Saturday, August 25, 2018

తపస్సు అంటే ఏమిటి ?

ఒక మంత్రాన్నో…, ఏదో ఒక
దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే
తపస్సు అనుకుంటే పొరపాటు. ‘తపనే’ తపస్సు. ఒక
కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే…,
ఆరాటపడడమే ‘తపస్సు. అలా తపించినంత మాత్రాన.,
ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే
సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా
ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే…మనస్సంకల్పానికి
ఉన్న శక్తి, బలము…. ఈ సృష్టిలో దేనికి లేదు.
ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే
తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. ఆయుధాన్ని
నిరంతరం వాడుతూంటే పదునుదేలి..దాని పనితనాన్ని
చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ
మీకో సందేహం రావచ్చు.‘అయ్యా.. మనస్సు
నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే
ఉంటుంది కదా అని.’ నిజమే…ఆలోచించడం వేరు.
ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి
ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు. చంచలమైన
మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన
లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును
మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే., తపస్సు
అంటారు.
అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే
చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే
తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని
కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు.
తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా…
ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ?
అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని
మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి
ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన
కీటకం ‘సీతాకోకచిలుక’. దీని పుట్టుక చాలా వింతగా
ఉంటుంది.
సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి
పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి
కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల
నుంచి సీతాకోకచిలుకలు రావు. గొంగళిపురుగులు
వస్తాయి. ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా
అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో.,
రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ
కాలం గడుపుతుది. అలా కొంత కాలం గడిచాక తన
జీవింతం మీద విరక్తి కలిగి.,ఆహార, విహారాలు
త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి పోయి., తన
చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి
స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని
తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని
బయటకు వస్తుంది. అయితే అది గొంగళిపురుగులా
రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది
ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే
మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి
గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో
చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే
ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ
సంసార లంపటంలో చిక్కుకోక భగవన్నామామృత పానంతో
తరిస్తాడు.
పుట్టిన ప్రతిమనిషి ఒక గొంగళి పురుగులా జీవిస్తూ ఉంటాడు .తరువాత క్రమంలో తపస్సు ( ధ్యానం )చేత నేనే భగవత్ స్వరూపుడను అని తెలుసుకొని ఈ సంసార జగత్తులోచిక్కుకోకుండా   అందమైన సీతాకోక చిలుకలా  ఆనందమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు . ఇదే తపస్సు (ధ్యానం ) ఇచ్చే ప్రతిఫలం .

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...