Monday, July 29, 2019

కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం

తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం.

వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు

కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.

అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో కాళీతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్దాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.

ఆనంద తాండవం

చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు.
అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.

శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు.
అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు.
అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.

స్వామివారిని సేవిస్తే

పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.దీనికి విభాసిత మహర్షి , వృద్దేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు.
దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.
ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.

ఆశ్చర్యం ఆకులు నాణ్యాలుగా

ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి " చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత " అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.

మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూరు కొలనులో ...

ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు.
దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు.
ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం.అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.

5 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత

ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది.
ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5 5.
వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు.
ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు.
ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి.
అదే విధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి.
వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు.
ఇక్కడ 5 రథాలు ఉన్నాయి.
ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు.
ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు.

పాతాళ వినాయకుడు

శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విగ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు.

ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు :

ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.

సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ట చేసిన 28 శివలింగాలు

శైవ సిద్దాంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని నమ్ముతారు.

ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.

ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ

అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే
ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.
దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.ప్రసాద్.వడ్డమాను

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...