాముడిలో ఉంది. 


సీతాన్వేషణలో బల–అతిబల పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. 


సీతాన్వేషణ అనేది కేవలం భౌతిక ప్రయాణం కాదు.

బల వల్ల.

దీర్ఘకాలం అడవుల్లో తిరగగలిగారు

ఆహారం దొరకకపోయినా శక్తి నిలిచింది

శరీరం క్షీణించలేదు


అతిబల వల్ల:

సీత వియోగంలో కూడా ధైర్యం కోల్పోలేదు

కోపం, నిరాశలో చిక్కుకోలేదు

ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనను ధర్మ దృష్టితో చూశారు


అందుకే, శబరి మాటల్లో సత్యాన్ని చూశారు

హనుమంతునిలో అపార శక్తిని గుర్తించారు

వానరులను కేవలం జంతువులుగా కాక ధర్మసహచరులుగా స్వీకరించారు


ఈ విద్య వల్లే రాముడు:

ప్రకృతిని నాశనం చేయలేదు

కానీ అధర్మాన్ని నిర్మూలించారు.


ఇది ఇప్పుడు మనం చెయ్యడం సాధ్యమా అని గూగుల్ లో చుస్తే సాధ్యమే… అని చెప్పింది 


బల–అతిబల ఇప్పుడు నేర్చుకోవాలంటే మంత్రాలకంటే ముందుగా జీవన పద్ధతి (Lifestyle Yoga) మారాలి. ఇది 3 స్థాయిల్లో సాగుతుంది — శరీరం → ప్రాణం → చిత్తం.


బల (శరీర + శక్తి నియంత్రణ)

ఉదయం (30–40 నిమిషాలు)

సూర్యోదయానికి ముందు లేవడం

గోరువెచ్చని నీరు తీసుకోవడం, 

ప్రాణాయామం

నాడీశోధన – 7 చక్రాలు

భస్త్రిక – 3 రౌండ్లు (తేలికగా)

కపాలభాతి – 20–30 (బలవంతం కాదు)

“నా శరీరం, ప్రాణం ధర్మయాత్రకు సిద్ధమవుతుంది” అనే సంకల్పం...


ఇక ఆహారం విషయానికి వస్తే, 

తేలికపాటి సాత్విక భోజనం

వారానికి 1 రోజు ఉపవాసం / ఫలాహారం


సాయంత్రం నిశ్శబ్ద నడక (ఫోన్ లేకుండా) – 15 నిమిషాలు

అడుగుల శబ్దం, శ్వాస మీద దృష్టి

దాని ఫలితం: ఆకలి, అలసటపై నియంత్రణ


అతిబల (మనస్సు + స్థిరత్వం) వస్తుంది.


ధ్యానం (రోజుకు 20 నిమిషాలు)

కూర్చొని శ్వాస చూడడం

భావాలు వచ్చినా తీర్పు ఇవ్వక గమనించడం

మంత్రస్మరణ - “రామ” నామ జపం (శబ్దం కాదు, భావంతో)


మానసిక సాధన

రోజుకు ఒకసారి అడగాలి: “ఇది ధర్మమా? లేక నా కోరికనా?”


వీటి ఫలితం: భయం, ఆందోళన తగ్గుతుంది

ప్రకృతితో ఐక్యత – కొనసాగింపు సాధనగా, వారానికి 1 రోజు

చెట్టు కింద 10 నిమిషాలు కూర్చోవడం నేలపై పాదాలు పెట్టి శ్వాస తీసుకోవడం చెయ్యాలి. 


ఇక త్యాగ సాధన

వారానికి ఒక అలవాటు తగ్గించంకుంటే సమూల మార్పులు వస్తాయి. 


వీటి ఫలితం: ప్రకృతి సంకేతాల పట్ల సున్నితత్వం

కొన్ని రోజుల తర్వాత మార్పులు

శరీర శక్తి నిలకడ

మనస్సు స్థిరత

నిర్ణయాల్లో స్పష్టత

ప్రకృతితో అనుబంధ భావన


ఇదే ఆధునిక బల–అతిబల సాధన మార్గం 


- ఇన్ని చేసే ఓపిక ఈ రోజుల్లో ఎవరికి ఉంది. వాళ్ళని వీళ్ళని తిట్టడానికే సమయం సరిపోవడం లేదు ఇక్కడ. అంత చేసి రాముడికి కొబ్బరికాయ కొడితే సరిపోతుంది అనే ఆలోచనలో ఉన్నారు.🙏🙏

ప్రశ్నలు - సమాధానాలు

👉ఆండాళ్ అని ఎవరికి పేరు?

= గోదాదేవి.


👉తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


👉ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


👉గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

= శ్రీ విష్ణుచిత్తులు.


👉ఆళ్వారులు ఎంతమంది?

= 12మంది.


👉గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

= భూదేవి.


👉గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

= తమిళభాష.


👉తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

= నాలాయిర్ దివ్యప్రబంధము.


👉శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

= 108.


👉గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

= శ్రీవిల్లి పుత్తూరు.


👉దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

= దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


👉శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

= 196 అడుగులు.


👉‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


👉శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


👉శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


👉పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


👉తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.


👉మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


👉శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


👉తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


👉తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


👉కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


👉శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీ పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


👉ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


👉తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


👉ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


👉నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.


👉మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


👉శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


👉‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


👉మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


👉లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


👉పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


👉విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


👉విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


👉తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


👉గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


👉తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


👉గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


👉తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీ పెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


👉కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


👉తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


👉సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము (విష్ణువనే ఓడ)


👉పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


👉ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


👉ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


👉వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


👉ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


👉ముప్పయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


👉గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


👉శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

= అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


👉శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


👉గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).


👉తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


👉శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


👉శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


👉భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్....స్వస్తి...


ఆండాళ్ తిరువడిగలే శరణం ...జై శ్రీమన్నారాయణ....

ధనుర్మాసం – శివ ప్రాశస్త్యం

ఈరోజు (18-Dec-2025) నుండి ధనుర్మాసం ప్రారంభం గోదాదేవి ఎవరు ?  పాశురాలు అంటే ఏమిటి ?   వాటి పరమార్ధం ఏమిటి ?

గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది. 

తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై. 

పాశురాల పరమార్ధం

తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది. 

తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది. 

చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది. 

👉 ధనుర్మాసం – శివ ప్రాశస్త్యం 

ఋషిపీఠం 

మార్గశిరమాసం ఆర్ద్రానక్షత్రం నాడు శివుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవపురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం. ఉషఃకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రాచీన కాలం నుండి నేటివరకు వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాట శైవాలయాలలో ఉషఃకాల పూజ జరుగుతోంది. ఆ సమయంలో మాణిక్యవాచకుని ‘తిరువెంబావై-తిరుప్పళి ఎళుచ్చి' పఠనం చేయడం కూడా ఆనవాయితీ. అయితే వైష్ణవం కూడా శ్రీరామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది 'తిరుప్పావై' ఇక్కడి వైష్ణవాలయాలలో పారాయణ చేయడం అలవాటు అయింది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవమతం అవలంబించకపోవడం చేత ఇక్కడి శివాలయాలకు 'తిరువెంబావై' తెలియలేదు. తిరుప్పావై, తిరువెంబావై రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచీ పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ వారి హృదయానుసారం ఈ ఉభయ గ్రంథాలను ఈ ధనుర్మాస సమయంలో పారాయణ చేసుకుందాం. 

Monday, July 7, 2025

లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం పది వాక్యాలలో..

01. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు.  వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు.

ఉదా: కౌరవులు.


02. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి.  నువ్వు కూడ వినాశనం అవుతావు.

ఉదా: కర్ణుడు


03. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా: అశ్వత్థామ.


04. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.

ఉదా: భీష్ముడు.


05. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి వినాశం జరుగుతుంది.

ఉదా: దుర్యోధనుడు.


06. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.

ఉదా: ధృతరాష్ట్రుడు


07. శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

ఉదా: అర్జునుడు.


08. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.

ఉదా: శకుని.


09. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమమార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.

ఉదా: యుధిష్ఠిరుడు


10. అందరి బంధువైనా, అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.

ఉదా: శ్రీకృష్ణుడు


కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉప కథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)

నాలుగు ధర్మాల సారాంశము భారతం.

చెట్టుకు ప్రదక్షణ చేయడం వల్ల ఫలితం

ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొత్తము 7 కోట్ల రకాల వృక్షజాతులు, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములన్నియు స్వర ప్రధానములు. ఉచ్చారణ, అక్షరదోషాలు లేకుండా చెయ్యాలి.* 

భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్రఉచ్చారణ సరిగ్గా చేయలేరు అందుకని అమ్మవారు ఈ 7 కోట్ల మంత్రములను 7 కోట్ల వృక్షజాతులుగా సృష్టించింది.*

వృక్షములన్నియు అమ్మవారి సృష్టిలో భాగమే. అమ్మవారి స్వరూపమే. అందువలనే అమ్మ వారిని వన దుర్గ స్వరూపంగా  పూజిస్తారు.

 మంత్రఅనుష్ఠాన ఫలితమును చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా పొందవచ్చును. రావిచెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు. అదే 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 1008 సార్లు అష్టాక్షరీమంత్రజపం చేసిన ఫలితం పొందుతారు.

మఱ్ఱిచెట్టుకు ప్రదక్షిణ చేస్తే "ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ స్వాహా" అనే కృష్ణమంత్రం జపం చేసిన ఫలితం వస్తుంది.

ఇంటిలో తులసి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది .

ఇంటిలో కడిమి చెట్టు (కదంబవృక్షం) పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం లలితాసహస్రనామం, బాలామంత్రం, పంచదశీ మహామంత్రం, షోడశాక్షరీ మంత్రం జపం చేసిన ఫలితం పొందవచ్చు.

మేడిచెట్టుకు (ఔదుంబర వృక్షము) ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క నవార్ణ మంత్రమును మరియు శ్రీ దత్త మూల మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసిన ఫలితం పొందుతారు.

బిళ్వ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే 1000 సార్లు పంచాక్షరీ మంత్రజపం చేసిన ఫలితం లభిస్తుంది.

జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సూర్యభగవానుడిని అనుష్ఠానం చేసిన ఫలితం పొందవచ్చు.

ఓం నమశ్శివాయ ||

Saturday, July 5, 2025

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం - ఫలశృతి - భావము!!

నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం |

ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ ||


సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు|

ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరిః ||


ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదా (అ)వతు |

దేవ దేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః ||


సర్వత్ర సర్వ కాలేషు మాంగాంబాజా నిరీశ్వరః |

పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు ||


ఫలశృతి: 💐


య యేతత్ వజ్రకవచ మభేద్యం వేంకటేశశితుః |

సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః!!

మృత్యుం తరతి నిర్భయః

మృత్యుం తరతి నిర్భయః


||ఇతి శ్రీ మార్కండేయ కృత వేంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణమ్!! 


   🪷┈┉┅━❀🌀❀┉┅━🪷


"వేంకట వజ్ర కవచస్తోత్రం" మార్కండేయ మహర్షి చెప్పిందని ప్రసిద్ధి. 


ఈ స్తోత్రంలో నాల్గు శ్లోకాలు 'నన్ను రక్షించు గాక ' అని అర్ధం వచ్చేవి. 


చివరి ఒక్కశ్లోకం "ఫలశృతి"  రూపమైనది. 


మొత్తం ఐదు శ్లోకాలు.


భావం : 💐


1.  శ్రీ వేంకటేశ్వరుడు -  సాక్షాన్నారాయణుడు.  పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను.  శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆ స్వామిని స్మరించుటే) నాకు భద్రకవచమై రక్షించుగాక !


2.  వేయి తలలు - అంటే అనంతమైన శిరసులు కల పరమాత్ముడైన వేంకటేశుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువూ, అందరి ప్రాణాలకు నిలయుడూ అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక !


3.  ఆకాశరాజుకూతురు పత్మావతికి భర్త అయిన వేకటేశుడు  నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక ! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక !


4.  అలమేలుమంగమ్మపతి అన్నిటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్ని చోట్లా, అన్ని కాలాలలో నా సత్కర్మల నన్నింటిని రక్షించి వాటిని సఫలం చేయుగాక !


ఫలశృతి భావం: 🕉️


ఈ వేంకటేశ్వరవజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినమూ భక్తితో పఠించేవాళ్ళు మృత్యుభయం లేకుండా ఆనందంగా ఉంటారు. 


లఘు వివరణ: 💐


కవచమంటే శరీరాన్ని రక్షించే సాధనం. అది వజ్రంతో తయారయిందంటే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది.  ఈ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం భక్తులపాలిటికి వజ్రకవచమై వాళ్ళను కాపాడుతుంది.  


శ్రీస్వామివారిని శరణు పొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్ళు అన్ని ఆపదలనుండీ, శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు.  మృత్యుభయం లేకుండా హాయిగా వుంటారు (మృత్యువు కంటే మృత్యు భయం గొప్పది).


🙏 ,సర్వం శ్రీ వేంకటేశ్వారార్పణమస్తు! 💐


🙏 ఆ ఏడుకొండలవాడు, ఆపదమోక్కులవాడి కరుణ కటాక్షములు మీ మీద ఉండాలని కోరుతూ.....


 🙏 ||ఓం నమో వేంకటేశాయ|| 🙏


        ❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 సర్వే జనాః సుఖినోభవంతు

రేపు తొలి ఏకాదశి , శయన ఏకాదశి

తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.

తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.

ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 

అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 

అన్నదానం చేయడం చాలా మంచిది. 

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు ,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

ప్రాశస్త్యం

ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

Thursday, June 26, 2025

వారాహీ నవరాత్రులు


వారాహీ నవరాత్రులు మొదలు,

అంటే26 జూన్ 2025 నుంచి మొదలు.

  

వీటిని గుప్త నవరాత్రులంటారు. 

రాత్రి సమయాలలో చేస్తారు కాబట్టి వీటికి గుప్త నవరాత్రులని పేరు. 


ఆషాడ మాస పాడ్యమి నుంచి నవమి వరకూ వచ్చే నవరాత్రులను "శ్రీ వారాహీ నవరాత్రులు" అని పిలుస్తారు. 

శ్రీ లలితా దేవి యొక్క దండనాయిక (సేనానాయిక) శ్రీ వారాహీ మాత.

ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్దరింపబడతారని శాస్త్ర వచనం.

ఆషాడ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి. ఆరోగ్యం కోసం పూజించాలి. 


ఆమె భూదేవికి మరో రూపం, వరాహ స్వామి యొక్క స్త్రీ రూపం.


లలితా దేవి యొక్క దండిని రూపం వారాహి మాత.

ఈమె అన్యాయాన్ని ఎదిరించి, చెడును శిక్షించి ఆశ్రితులకు రక్షణ ఇచ్చే దేవత.

ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు.


శత్రు సంహారం జరుగుతుంది.


రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడిపంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. 


ఈ తల్లి మంత్రం సిద్దిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది.

వారాహి దేవత మాతృకా దేవత. సముద్రపు లోతులలో దాచి పెట్ట బడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మ తత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళ్ళతో పెకలించి పారేయగలదు.

ఈ తల్లిని రాత్రివేళల్లో పూజించాలి 

శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.

దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి దేవత వరాహుని స్త్రీతత్వం.

వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో... 

శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

వారణాసి లో ఉన్న ఈమె ఆలయానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈమే వారణాశికి గ్రామదేవత కూడా. 


లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ, తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. 


వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.

(గురు ముఖతా మంత్రం స్వీకరించాలని మనవి)

లలితాదేవి ఆజ్ఞా చక్రము నుంచి ఉద్భవించింది అంటారు. 

ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .


వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.

బౌద్ధ మతం వారు వజ్ర వారాహి మాతగా పూజిస్తారు .

ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత .


ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం ఈ తల్లి. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం.

ఇది బాహ్యార్ధం .


అంతరార్థం ఏమిటంటే అహంకార నివారించి జ్ఞానం ప్రసాదిస్తుంది యని.


ప్రతీ మనిషిలోనూ వారాహీ శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులలో క్రియా శక్తి రూపం వారాహి దేవి. 


ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహీ నవరాత్రులలో వారాహీ దేవిని కొలుస్తుంటారు. 


“1.పంచమి, 

2. దండనాథా, 

3. సంకేతా, 

4. సమయేశ్వరి, 

5. సమయ సంకేతా, 

6. వారాహి, 

7. పోత్రిణి , 

8. వార్తాళి ,

9. శివా, 

10. ఆజ్ఞా చక్రేశ్వరి ,

11. అరిఘ్ని 

12. మహా స్నానేశ్వరి

అన్న ఈ పన్నెండు నామాలు చదువుకున్నా చాలు ఈ తొమ్మిది రోజులు. 


లేదా 


“కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |” అన్న లలితా నామాలలో కాని, అమ్మవారి స్తోత్రం చేస్తే ఫలితాలు ఉంటాయి. 


ఆషాఢ వారాహి నవరాత్రులు రేపటి నుంచి మొదలు. 


1. ఉన్మత్త వారాహి 

ఆషాడ శుక్ల పాడ్యమి 

(ఇంద్రాణి దేవి)

2. బృహత్ వారాహి  

శుక్లపక్ష విదియ 

(బ్రహ్మి దేవి )

3 స్వప్నవారాహీ పూజ 

శుక్ల తదియ 

(వైష్ణవి దేవి)

4 కిరాతవారాహి  

ఆషాడ శుక్ల చవితి 

(మహేశ్వరి ) 

5. శ్వేత వారాహి  

తిథి శుక్ల పంచమి (విశేషం )

(వారహి )

6 : ధూమ్రవారాహి  

శుక్ల షష్టి 

(మహేశ్వరీ )

7,మహావారాహి  

శుక్ల సప్తమి (చాముండి )

8 :వార్తాలి వారాహి 

శుక్ల అష్టమి (విశేషం )

(మహాగౌరి, మహా లక్ష్మి, అష్ట మాతృకగా లక్ష్మి దేవిని పూజిస్తారు )

9 :దండిని వారాహి పూజ

శుక్ల నవమి (లలితా )

10: ఆది వారాహి మహపూజ మరియు ఉద్యాపన (Parana) 

శుక్ల నవమి /దశమి


అందరూ ఆ జగదంబను వారాహీ రూపములో సేవించి ఉత్తమఫలితాలు పొందటానికి అనువైన కాలమిది.

Tuesday, June 24, 2025

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. 

కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు.

కానీ...!!

ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. 

ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 లోపే అంతిమయాత్ర అవుతుంది.

ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. 

శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది, శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు.

ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదనలో లీనమై పోతుంది. 

ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. 

శరీరాన్ని దహనం చేసే దాకా ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.


పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

 ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద, ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. 

అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. 

అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి.


శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. 

ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది.

 కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. 

కుండను కింద పడేసి పగలగొడతారు , అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తారు,

ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.


మన సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. 

కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు, అదే మన ఖర్మ.

ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే , ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను

కానీ ఎందుకు చేస్తున్నానో తెలియదు.


ఎవరూ భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి, అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.

Monday, April 28, 2025

సనాతన ధర్మం

 రచన.                ఋుషి/ కవి

1-అష్టాధ్యాయి -  పాణిని

2-రామాయణం -  వాల్మీకి

3-మహాభారత—  వేదవ్యాస్

4-ఎకనామిక్స్ -    చాణక్య

5-మహాభాష్య -    పతంజలి

6-సత్సహసారిక సూత్రం-    నాగార్జున

7-బుద్ధచరిత -     అశ్వఘోష

8-సౌంద్రానంద్ -  అశ్వఘోష్

9-మహావిభాషాస్త్రం - వసుమిత్ర

10- స్వప్నవాసవదత్త -  భాస్

11-కామసూత్ర -   వాత్స్యాయన

12-కుమారసంభవం -  కాళిదాస్

13-అభిజ్ఞాన్శకుంతలం - కాళిదాసు

14-విక్రమోర్వశియన్ -  కాళిదాస్

15-మేఘదూత్ -  కాళిదాస్

16-రఘువంశం -  కాళిదాస్

17-మాళవికాగ్నిమిత్రం -  కాళిదాస్

18-నాట్యశాస్త్ర - భరతముని

19-దేవి చంద్రగుప్తం -  విశాఖదత్తు

20-మృచ్ఛకటికం -  శూద్రక్

21-సూర్య సిద్ధాంత -  ఆర్యభట్ట

22-వృహత్సింత -  బరమిహిర్

23-పంచతంత్ర. -  విష్ణు శర్మ

24-కథాసరిత్‌సాగర్ -  సోమదేవ్

25-అభిధమ్మకోష్ -  వసుబంధు

26-ముద్రరాక్షస -  విశాఖదుత్త

27-రావణ సంహారం. - భటిట్

28-కిరాతార్జునీయం -  భారవి

29-దశకుమార్చరితం -  దండి

30-హర్షచరిత -  వనభట్ట

31-కాదంబరి -  వనభట్ట

32-వాసవదత్త -  సుబంధు

33-నాగానంద్ -   హర్షవధన్

34-రత్నావళి -  హర్షవర్ధన్

35-ప్రియదర్శిక -  హర్షవర్ధన్

36-మాల్తీమాధవ్ -  భవభూతి

37-పృథ్వీరాజ్  -  విజయ్ జయనక్

38-కర్పూర్మంజరి -  రాజశేఖర్

39-కవితమాన్స -  రాజశేఖర్

40-నవసాహసంక్ చరిత్ -  పదం గుప్తా

41-శబ్దశాసన్ -  రాజ్భోజ్

42-బృహత్కథామంజరి -  క్షేమేంద్ర

43-నైషధచరితం -  శ్రీహర్ష్

44-విక్రమంకదేవచరిత -  బిల్హణ

45-కుమార్‌పాల్చరిత్ -  హేమచంద్ర

46-గీత్‌గోవింద్ -  జైదేవ్

47-పృథ్వీరాజ్రసో -  చంద్రవర్దై

48-రాజతరంగిణి -  కల్హన్

49-రస్మల -  సోమేశ్వర్

50-శిశుపాల్ వధ -  మాఘ

51-గోద్వహో -  వాక్పతి

52-రామచరిత్ -  సంధ్యాకర్నంది

53-ద్వ్యాశ్రయ కవిత్వం -  హేమచంద్ర


వేద జ్ఞానము:-


Q.1- వేదం అని దేనిని అంటారు?

జవాబు- దివ్య జ్ఞాన గ్రంథాన్ని వేదం అంటారు.


Q.2- వేదాల జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు?

సమాధానం: దేవుడు ఇచ్చాడు.


Q.3- దేవుడు వేదాల జ్ఞానాన్ని ఎప్పుడు ఇచ్చాడు?

సమాధానం- సృష్టి ప్రారంభంలో భగవంతుడు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు.


Q.4- దేవుడు వేదాల జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు?

సమాధానం- మానవజాతి సంక్షేమం కోసం.


Q.5- ఎన్ని వేదాలు ఉన్నాయి?

సమాధానం: నాలుగు.

1-ఋగ్వేదం

2-యజుర్వేదం

3-సంవేదం

4-అథర్వవేదం


Q.6- వేదాల బ్రాహ్మణులు.

 వేద బ్రాహ్మణుడు

1 - ఋగ్వేదం - ఐతరేయ

2 - యజుర్వేదం - శతపథం

3 - సామవేదం - తాండ్య

4 - అథర్వవేదం - గోపత్


Q.7- వేదాలలో ఎన్ని ఉపవేదాలు ఉన్నాయి?

సమాధానం - నాలుగు.

 వేదం ఉపవేదం

 1- ఋగ్వేదం - ఆయుర్వేదం

 2- యజుర్వేదం - ధనుర్వేదం

 3 -సంవేదం - గాంధర్వవేదం

 4- అథర్వవేదం - అర్థవేదం


ప్రశ్న 8- వేదాలలోని భాగాలు.

సమాధానం: ఆరు.

1 - విద్య

2 - కల్ప

3 - నిరుక్త

4 - వ్యాకరణం

5 - శ్లోకాలు

6 - జ్యోతిష్యం


Q.9- దేవుడు ఏ ఋషులకు వేదాల జ్ఞానాన్ని ఇచ్చాడు?

జవాబు- నలుగురు ఋషులకు.

 వేద ఋషి

1- ఋగ్వేదం - అగ్ని

2 - యజుర్వేదం - గాలి

3 - సంవేదం - ఆదిత్య

4 - అథర్వవేదం - అంగీర


Q.10- భగవంతుడు ఋషులకు వేదాల జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడు?

సమాధానం- సమాధి స్థితిలో.


Q.11- వేదాలలో ఎలాంటి జ్ఞానం ఉంది?

సమాధానం- అన్ని నిజమైన శాస్త్రాల జ్ఞానం మరియు శాస్త్రం.


Q.12- వేదాలలోని అంశాలు ఏమిటి?

సమాధానం: నాలుగు.

 సేజ్ థీమ్

1- ఋగ్వేదం - జ్ఞానం

2- యజుర్వేదం - కర్మ

3- సమవే - ఆరాధన

4- అథర్వవేదం - సైన్స్


Q.13- వేదాలలో.


ఋగ్వేదంలో.

1- మండలం - 10

2 - అష్టపది - 08

3 - సూక్త - 1028

4 - అనువాక్ - 85

5 - రిచెన్ - 10589


యజుర్వేదంలో.

1- అధ్యాయం - 40

2- మంత్రం - 1975


సామవేదంలో.

1- ఆర్చిక్ - 06

2 - అధ్యాయం - 06

3- రిచాయన్ - 1875


అథర్వవేదంలో.

1- కుంభకోణం - 20

2- సూక్త - 731

3 - మంత్రం - 5977


Q.14- వేదాలను చదివే హక్కు ఎవరికి ఉంది? జవాబు: వేదాలను చదివే హక్కు మానవులకు మాత్రమే ఉంది.


Q.15- వేదాలలో విగ్రహారాధనకు నిబంధన ఉందా?

సమాధానం- అస్సలు కాదు.


Q.16- వేదాలలో అవతారవాదానికి ఆధారాలు ఉన్నాయా?

సమాధానం లేదు.


Q.17- అతిపెద్ద వేదం ఏది?

సమాధానం-ఋగ్వేదం.


Q.18- వేదాలు ఎప్పుడు ఉద్భవించాయి?

సమాధానం- వేదాలు సృష్టి ప్రారంభం నుండి భగవంతునిచే ఉద్భవించబడ్డాయి. అంటే 1 బిలియన్ 96 కోట్ల 8 లక్షల 43 వేల సంవత్సరాల క్రితం.


Q.19- వేద-జ్ఞానానికి సంబంధించిన ఎన్ని సపోర్టింగ్ ఫిలాసఫీలు (ఉప భాగాలు) ఉన్నాయి మరియు వాటి రచయితల పేర్లు ఏమిటి?

సమాధానం-

1- న్యాయం యొక్క తత్వశాస్త్రం - గౌతమ ముని.

2- వైశేషిక దర్శనం - కనద్ ముని.

3- యోగదర్శనం - పతంజలి ముని.

4- మీమాంస తత్వం - జైమిని ముని.

5- సాంఖ్య తత్వశాస్త్రం - కపిల్ ముని.

6- వేదాంత తత్వశాస్త్రం - వ్యాస ముని.


Q.20- గ్రంధాల సబ్జెక్ట్‌లు ఏమిటి?

సమాధానం- ఆత్మ, భగవంతుడు, ప్రకృతి, ప్రపంచం యొక్క మూలం, విముక్తి అంటే అన్ని రకాల భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానం-శాస్త్రం మొదలైనవి.


Q.21- ఎన్ని ప్రామాణికమైన ఉపనిషత్తులు ఉన్నాయి?

సమాధానం: పదకొండు మాత్రమే.


Q.22- ఉపనిషత్తుల పేర్లు చెప్పండి?

సమాధానం-

01-ఇష్ (ఈశావాస్య)

02-చేయవచ్చు

03-కఠినమైనది

04-ప్రశ్న

05-ముండక్

Sunday, March 9, 2025

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏


ఆదిత్యాయ చ సోమాయ

మంగళాయ బుధాయ చ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!!


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ 01. రవి (ఆదిత్య): 🙏


జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్!

తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!!


భావము: 🌹


దాసనచెట్టుపువ్వు రంగుతో సమానమైన ఎరుపు రంగు కలవాడు, కాశ్యప వంశంలో జన్మించినవాడు, గొప్ప కాంతి కలవాడు, చీకటికి శత్రువు, అన్ని పాపములను పోగొట్టేవాడు అయిన సూర్యభగవానునికి నమస్కరించుచున్నాను.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ 02. చంద్ర (సోమ): 🙏


దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవమ్!

నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్!!


భావము: 🌹


పెరుగు, శంఖము, మంచు మొదలైనవాటి తెలుపురంగుతో సమానమైన తెలుపురంగు కలవాడు,  పాలసముద్రం నుండి పుట్టినవాడు, శివుని యొక్క కిరీటము నందు అలంకారమైనవాడు, కుందేలు గుర్తుగా కల్గినవాడు, ఉమతో కూడిన శివుని యొక్క మూర్తులలో ఒకడైన (స+ ఉమ=సోమ) సోమునికి నమస్కరించుచున్నాను.


విశేషము: 🌈


చంద్రమా మనసో జాతః... 

భగవంతుని మనస్సు చంద్రుడు.. . 

శ్రద్ధతో ఈ శ్లోకం చదవటం ద్వారా మనస్సుకు బలం కలుగుతుంది.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ 03. కుజ (మంగళ): 🙏


ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్!

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్!!


భావము: 🌹


భూమికి జన్మించినవాడు, మెఱుపు వంటి కాంతి కలవాడు, బాలుడు, శక్తి అనే ఆయుధం హస్తము నందు కలవాడు, శుభములను, క్షేమమును ప్రసాదించే అంగారకుని (కుజుని) కి నమస్కరించుచున్నాను.


విశేషాలు: 🌈


1. శక్తి హస్తమందు కలవాడు.

(1. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి,  

2. ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము 

3. సత్వము, రజస్సు, తమస్సు 

అను శక్తులను తన అధీనమందు కలిగినవాడని తాత్పర్యం.) 


2. భూమికి జన్మించినవాడు

మంగళవారానికి అధిపతి అయిన కుజుడు భూమి కుమారుడు. ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని భావించడు. అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అన్నారు పెద్దలు.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ 04. బుధ: 🙏


ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్! 

సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్.


భావము: 🌹


ప్రేంకణపు చెట్డు అనగా కదంబవృక్షపు మొగ్గ వలె ఆకుపచ్చని రంగు కలిగినవాడు, తన ఆకారములో ఎవరితోనూ సాటిలేని వాడు, సోముడు దేవతగా కలవాడు, సత్వగుణముతో కూడినవాడూ అయిన బుధునికి నేను నమస్కరింతును.


విశేషం: 🌈

✅👉 బుద్ధికి సంబంధించిన ప్రతిబంధకాలను ఈ బుధ స్తోత్రం తొలగిస్తుంది.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ 05. గురు: 🙏


దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ | 

బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||


భావము: 🌹


క్రీడించేవారిని దేవతలంటారు. అటువంటి దేవతలకు; జ్ఞానము యొక్క సారము పొందినవారు ఋషులు. అటువంటి ఋషులకి ; సర్వార్ధములు చెప్పే గురువుకి; 

ప్రకాశించేది కాంచనం. అటువంటి బంగారముతో సమానమైన కాంతి కలవానికి; దేనిచేత తెలియబడుతుందో అది బుద్ధి. అటువంటి బుద్ధి కలవారిలో శ్రేష్ఠునికి; మూడు లోకములకు ప్రభువైన; దేవతలు వేదమంత్రములను బృహత్తులు అంటారు. వాటికి ప్రభువు బృహస్పతికి; నమస్కరించుచున్నాను.  


విశేషాలు: 🌈


1. ఇందులోని త్రిలోకేశ పదం - జాగ్రత్, స్వప్న సుషుప్తావస్థలను సూచిస్తుంది. ఈ మూడు దశలలోను బుద్దిని సరిగా ఉంచుటకు గురు గ్రహ ప్రార్ధన ఉపయోగపడుతుంది.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ 06. శుక్ర: 🙏


హిమ కుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||


భావము: 🌹


చల్లని మంచులా, మొల్ల పుష్పము వలె, తామరతూడువలె పోలిక కలిగినవాడు, రాక్షసులకు పరమశ్రేష్ఠుడైన గురువు, అన్ని శాస్త్రములను చక్కగానెరిగినవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను.


విశేషాలు: 🌈


1) ఈ శుక్ర గ్రహ స్తోత్రం బలాన్ని, ఉత్సాహాన్ని కలుగచేస్తుంది.


2) శుక్రమనగా తేజస్సు. అది కలవాడు శుక్రుడు.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ 07. శని: 🙏


నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం| 

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||


భావము: 🌹


నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు, సూర్యభగవానుడి పుత్రుడు, యముడికి సోదరుడు, ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను.


విశేషములు: 🌈


మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలిచి భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు. ఒక విశేషం గమనించండి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది.


ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. 


కనుక,  ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే. శని అని ఏలినాటి శని అని ఎవరన్నా చెబితే భయపడకండి చక్కగా అతన్ని స్మరించండి చాలు ఆయన అదుపులో వున్న అన్ని సమస్యలనుండి బయటపడేస్తాడు. అంతేకాని జాతకాల పేరిట మోసం చేసావారికి దూరంగా వుండండి.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ 08. రాహువు: 


అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనమ్ |

సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||


భావము: 🌹


సగము శరీరము కలవాడు;  మహావీరుడు;  చంద్రుడిని సూర్యుడిని కబళించి, విడచువాడు;  సింహిక - హిరణ్య కశిపుని చెల్లెలు. ఆమె కొడుకు; అయిన రాహు గ్రహమునకు ; నేను నమస్కరింతును.;


విశేషాలు: 🌈


👉 రాహుగ్రహదశ 18 సంవత్సరాలు.


👉 రాహువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన అవయవము చెడిపోవటానికి సహాయం చేస్తాడు. విషాహారం తినుట, పాముకాటు, తేలుకాటు, కుష్ఠు, కాన్సర్ మొదలైన వాటిని కలిగిస్తాడు. 


👉 మోహిని అవతారంలో విష్ణు మూర్తి రాహు కేతువుల శిరస్సును చక్రా యుధంతో ఖండించాడు. అప్పటికే గొంతు వరకూ దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి. సగం శరీరం కలవారు అనగా అర్థ కాయులయ్యారు.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ 09. కేతు: 🙏


ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్||


భావము: 🌹


మోదుగ పువ్వుతో సమానమైన పోలిక కలవాడు;  నక్షత్రాలకు, గ్రహాలకు శిరస్సు వలె ఉండునది; భయంకరమైనది; తీక్షణతతో కూడినది;  భయం కలిగించేది అయిన; ఆ కేతుగ్రహమునకు;  నేను నమస్కరింతును;


విశేషాలు: 🌈


👉 పుష్పములతో మాంసమును తినుదానివలె ఉండేదానిని సంస్కృతంలో 'పలాశము' అంటారు.


🙏 *సర్వేజనాః సుఖినోభవంతు

🙏🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹🙏

భోజన వడ్డన, భోజన విధి

 1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి. 2.తూర్పు, దక్షిణ, పడమర ముఖంగా కూర్చుని తినాలి.  3..మోదుగ, అరటి, పనస, మేడి ఆకులలో భోజనం ఉత్తమం  4.ఎ...