ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. దశమితో గుప్తనవరాత్రులు ముగుస్తాయి. ఈ సందర్భంగా వారాహి అమ్మవారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము.
వారాహిదేవి సప్తమాతృకలయిన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండిలలో ఒకరు. ఆమె సప్తమాతృకలలో ఐదవ స్థానంలో వుంది. అందుకని ఆమెను ‘పంచమి’ అని కూడా పిలుస్తారు. ‘మహావారాహి’ అమ్మవారు శ్రీ చక్రం యొక్క పదహారవ(16) ప్రాకారంలో నివాసం ఉంటుంది.
దేవీభాగవతం ప్రకారం రక్తబీజుని సంహరించింది. మార్కండేయపురాణం, వరాహపురాణాలలో కూడా ఈమె ప్రసక్తి కనిపిస్తుంది.
బ్రహ్మాండపురాణం లలితోపాఖ్యానంలో దండనాధ అని పిలవబడే వారాహిదేవి లలితాదేవికి సైన్యాధిపతి (మంత్రిణి శ్యామలాదేవి). వారాహి లలితాదేవి తరఫున పోరాడి, భండాసురిని సోదరుడైన విశుక్రుని వధించింది. వారాహిదేవికి పన్నెండు నామాలున్నాయి. ఆమె యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆకాశమున వున్న దేవతులు విమానములపై వుండి వీక్షిస్తూ ఆమెను పన్నెండు నామాలతో కీర్తిస్తూ నమస్కరిస్తారు. హయగ్రీవుడు దేవియొక్క పన్నెండు నామాలను తెలియజేస్తూ వానిని వినినంతమాత్రాన ఆదేవి ప్రసన్నురాలగునని అగస్త్యునితో అన్నాడు. ఆ పన్నెండు నామాలు 1.పంచమి, 2.దండనాధ, 3. సంకేత, 4. సమయేశ్వరి, 5. సమయసంకేత, 6. వారాహి, 7. పోత్రిణి, 8. వార్తాలీ, 9. మహాసేన, 10. ఆజ్ఞా, 11. చక్రేశ్వరీ, 12. అరిఘ్నీ.
వారాహిమాత శంఖం, చక్రం, నాగలి, రోకలి అభయ వరద హస్తాలతో దర్శనమిస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలిగిపోతాయి, శత్రుభయం వుండదు, జ్ఞానం సిద్ధిస్తుంది. వారాహిదేవి మూల మంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి.
లలిత సహస్రనామాలలో రెండు నామాలకు అర్ధం:
‘కిరిచక్ర రథారూఢ డండనాథా పురస్కృతాయైనమః’- కిరి అంటే వరాహం. వరాహాలు వాహనాలుగా కట్టిన రథానికి కిరిచక్రమని పేరు. అట్టి రథాన్ని అధిరోహించిన దండనాయికయైన వారాహిచే సేవించబడుతూన్న లలితాంబికా నమస్కారములు అని అర్ధము.
‘విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితాయైనమః’- విశుక్రుడు అనే రాక్షసుడుని అంతంచేసిన వారాహిశక్తిని తిలకించి ఆనందిస్తున్న శ్రీమాతకు వందనాలు అని అర్ధం.
No comments:
Post a Comment