Saturday, August 25, 2018

పద్మశ్రీ ఘంటశాల భగవద్గీత

1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను. యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.

2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా... (1:32)

౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. (2:11)

4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు. (2:13)

5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ(జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. (2:22)

6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది. (2:23)

7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. (2:27)

8. యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము. (2:37)

9.కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. (2:47)

10.దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును. (2:56)

11.విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. (2:62)

12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. (2:72)

13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది. (౩:౩)

14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును. (౩:14) 

15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను. (౩:16)

16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. (౩:21)

17. అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము. (౩:౩౦)

18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. (౩:35)

19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది. (౩:38)

20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను. (4:7,8)

21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. (4:10)

22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు. (4:11)

23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు. (4:19)

24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును. (4:24)

25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. (4:39)

26. కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది. (5:2)

27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)

28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)

29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు. (5:18)

౩౦. దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును. (5:23)

31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును. (5:28)

32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. (5:29)

౩౩. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు. (6:2)

౩4. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము. (6:17)

35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. (6:19)

౩6. సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును. (6:29)

37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును. (6:35)

38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. (6:47)

39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమె నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు. (7:౩)

40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. (7:4)

41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. (7:7)

42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. (7:9)

43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. (7:14)

44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు. (7:16)

45. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు. (7:19)

46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. (8:5)

47. అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. (8:8,9)

48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము. (8:21)

49. జగత్తునందు శుక్ల,కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. (8:26)

5౦. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. (8:28)

51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. (9:7)

52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. (9:22)

53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. (9:26)

54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)

55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును. (10:6)

56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు. (10:9)

57. సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను. (10:20)

58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. (10:22)

59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. (10:౩౦)

6౦. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. (10:41)

61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. (11:5)

62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)

6౩. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు. (11:32)

64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. (11:34)

65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)

66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)

67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. (12:2)

68. అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది. (12:12)

69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. (12:16)

7౦. శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. (12:18,19)

71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. (13:1)

72. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును. (13:11)

7౩. ప్రకృతిని ‘మాయ’ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను. (13:20)

74. శరీరము నశించినను, తాను నశింపక, ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో, వాడే యెరిగినవాడు. (13:27)

75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యెను. కర్మలనాచారించువాడు కాడు. (13:31)

76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు యెళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. (13:౩౩)

77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. (14:1)

78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను(పరమాత్మ) తండ్రి వంటివాడను. (14:4)

79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది. (14:6)

8౦. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది. (14:7)

81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును. (14:8)

82. మానావమనములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు. (14:25)

8౩. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు. (15:1)

84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది. (15:6)

85. దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. (15:14)

86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును. (16:౩,4)

87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను. (16:21)

88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు. (16:23)

89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. (17:2)

9౦. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. (17:4)

91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును. (17:15)

92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. (18:2)

9౩. కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. (18:12)
94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము. (18:౩౦)

95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. (18:61) 
 
96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము. (18:66)                 
                                                                                               
97. ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు. (18:68)

98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? (18:72)

99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. (18:7౩)

100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును. (18:78)

101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...