పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... పరమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను.
పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .
నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను .
" శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం ఆలోచించి అడవిలోని ఒక పెద్ద రావి చెట్టు తొర్ర లో దాగున్నాడు. (ఆ అడవి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి అనే గ్రామం నందు కల ఒక పెద్ద రావిచెట్టు తొర్ర అని, అందులో ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి.) మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు.
అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని మందహాసం చేస్తూ " పరమశివుడంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్లని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు..శని నెమ్మదిగా వినయం గా..
శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు శని ని శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .
శనీశ్వరుడు మరియు దశరథ మహారాజు..
తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.
ఓం నమః శివాయ
ఓం శనైశ్చరాయ నమః
No comments:
Post a Comment