Wednesday, August 29, 2018

హయగ్రీవ ఆవిర్భవం

శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు. హయగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం. మెడ నుండి పైదాక గుర్రపు ముఖంతోనూ, మెడ కింద భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండటం ఈ అవతారం విశేషం. ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. తెల్లని దేహ ఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి. పురాణాల ప్రకారం హయగ్రీవ స్వామి అవతరణ గాధ ఈ విధంగా ప్రచారంలో ఉంది....

హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు, సృష్టికి ముందున్నవాడు. మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపధ్యంలోనే జరిగాయి.

పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు. ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు.

అమ్మ అలా కుదరదు అంది. హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడ ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం. ఇక అప్పటినుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా విష్ణువుని శరణు వేడారు. విష్ణుమూర్తి చాలాకాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు. ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు.
ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సుకి బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలుకువ వస్తుందన్నాడు. ఆ తాడుని కొరకగల శక్తి ఒక చెద పురుగుకి మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది. దానికే ఆ పని అప్పగించారు. చెదపురుగు త్రాడుని కొరకడంతో ధనుస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకి తగిలింది. ఆ తల ఎగిరి ఎటో దూసుకువెళ్లింది. దానికోసం అన్ని చోట్ల వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్తుతించారు.

ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది. దేవతలు శిరసావహించారు. అలా హయగ్రీవ స్వామి అవతరణ, రాక్షస సంహారం జరిగింది. దేవతలంతా ఆ స్వామిని వేదమంత్రాలతో స్తుతించారు. ఇది జరిగింది శ్రావణపూర్ణిమ నాడు. అప్పటినుండి హయగ్రీవ జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. అందుకే హయగ్రీవ ఉపాసన చేసినా, హయగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించినా జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...