Thursday, August 23, 2018

భరద్వాజ మహర్షి

వేదాలను అర్ధం చేసుకోవడానికి తన జీవితకాలాన్ని వెచ్చించినవాడు భరద్వాజమహర్షి. ఆయన దేవతల గురువైన బృహస్పతి కుమారుడు.  బృహస్పతి,  ఆంగీరస మహర్షి కుమారుడు. భరద్వాజుని కుమారుడే కురుపాండవులకు గురువు అయిన ద్రోణాచార్యుడు.   భరద్వాజునికి ఘృతాచి అనే అప్సరస వలన జన్మించినవాడు ద్రోణాచార్యుడు.  భరద్వాజుడు  సుశీల అనే భార్య ద్వారా గర్గ మహామునికి  జన్మనిచ్చాడు.   భరద్వాజునికి దేవవర్ణిని,  అనే కుమార్తె  కూడా  వున్నది.   

 భరద్వాజుడు తండ్రి నుండి అపారమైన పాండిత్యం సంపాదించినవాడు.  ఏకాగ్రతతో తనకు కావలసిన విద్యను నేర్చుకోవడంలో ఆయన దిట్ట.  ఆయుర్వేదాన్ని లోకానికి పరిచయం చేసినవాడు భరద్వాజుడు.  వాల్మీకి, బోయవాడు క్రొంచ పక్షిని బాణంతో కొట్టినప్పుడు, చెప్పిన , రామాయణ ప్రారంభ శ్లోకం సమయంలో, భరద్వాజుడు అక్కడ ప్రత్యక్ష సాక్షి.

మహర్షి  కఠోర వేదపాండిత్య గ్రహణాభిలాష  ఒకప్పుడు ఇంద్రుడిని యిబ్బంది పెటింది.   భరద్వాజునికి వేదాలన్నీ తన జీవితకాలంలో అవపోశన పట్టాలని తీరనికోర్కె యేర్పడింది.  తన జీవితకాలం నూరు సంవత్సరాలని తెలుసు.  ఆలోపు వేదాలను అభ్యసించలేనని తెలిసి, ఇంద్రుని  ప్రార్ధించి, తనకు మూడువేదాలూ అభ్యసించడానికి,  మరియొక  నూరు సంవత్సరాలు ఆయువు ప్రసాదించమని కోరాడు.

మహర్షిలో వున్న జ్ఞానతృష్టకు ఇంద్రుడు సంతోషించి ' తధాస్తు '   అని దీవించి, మరి యొక్క నూరు సంవత్సరాలు ఆయుర్దాయం పెంచాడు.    రెండవశతాబ్ది పూర్తి అవుతున్నా, తన వేద అభ్యాసానికి అంతు కనబడలేదు.  యెంతో వ్యాకుల పడుతూ, భరద్వాజమహర్షి, ఇంద్రుని మరలా యెంతో నిష్ఠతో ప్రార్ధించి, యింకొక వంద సంవత్సరాలు ఆయుర్దాయం అడిగాడు.  ' సరే ' అన్నాడు ఇంద్రుడు.  ఆవిధంగా, భరద్వాజ మహర్షి అయిదుసార్లు తన ఆయు: ప్రమాణం, ఇంద్రుని కటాక్షం వలన పెంచుకుని,  వేదాలనన్నిటినీ చదివి, వానిలో విషయాన్నీ తెలుసుకునే  ప్రయత్నంలో పడ్డాడు.   

ఆవిధంగా అయిదువందల సంవత్సరాలు వుండి కూడా  భరద్వాజుడు వేదాల సారాన్ని గ్రహించలేకపోయాడు.  మళ్ళీ ఇంద్రుని ప్రార్ధించగా,  ఇంద్రునికి అర్ధమైంది, భరద్వాజునికి తాను దిశానిర్దేశం చెయ్యవలసిన సమయం ఆసన్నమైందని. 

భరద్వాజుడు మళ్ళీ ఆయుర్దాయం పెంచమని అడిగేలోపే,  ఇంద్రుడు భూ:  భువ: సువః     అనే మూడు శబ్దాలు వుచ్చరించి  మూడు పెద్ద పర్వతాలను భరద్వాజుని కనులముందు సృష్టించాడు.    భరద్వాజుడు తాను నేర్చుకున్న వేదాల పరిజ్ఞానం యీ విధంగా తన కనులముందు ఇంద్రుడు చూపిస్తున్నాడు అనుకుని  ఆసక్తిగా చూడసాగాడు. 

అప్పుడు ఇంద్రుడు భరద్వాజుని వైపు జాలిగా చూస్తూ,   ఆమూడు పర్వతాలనుండి, పిడికెడు  మట్టిని తీసుకువచ్చి,  ' ఓ మహర్షీ !  యీ అయిదు శతాబ్దాలుగా నీవు నేర్చుకున్న వేద విజ్ఞానం యిదిగో, యీ మట్టి పరిమాణమంతా.  నీవు నేర్చుకోవలసినది, ఆ మూడు పర్వతములంత "  అని చెప్పి, భరద్వాజుని దిగ్భ్రాంతికి గురిచేసాడు.

భరద్వాజ మహర్షికి అర్ధమయింది.  ' నేను అయిదు శతాబ్దాల నుండి వేదాలకై సాధన చేశాను కానీ, దానిని పొందడం అంత కష్టమని తెలుసుకోలేక పోయాను. ' అని పరితపించి, ఇంద్రుని శరణుకోరాడు, దారి చూపమని.  అప్పుడు ఇంద్రుడు, '   మహర్షీ !  వేద విజ్ఞానం అపరిమితం.  ఒక్క మహావిష్ణువుకే  వేదసారమంతా తెలుసు.    మనం తెలుసుకోవలసింది, వేదముల  ఉపయోగము, మానవ జీవితంలో యెంత వరకు అని. అది తెలుసుకుని ఆచరించడమే.  అన్నివేదాల పరమార్ధము ఆ శ్రీ మహావిష్ణువే.   అయన గురించి తపస్సు చెయ్యి.  ఆయనే నీకు కావలసిన లక్ష్యం నెరవేరుస్తాడు. '  అని చెప్పాడు.  అప్పుడు భరద్వాజుడు తెలుసుకున్నాడు, '  వేదాలను పూర్తిగా గ్రహించడమంటే, శ్రీహరి కైవల్యం పొందడమేనని. '

ఇంద్రుడు చెప్పిన విధంగా,  భరద్వాజుడు, శ్రీహరిని ప్రార్ధించడానికి అనువైన ప్రదేశం వెదికి, చివరకు, మట్టపల్లి అనే గ్రామం (  తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా ) వెళ్లి, అక్కడ నిత్యమూ, కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తూ,  నరసింహ స్వామిని గురించి తపస్సు చేసాడు.   భరద్వాజుని తపస్సుకు మెచ్చి, నారసింహుడు,  మహర్షికి వైకుంఠ ప్రాప్తి కలుగజేసాడు.  ఓం నమో శ్రీ లక్ష్మీ నారసింహాయ.
   
భరద్వాజ మహర్షి గురించి తెలుసుకోవలసిన విషయాలు అపారం.   ఇది విహంగ వీక్షణమే.
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...