Monday, April 5, 2021

ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు

 'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః’- ఈ శ్లోకం జగత్‌ ప్రసిద్ధం.... 

దీని అర్థం: అయోధ్యా , మధుర , మాయ ( హరిద్వార్) , కాశీ , కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు ( నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలిసికుందాం.

1) అయోధ్య:-

అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.

2) మధుర:-

మాధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.

3)మాయ:-

దీనినే హరిద్వార్‌ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.

4)కాశీ:-

భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు.

5) కాంచీపురం:-

దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తి స్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.

6)అవంతిక:-

భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయినీ నగరానికే అవంతిక అనిప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథు డైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

7) ద్వారవతి:-

అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్‌గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...