Tuesday, June 13, 2017

హనుమద్వ్రతము ఎక్కడ చేయాలి?

వాస్తవానికి పంపానదీ తీరమునందు కూర్చొని మాత్రమే హనుమద్వ్రతము చేయాలి. వేరొక చోట ఎక్కడ కూర్చొని కూడా హనుమద్వ్రతము చేయరాదు. శాస్త్రము దీనికి ఒక మినహాయింపు ఇచ్చింది. నువ్వు పంపా నదీ తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశం పెట్టి అందులో నీరు పోసి దానికి దారములు కడతారు. అది శాస్త్రము తెలిసిన వారు, ప్రక్రియను నిర్వహించగలిగిన వారు మాత్రమే కడతారు. కలశంమీద కొబ్బ్బరి బొండాం పెట్టి అందులోకి పంపా జలంయొక్క ఆవాహన మంత్రం చెప్తారు. అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్లే లెక్క. అప్పుడు హనుమద్వ్రతం చేస్తారు.

హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు?

పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒకరాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో హనుమద్వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. చేయగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటు వంటి వారిలో ద్రౌపదీ దేవి కూడా ఉన్నది. ద్రౌపదీ దేవి కూడా హనుమయొక్క ఆరాధన చేసి తన భర్తలయొక్క విజయాన్ని పొందగలిగింది. ఆయన కాలాతీతుడు. యుగములు మారిపోతాయి. కానీ హనుమ కనపడతారు మీకు. త్రేతాయుగంలోనూ, ద్వాపరయుగంలోనూ, హనుమ ఉన్నారు. గరుడ గర్వభంగాన్ని చేసిన వ్యక్తి హనుమే. సత్యభామయొక్క గర్వభంగం చేసిన వారు కూడా హనుమే. సత్యభామకి చాలా అహంకారం ఉండేది నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని. అందమునందు ఆవిడకున్న అతిశయమును పోగొట్టాలి అని అనుకున్నారు కృష్ణ పరమాత్మ. భర్తే పోగొడితే అంత మర్యాదగా ఉండదు. కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు గనుక హనుమకి కబురు చేశారు. గరుడుడు వెళ్ళి చెప్పాడు కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు అని. కృష్ణుడితో మాకేం పని? మేము రామ దర్శనమైతేనే చేస్తాం అన్నారు. ఆయనకి రామావతారమునండు ఉన్న ప్రీతి అటువంటిది. రాముడే పిలుస్తున్నారు అని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్వభంగం కూడా చేశారాయన. గరుడ అనుకున్నాడు నా అంత వేగంగా హనుమ ఎక్కడ వెళతాడు. చాలా వృద్ధుడు ఆయన. నా మూపున కూర్చోండి. స్వామి దర్శనానికి తీసుకు వెళతాను అన్నారు. నా స్వామా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడుడి కన్నా వేగం ఉన్నవారు ఉండరు కదా! గరుత్మంతుడు ఆశ్చర్యంగా చూసేసరికి వెళ్ళిపోయాడు. వెనక గరుత్మంతుడు లోపలి వచ్చాడు. సుదర్శనుడు అడ్డు వచ్చి లోపల ఉన్నది కృష్ణుడు, నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఈయనెవరు నాకు అడ్డురావడానికి? అని చటుక్కున చేత్తో పట్టుకొని నోట్లో వేసుకొని మ్రింగేసి లోపలి వెళ్తే కృష్ణుడు రాముడిలా దర్శనమిచ్చారు ఆయనకి. వెంటనే రాముని పాదములపై పడి కన్నీటితో అభిషేకం చేసి ప్రక్కకి చూశారు మా అమ్మ సీతమ్మ పాదాలు ఏవి? అని. సత్యభామాదేవి నిలబడి ఉంది. స్వామీ! ప్రక్కన అమ్మ కదా ఉండాలి. దాసీ ఉన్నదేమి? అని అడిగారు. సత్యభామ ఆశ్చర్యపోయింది. కృష్ణ భగవానుడు ఈమె దాసీ కాదు. ఈ అవతారమునందు నా పత్ని. నీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. హనుమా! నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డగించలేదా? అని అడిగాడు కృష్ణుడు. ఎవరో సుదర్శన చక్రంట, నువ్వెలా లోపలికి వెళ్తావు అన్నాడు, స్వామీ! మ్రింగేశాను అడ్డు వస్తోందని వదిలేస్తాను అని ఒక త్రేనుపు తేన్చి వదిలేశాడు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు హనుమ ఇటు వచ్చాడా? అని. తెల్లబోయి చూశాడు. గరుత్మంతా! చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదు అనుకొనేవాణ్ణి స్వామీ. ఇంతమందికి ఏకకాలంలో పాఠం చెప్పేశాడు. ద్వాపర యుగం వరకు గర్వభంగం చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్ట మైనటువంటి స్వరూపం హనుమయొక్క స్వరూపం. ఆనాడు చంద్రవంశంలో ప్రభవించినటువంటి సోమదత్తుడు అనే రాజు హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్క్రుష్టమైన వ్రతము హనుమద్వ్రతము. వ్రతము చేయడం ఎంతో వ్రతముయొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారనుకోండి హనుమత్ వ్రతాన్ని పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము వచ్చేస్తుంది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...