కేదార్‌నాధ్ దేవాలయం సమీపంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన 'బ్రహ్మకమల్ వాటిక'లో మొదటి సీజన్ లో పుష్కలంగా వికసిస్తున్న "బ్రహ్మ కమలం" పుష్పాలు..
ఈ పువ్వు రామాయణంతో పాటు ఇతర గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది.
సంజీవని అందుకున్న తరువాత లక్ష్మణుడు ఈ బ్రహ్మ కమలంతోనే వర్షం కురిపించాడు.
సీతా మాతకు అమ్మవారిని పూజించను లవకుశలు తెచ్చింది ఈ బ్రహ్మకమలాలనే అని అంటారు.
మన సనాతన హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువు నాభి నుండి వెలువడిన బ్రహ్మ కమలంపై బ్రహ్మదేవుడు ఉద్భవించి అక్కడే కూర్చుని ఉంటాడు. మనం చాలా చిత్రాల్లో ఇది కనపడుతుంది.
సూర్యాస్తమయం తరువాత వికసించే మరియు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే ఏకైక పువ్వు బ్రహ్మ కమలం. మరియు దీనిని బద్రీనాథ్ & కేదార్నాథ్ దేవాలయాలలో అందిస్తారు.
బ్రహ్మ కమలము అనగా శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమల పుష్పము. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని, బ్రహ్మ ఉద్భవించినదే బ్రహ్మకమలము. ఈ బ్రహ్మకమలము ఒక చిత్రమైన పుష్ప రాజము. ఈ పుష్పములతో భగవతుని పూజించిన ఐహికాముష్మిక ఫలములన్నీ లభ్యమవుతాయని పెద్దల వాక్కు.
లక్ష్మీ, సరస్వతీ మాతలు ఆశీనులయ్యేది ఈ బ్రహ్మ కమలముమీదే. దేవతలు సాధారణ కమలాలమీద ఆశీనులు కారు కదా!
దేవ లోకాల్లోని బ్రహ్మ కమలాలకు ప్రతీకగా ఈ భూమి మీద హిమాలయాల్లో ఈ బ్రహ్మకమలాలు ఉంటున్నాయట..
సుమారు 12 వేల అడుగుల ఎత్తులో వున్న హిమాలయాల్లో సంవత్సరానికి ఒకే ఒక్కమారు ఈ బ్రహ్మకమలం పూస్తుంది. ఈ బ్రహ్మకమలం రాత్రి సమయంలోనే వికశిస్తుంది. ఇది వికసించేప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది. హిమాలలయాల్లో సాధకులు, ఋషులు, మహాత్ములు ఈ బ్రహ్మకమలం వికసించటాన్ని చూడటంకోసం ఎంతో ముందుగా అక్కడికి చేరుకుంటారు. అత్యంత అద్భుతమైన ఈ కమలం వికసించటాన్ని చూడాలని రోజుల తరబడి, నెలల తరబడి అక్కడ ఉండి నిరీక్షిస్తారు.
శరదృతువు నుండి వసంత ఋతువు వరకు ఈ మొక్క హిమాలయాల్లోని మంచులో కూరుకుపోయి ఉంటుంది.. చైత్ర మాసం అనగా ఇంచుమించు వేసవి ప్రారంభంకాగానే మంచుకాస్త కాస్త ద్రవీభవిస్తుండగా ఈ మొక్క బయటికి వచ్చి శక్తిని కూడగట్టుకుని పెరుగుతూ శ్రావణ శుద్ధ పూర్ణిమ అర్థరాత్రిన పూర్తిగా వికసిస్తుంది. సాధకులు, మహాఋషులు, సిద్ధ పురుషులైన మహానుభావులు మాత్రామే దీన్ని దర్శించగలరని పెద్దలు చెబుతారు. వారి కోసం మాత్రమే హిమాలయల్లో ఈ అద్భుత మైన బ్రహ్మ కమలం ఇప్పటికీ పుష్పిస్తుంటుందని, ఈ కమల వీక్షణంతో సమస్త పాపములు నశిస్తాయని, ఈ కమలం సూర్యోదయానికి ముందే తిరిగి ముకుళిస్తుంది. కేవలం పూర్ణిమ రోజున అర్ధరాత్రి వికసించి ఉదయానికల్లా ముడుచుకుపోవడం నిజంగా చిత్రమే.
బ్రహ్మ కమలము శాస్త్రీయ నామం Saussurea obvallata. ఇది సన్ ఫ్లవర్ అంటే సూర్యకాంతం [పొద్దుతిరుగుడు] జాతికి చెందిన పూల మొక్క. ఇది హిమాలయ పర్వతాలు మరియూ ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను 'కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్’ అంటారు. ఈ మొక్కపై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. ఇది ఈ మొక్కలోని చిత్రాతి చిత్రమైన విషయం. మందంగా ఉండే ఈ తీగలాంటిమొక్క ఆకు బాగా వృద్ధి చెంది ఆకు బలంగా, మందంగా వచ్చాక ఆకు అడుగుభాగం నుంచి చిన్న మొగ్గ వచ్చి పెరిగి బాగా పెద్దయ్యాక అది రాత్రిపూట వెన్నెల రోజుల్లోనే వికసించి, తెల్లవారేసరికి ముకుళించుకు పోతుంది. ఈ ప్రక్రియను వీక్షించాలంటే మనం రాత్రిపూట ఆ మొక్క వద్ద వేచి చూడాల్సిందే. వికసించేప్పుడు ఈ బ్రహ్మకమలంనుండి వచ్చే సువాసన అంతా ఇంతా కాదు. మన నాశికారంధ్రాలు ఆ వాసనను పీల్చినపుడు మన మనస్సులు ఎంతో ఆనందంగా ఉంటాయి. చాలా మంచి వాసన. ఏ ఇతర పూలకు ఈ వాసన ఉండదనడంలో అతియశయోక్తిలేదు.
ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు,చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మెదడు సంబంధిత వ్యాధులనివారణకూ వాడతారు.
మధ్య హిమాలయాల్లో భోటియా తెగవారు తలనొప్పి, మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు రాచుకుంటారు. మూత్ర సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మందుగా సేవిస్తారుట. దీనితో కొన్ని రకాల నేత్రసంబంధమైన వ్యాధుల నివారణకూడా ఉందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు.
ఈ పుష్పాలుకొన్ని ఊదారంగులో కూడా పూస్తాయంటారు. బద్రీనాథ్ వంటి కొండశిఖరాల్లో ఉండే ఆలయాల్లో ఈ పుష్పాలను నైవేద్యంగా భగవంతునికి నివేదిస్తారు. ఈ పుష్పానికి గుర్తుగా భారత తపాలా శాఖ ఒక పోస్టల్ స్టాంపును కూడా జారీ చేసింది.
సాధారణంగా నేడు మన ఇళ్ళలో లభ్యమయ్యే బ్రహ్మకమలాలు తెల్లని వర్ణంలో మాత్రమే ఉంటాయి. జాగ్రత్తగా పోషించుకుంటే ఇవి ఒక్కో మారు పది పన్నెండు వరకూ పూస్తుంటాయి
No comments:
Post a Comment