ఈరోజు (18-Dec-2025) నుండి ధనుర్మాసం ప్రారంభం గోదాదేవి ఎవరు ? పాశురాలు అంటే ఏమిటి ? వాటి పరమార్ధం ఏమిటి ?
గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.
తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.
పాశురాల పరమార్ధం
తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.
తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.
చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.
👉 ధనుర్మాసం – శివ ప్రాశస్త్యం
ఋషిపీఠం
మార్గశిరమాసం ఆర్ద్రానక్షత్రం నాడు శివుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవపురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం. ఉషఃకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రాచీన కాలం నుండి నేటివరకు వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాట శైవాలయాలలో ఉషఃకాల పూజ జరుగుతోంది. ఆ సమయంలో మాణిక్యవాచకుని ‘తిరువెంబావై-తిరుప్పళి ఎళుచ్చి' పఠనం చేయడం కూడా ఆనవాయితీ. అయితే వైష్ణవం కూడా శ్రీరామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది 'తిరుప్పావై' ఇక్కడి వైష్ణవాలయాలలో పారాయణ చేయడం అలవాటు అయింది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవమతం అవలంబించకపోవడం చేత ఇక్కడి శివాలయాలకు 'తిరువెంబావై' తెలియలేదు. తిరుప్పావై, తిరువెంబావై రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచీ పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ వారి హృదయానుసారం ఈ ఉభయ గ్రంథాలను ఈ ధనుర్మాస సమయంలో పారాయణ చేసుకుందాం.
No comments:
Post a Comment