Tuesday, January 19, 2021

ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు

(కృష్ణార్జునులు కాదు మేము అడిగేది) నరనారాయణులనగా ఎవరు?

నరనారాయణులనగా జీవుడు, దేవుడు. నరుడంటే నశించని వాడు. నారాయణుడంటే నశించని వాళ్ళందరికీ మూలము అయినటువంటి వాడు. అతని నుంచి అందరూ దిగి వచ్చి, అతని లోకే అందరూ వెడుతూ ఉంటారు. తన యందు, తన ప్రవర్తనము నందు అప్రమత్తుడైనటువంటి వాడు నరుడు. వీరిద్దరు ప్రపంచములో ఎలా ప్రవర్తించాలో నిర్వర్తించి చూపించారు.*

*శ్రీరాముడిని మించిన నరుడు లేడు. సంపూర్ణముగా నరుడిగా దిగివచ్చి, నరత్వమంటే ఏమిటో చూపించాడు. మానవునికి నరుడి దగ్గరనుంచి నేర్చుకోవలసిన కళ్యాణ గుణములు ఉన్నాయి. నారాయణుడు చేసేటటువంటి కార్యములన్నీ అతి మానుషీ కార్యములుగా ఉంటాయి. అదే శ్రీకృష్ణుని జీవితములో గోచరిస్తూ ఉంటుంది. అందుకనే శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయమంటారు. రాముడు నడిచినట్లు నడవమని చెపుతారు.

మోక్షమంటే ఏమి?

మోక్షం

ఒక గురువు తన శిష్యులతో అరణ్యమార్గాన వెళ్తుండగా ఒక నదిని దాటవలసి వచ్చింది. అదే సమయంలో నదిని దాట లేక ఒక యవ్వనవతి ఆ శిష్యుల సహాయాన్ని అర్థించింది. అందరూ నిరాకరించినా, ఒక శిష్యుడు మాత్రం ఆమెను ఎత్తుకుని నది దాటించి, కిందకు దించాడు. తర్వాత ఆమె దారిన ఆమె వెళ్లిపోయింది. రాత్రి ఒక అనుకూలమైన చోట విశ్రమించిన తర్వాత శిష్యులంతా ఆ గురువు దగ్గరకు వచ్చి, ‘మనమంతా బ్రహ్మచర్యం పాటిస్తున్నాం కదా, ఆ శిష్యుడు స్త్రీని ఎత్తుకొని నది దాటించాడు..’ అని ఫిర్యాదు చేశారు. దానికి గురువు ‘ఆ శిష్యుడు ఆ స్త్రీని అక్కడే దించి వేశాడు. కానీ, మీరంతా ఇంకా ఆమెను మీ మనసులో మోస్తూనే ఉన్నారు’ అన్నాడు. ‘అష్టావక్ర గీత’లో జనకునితో అష్టావక్రుడు.. ‘ఓ రాజా! దేహం కంటే ఆత్మ వేరని విచారించి తెలుసుకుని, నీ ఆత్మపైనే మనసును ఎల్లవేళలా లగ్నం చేసినట్లయితే నువు సుఖశాంతులను పొందుతావు. ఎంతవరకు నీలోని ‘చిజ్జడగ్రంధి’ నాశనం కాలేదో అంటే పరస్పరా ధ్యాస నాశనం కాలేదో, అంతవరకు బంధమున్నట్లే..’ అన్నాడు. ‘బంధం పెనవేసుకుని ఉండటమే’ మోక్షరాహిత్యం. ‘మోక్ష’మంటే ‘ఈ బంధనాలను అన్నిటినీ వదిలేసుకోవడమే. ‘చిజ్జడగ్రంథి’ శరీరంలోని జీవగ్రంథి కాదు. అదొక మానసిక స్థితి. శరీరం, మనసులవల్ల ‘నేను’, ‘నాది’, ‘నాతో’ అనే కర్తృత్వ భోక్తృత్వాలను అనుభవించడమే ఈ గ్రంథి తత్తం.    

‘మోక్షమనేది స్వర్గంలోనో, లోకాంతరంలోనో ఉండేది కాదు.  ఏదో ఇంటి లోపలగాని, గ్రామంలోగానీ ఉండేదీ కాదు. మనసులోని అజ్ఞానగ్రంథి నాశనమే మోక్షం’. కర్మ నిరంతర ప్రవాహం. అది జరుగకుండా ఆపడం ఎవరివల్లా కాదు. ‘చావు పుట్టుకలతోసహా అనేక విషయాలపై మనకు అధికారం లేనపుడు, మధ్యలోని ఈ జీవితంపై మమకారం ఎందుకు?’ అని ఉపనిషత్తులు, భగవద్గీతాది ధార్మిక సాహిత్యం ప్రశ్నిస్తున్నది. కర్మలను ఆచరిస్తూనే, వాటిపట్ల మానసిక బంధనాలను తుంచి వేసుకోవడమే మోక్షం. అదే అసలు సిసలైన ‘ఆనందమయ స్థితి’. ‘స్వాత్మప్రకాశిక’లో జగద్గురువు ఆదిశంకరులు మోక్షస్థితిని స్పష్టం చేశారు. ‘జ్ఞాని అనేవాడు రాజ్యాన్ని పరిపాలించవచ్చు. బిచ్చమెత్తి జీవించవచ్చు. కలలోని పాపపుణ్యాలు జాగ్రదావస్థలో లేనట్లే, జాగ్రదవస్థలోని పాపపుణ్యాలు నాకు లేవు’ అని అంటారాయన. ‘మేఘాలు ఆకాశంలో వున్నా అవి ఆకాశాన్ని అంటనట్లు, సంసార సుఖదుఃఖాలు నన్ను అంటజాలవు’ అన్నది వారి బోధన. ఆదిశంకరుల ‘వివేక చూడామణి’ ప్రకారం కూడా ‘జీవిత చరమాంకంలో దండ కమండలాలు పట్టుకుని సన్యాసాశ్రమంలో చేరటం మోక్షం కానే కాదు. కష్టించి పనిచేస్తూనే ఫలాధికారాన్ని వదిలి వేయడమే మోక్షం’. 

‘బ్రహ్మభూతస్థితిలో, పరబ్రహ్మతో ఏకీభావ స్థితిలో ఉన్నవాడు దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వభూతాలను సమానంగా చూసేవాడు పరాభక్తిని పొందుతాడు’ (భగవద్గీత: మోక్షసన్యాస యోగం). ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించడమే మానవ జీవిత లక్ష్యమైనపుడు ధర్మార్థకామాలను భూమిమీదే సాధించి, నాల్గవ దానిని అనంతంలో సాధించాలని అంటే ఎలా? మోక్షమూ భూమిమీదే సాధించాలి. ఈ నాలుగూ నిరంతరంగా సాగే మానవ ధర్మాలు కావాలి. మొత్తంగా ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకోవడమే మానవుడిని ఉత్కృష్టమైన స్థితిలో నిలబెడుతుంది. అదే ‘పరబ్రహ్మ స్థితి’గా చెప్పుకునే ‘బ్రహ్మభూతస్థితి’. దీనినిబట్టి ‘మోక్షం’ అంటే ‘మరణానంతరం పునర్జన్మ లేనటువంటి స్థితి కాదు. జీవించి ఉండగానే కర్మఫలాపేక్ష లేని అత్యున్నతమైన, ఎలాంటి విషయ వాసనలూ లేని, ఆనందభరితమైన మానసిక స్థితి’ అని గ్రహించాలి. ఆ నిశ్చల, నిర్మోహ, నిర్వికార మానసిక ఆనందమే మోక్షం.

గోపికలు తరువాత విష్ణురూపుడైన ఆ కృష్ణ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని  పొందిన వారు ఎవరు?

పరమాత్మ గురించి, ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించేవారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది. ‘దాహార్తి తీర్చుకునేందుకు నీరు, క్షుద్బాధ తీరడానికి ఆహారం, శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి... ఇలా సృష్టిలో ప్రతి అంశానికీ ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే ఆధ్యాత్మిక (గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన), ఆదిభౌతిక (ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం), ఆదిదైవిక (దైవ సంబంధమైన) కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి. ఆ మార్గమే భగవదన్వేషణ, ఆరాధన.

ఇదే తప్ప అన్య మార్గం లేదు.ఆ పరమాత్ముని మనసా..  వాచా , కర్మణా  కొలిచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు, మనోనిగ్రహపరులు, పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు. 

ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది..

విష్ణురూపుడైన ఆ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ గోపాలకులు పొందారు కదా..

కల్మషం లేనివారి స్వచ్ఛమైన మనోభావాలు, ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు.

విలు విద్య ప్రావీణ్యంలో సాక్షాత్తు కోదండరాముడే మెచ్చుకొనే స్థాయిలో  గల వారు ఎవరు?

జగదేక ధానుష్కుడైన రాముడికి తొలుత విల్లు పట్టడం నేర్పిన గురువు కైక. విలువిద్యలో ఆమె గొప్ప ప్రవీణురాలు. ఆ మాటను రాముడే చెప్పాడు. రాక్షస వీరుల్లో ఎవరైనా విలువిద్యలో అమోఘ ప్రదర్శన కనబరిస్తే రాముడి మొహంలో మెచ్చుకోలు కనపడేది. వెంటనే కైక ఆయన ఎదలో మెదిలేది. రెండు మూడు సందర్భాల్లో ‘ఇతడు అద్భుతమైన విలుకాడే గాని, నా పినతల్లి చేతిలాఘవం, ఆమెకు తెలిసిన ఒడుపులు కిటుకులు వీని గురువు ఇతడికి నేర్పలేదు’ అని రాముడు అనుకొనేవాడట. అంటే ఆ విద్యలో కైకేయికి గల నైపుణ్యం, ప్రావీణ్యం సాక్షాత్తు కోదండరాముడే మెచ్చుకొనే స్థాయివి. వారిద్దరి మధ్యగల బంధంలో ఇదొక బలమైన ముడి. రాముడికి ఆమె పట్ల అవ్యాజమైన ప్రేమ. అటు కైకేయికీ అంతే. ఆమాటకొస్తే భరతుడి కన్నా రాముడంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం.

పారవశ్యం అంటే పరులకు వశమైపోవడం అనేది సామాన్యార్థం,పారవశ్యం అంటే సరైన అర్థమేమి?

పారవశ్యం అంటే పరులకు వశమైపోవడం అనేది సామాన్యార్థం. పర అనే పదానికి ‘ఇహం కానిది, పైన ఉండేది’ అనేవి సరైన అర్థాలు.

పరమందు(పైను)న్నవాడు కాబట్టి సర్వాత్మకుణ్ని ‘పరమాత్మ’ అంటారు. ఆయనకు వశమైనవాడు పరవశుడు. అతడు పొందే స్థితి పారవశ్యం. ఆ స్థాయికి చేరుకున్నవారు పొందేది అనురాగ ద్వేషాలకు అతీతమైన నిర్వికార స్థితి. లోక కల్యాణమే వారి ధ్యేయం.

భాగవతాన్ని వ్యాసుడు రచించింది, పోతన అనువదించింది- ఆ స్థితికి చేరుకున్నాకే. అందుకే భాగవతాన్ని చదివే/వినేవారికి సైతం క్రమేపీ నిర్వికార స్థితి కలుగుతుంది.

పారవశ్య ప్రాథమిక దశలు ఆత్మానందం, శరణాగతి

"ఖ్యాతి" ఎవరు?

హిందూ పురాణంలో ఖ్యాతి, దక్ష ప్రజాపతి, ప్రసూతి కుమార్తె. పురాణాల ప్రకారం, దక్షుడు భార్య ప్రసూతి నుండి 24 మంది కుమార్తెలు, అతని మరొక భార్య పంచాజని (విరిణి) నుండి 62 మంది ఉన్నారు. దక్షుడు కుమార్తెలలో ఖ్యాతి ఒక ప్రముఖురాలు. ఈమె శివుని భార్య అయిన సతి సోదరి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...