Sunday, May 9, 2021

వరాహా జయంతి

భగవంతుడు దుష్టశిక్షణకు , శిష్టరక్షణకు అవసరమైనప్పుడు లోకంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలా అవతరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన అవతారాలు పది. మత్స్య , కూర్మ , వరాహ , నృసింహ , వామన , పరశురామ , శ్రీరామ , శ్రీకృష్ణ , బుద్ధ , కల్కి అనే పేర్లతో దశావతారాలు ప్రాచీన గ్రంథాల్లో కనబడుతున్నాయి.

దశావతారాల్లో మూడవ దైన వరాహావతారం హిరణ్యాక్షుడి చెర నుంచి భూమిని రక్షించడానికి సంభవించిందని పురాణేతిహాసాలు వివరిస్తున్నాయి. పూర్వం దితి కుమారుడు , హిరణ్యకశిపుడి సోదరుడు అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు అహంకారంతో చెలరేగిపోయి భూమిని పాతాళానికి తోసివేశాడు. తన అన్నను చంపిన విష్ణువు అంటే ఇతడికి ద్వేషం. ఆ కారణంగా విష్ణువును వధించాలని వైకుంఠానికి వెళ్తూ ఉండగా , దారిలో నారదుడు ఎదురయ్యాడు. విష్ణువు ఇప్పుడు వైకుంఠంలో లేడని , యజ్ఞవరాహ రూపంలో పాతాళంలో ఉన్నాడని నారదుడు హిరణ్యాక్షుడికి చెప్పాడు. అప్పుడు హిరణ్యాక్షుడు విష్ణువును వెదుకుతూ పాతాళానికి వెళ్లాడు. అక్కడ వరాహరూపంలో ఉన్న విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడు. వరాహరూపంలో ఉన్న విష్ణువు తన వాడి అయిన కోరలతో కుమ్ముతూ ఆ దుష్టరాక్షసుణ్ని వధించాడు. అనంతరం పాతాళంలో పడివున్న భూమిని తన పంటికొసపై ఉద్ధరించి , పైకి తెచ్చి కాపాడాడు. భూదేవికి హిరణ్యాక్షుడి పీడ తొలగిపోయింది. దేవతలు సంతోషించారు. భూలోకవాసులు ఆనందించారు. వరాహమూర్తి అనుగ్రహంతో స్వాయంభూ వసువు భూలోకాన్ని ధర్మబద్ధంగా పాలించాడు. జగత్కల్యాణం కోసం మహావిష్ణువు వరాహరూపంలో అవతరించిన ఈ పవిత్ర దినాన ‘వరాహ జయంతి’ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆచారంగా మారింది. ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్లపక్ష తృతీయనాడు వరాహక్షేత్రాల్లో వైభవంగా వరాహ జయంతిని నిర్వహించడం , భక్తులు ఒక పర్వదినంగా పూజలు చేయడం పరిపాటి. కొందరు చైత్రబహుళ త్రయోదశినాడు వరాహజయంతిని నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లోని ఆచారాలను, సంప్రదాయాలనూ అనుసరించి ఈ వైవిద్యం ఉంటుంది.

వరాహావతార వైశిష్ట్యాన్ని తెలిపే వరాహ పురాణంలో కలియుగార్చావతారుడైన శ్రీ వేంకటేశ్వరుడికి తిరుమలలో నివాసస్థలం ఇచ్చింది వరాహస్వామేనన్న ప్రశస్తి ఉంది. అందుకే నేటికీ తిరుమలను వరాహక్షేత్రం అని పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వరుణ్ని దర్శించుకోవడానికి ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలనే నియమం కూడా ఉంది. స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన వరాహస్వామి ఆలయం తిరుమలకు వెళ్లే యాత్రికులకు ప్రథమ పూజ్యస్థానం.

కోరలతో నేలను తవ్వుకుంటూ వెళ్లే వరాహం మానవుడికి కృషీవలత్వాన్ని బోధిస్తోంది. నేలను తవ్వి , సాగుచేసి , రత్నాల వంటి పంటలు పండించాలని చెబుతోంది. అవసరమైతే పంటికోరలపై భూమిని మోసినట్లు , భారాన్ని మోయాలని ప్రబోధిస్తోంది. ఆపదలో మునిగిపోయినవారిని లోతుల్లోకి వెళ్లి రక్షించాలని మార్గదర్శనం చేస్తోంది. మహిమ గల వరాహస్వామి ఎందరికో ఆరాధ్య దైవమై ఈ భూమండలంలోని అనేక క్షేత్రాలలో కొలువుదీరి ఉన్నాడు. వరాహస్మరణం సకల పాపహరమే కాకుండా , విశ్వకల్యాణకారకం కూడా !

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...