1. యోగ్యుడైన ఆధ్యాత్మిక గురువు పాదపద్మములను ఆశ్రయించి దీక్షను పుచ్చుకొన వలెను.
2. గురుస్వామి ద్వారా "స్వామియే శరణం అయ్యప్ప" అనే తారకమంత్ర ఉపదేశమును పొంది
భగవంతుని ఎట్లు పూజించవలెనో , ఎట్లు భగవత్సేవ చేయవలెనో నేర్చుకోవలెను.
3. గురువు చెప్పిన విధి విధానాలను , గురువు ఆదేశాలను శ్రద్ధగా పాటించవలెను. గురు
స్వామి ఆజ్ఞను అతిక్రమించకూడదు.
4. ఉదయం , సాయంకాలముల యందు విధిగా పూజ చేయవలెను.
5. భగవంతుని అర్చించిన తరువాత ప్రసాదంగా పూజాపుష్పమును శిరముపై
నుంచుకొనవలెను.
6. పూజ ముగిసిన తరువాత అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా దేవాలయాలకు
వెళ్ళవలెను.
7. తెల్లవారుజామున , సాయంకాలము లందు (రెండు పూటలా) చన్నీటితో తలస్నానం
చేయవలెను.
8. నేలపై చాపవేసుకుని నిద్రించవలెను. (తలగడను ఉపయోగించ గూడదు)
9. బ్రహ్మచర్యమును ఆచరించవలెను.
10. పూజా విధానాన్ని సక్రమముగా పాటించే విధంగా దినసరి కార్యక్రమ ప్రణాళికను
ఏర్పరచుకొనవలెను.
11. అసత్య మాడరాదు.
12. నుదుటను విభూతి , చందన , కుంకుమలు ధరించవలెను.
13. గురుస్వామిగారి పర్యవేక్షణలో ఆ కాలానికి చెందిన సద్ గురుస్వాముల అడుగుజాడలలో
నడుచుకోవలెను.
14. భగవంతుని సన్నిధిలో “పడి" వెలిగించునపుడు ఇతరులకు బాధ కలిగించని రీతిలో
నాట్యమాడవలెను.
15. ప్రత్యేక పూజలు ముగిసిన పిదప గురుస్వాములకు ఒకరి తరువాత ఒకరుగా క్రమపద్ధతిలో
సాష్టాంగ నమస్కారము చేయవలెను.
16. ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తునకు మిగిలిన స్వాములు సున్నితంగా పాదాభివందనం
చేయవలెను.
17. పూజ చేసిన స్వామి కూడా ఇతర స్వాముల పాదాలకు సున్నితంగా , భక్తిగా
నమస్కరించవలెను.
18. స్వామికి సంబంధించిన ఊరేగింపు ఉత్సవాలలో విధిగా పాల్గొని , కనీసం కొంత దూరమైన
నడువవలెను.
19. దేవుని ఊరేగింపు ముగిసిన పిదప అందుకు సంబంధించిన ఆదాయ , వ్యయములను
"స్వామి" సమక్షంలో నివేదించవలెను. ఇదంతా గురుస్వామిగారి ఆజ్ఞమేరకు జరగవలెను.
20. దేవాలయములలోను , ఇంటిలోను వివిధ విశేషపూజలలోను బృందగానములు
చేయవలెను.
21. అయ్యప్ప మాల యందు ఉండే అయ్యప్ప డాలరునకు హారతిని ఇచ్చేటపుడు ఎడమచేతితో
మాలను పట్టుకుని కుడిచేతితో హారతిని చూపించాలి (హారతి మంటల్లో మాలను ,
రూపును త్రిప్పకూడదు.)
22. స్వచ్ఛమైన , శుభ్రత కలిగిన అభిషేక ద్రవ్యములు దొరికినపుడే స్వామికి అభిషేకములు
(చేయించవలెను) చేయవలెను. అభిషేక ద్రవ్యాలు మంచివి కాకపోతే ఆలయంలోని
విగ్రహం పాడైపోతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభిషేకానికి మంచి ద్రవ్యాన్ని
సమకూర్చుకోవలెను.
23. అభిషేక , “ప్రసాదములను" స్వీకరించవలెను.
24. ప్రత్యేక పూజలయందును , స్వామిని అలంకరించుట యందును , అర్చనలలోను మరియు
చేసే ప్రతీ మంచి పనిలోను ఏకాగ్రత , కలిగియుండవలెను.
25. భగవంతునికి చేసేసేవ , భగవద్ భక్తులకు చేసే సేవ ఒక్కటే అని భావించి వినయంతో సేవ చేయవలెను.
26. "స్వామియే శరణం అయ్యప్ప" అనే భగవన్నామమును స్మరిస్తూనే యుండవలెను.
27. తనకు ఆర్థికంగా ఎంత శక్తిగలదో అందుకు తగినట్లుగానే భగవంతుని అర్చించవలెను.
28. ఏదైన ఆహారమునకు సంబంధించిన దానిని భగవంతుని స్మరించి తరువాత తినడంగాని ,
భగవంతునకు సమర్పించి ఆ తరువాత తినడం గాని చేయవలెను.
29. భగవంతునికి ఇష్టమైన కార్యాలను చేయునపుడు భయపడ కూడదు.
30. భగవంతునకు సంబంధించిన ప్రత్యేక సేవా కార్యక్రమాలలో విధిగా పాల్గొనవలెను.
31. మంచి పనులు ఏవి చేస్తున్నా , భగవంతుని తలుస్తూనే చేయవలెను.
32. భోజనమునకు ముందు , భోజనానంతరమును కాళ్లు , చేతులు కడుగుకొనవలెను.
33. హితమైన “సాత్విక ఆహారాన్ని" మితంగా భుజించవలెను.
34. అయ్యప్ప దీక్ష ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవలెను.
35. మనకు ఇష్టమైన పనినైనా పరిత్యజించి , స్వామి యొక్క సేవలో పాల్గొనుటకు సంసిద్ధుడగు
చుండవలెను.
36. దీక్షకు అవసరమైనంత వరకే భౌతిక జగత్తు నుండి స్వీకరించవలెను.
37. మర్రి , మారేడు మొదలగు వృక్షములకు నమస్కరించవలెను.
38. అవసరమైనంత వరకే నిత్య జీవన కార్యక్రమాలను ఆచరించవలెను.
39. దుఃఖము కలిగినపుడు క్రుంగిపోవుట గాని , సుఖము కలిగినపుడు పొంగిపోవుట గాని. చేయకూడదు.
40. వివిధ హోమ , యజ్ఞముల ద్వారా వ్యాపించిన పొగను శ్రద్ధతో పీల్చవలెను.
41. పురాణ కాలక్షేపాలలో పాల్గొనవలెను.
42. భగవానుని అనుగ్రహము కొరకు సదా ప్రార్థించవలెను.
43. భక్తి భావము కలిగియుండి భక్తి గ్రంథాలను చదువుచుండవలెను.
44. ఇష్టముతో దేవునికి సేవ చేయవలెను.
45. దేవుని కీర్తించునపుడు , నామములు ఉచ్ఛరించునపుడు తప్పులు రాకుండా జాగ్రత్త
పడవలెను.
46. స్వామికి సంబంధించిన వివిధ శ్లోకాల , నామముల యందు అర్థాలను తెలుసుకోవలెను.
47. తన కంటే పరిణితి పొందిన భక్తులతో సాంగత్యము చేయవలెను.
48. భక్తి లేనివాని సాంగత్యమును , పరుషముగా మాట్లాడువాని సాంగత్యమును , క్రోధము
కలిగిన వాని సాంగత్యమును పరిత్యజించవలెను.
49. కామ , క్రోధాదులను అదుపులోయుంచుకొనవలెను.
50. ఆలయాలలోను , పూజా మందిరాల వద్దను మంచి నడవడి కలిగి యుండవలెను.
51. ప్రశాంత జీవితమును గడుపవలెను.
52. అన్య దేవతలను దూషించకూడదు.
53. అనవసరంగా ఏ ప్రాణికిని కష్టం కలిగించకూడదు.
54. పూజా ప్రతిమలను చిత్ర పటములను (పూజా సమయంలోను , పూజ తరువాత) శుభ్రంగా
ఉంచుకొనవలెను.
55. పువ్వులు , పత్రి ఒడిలో వేసుకోని పూజించరాదు.
56. తడి వస్త్రములతో పూజకు ఉపక్రమించకూడదు.
57. పూజ చేస్తున్నప్పుడు కటిక నేలపై కూర్చుండరాదు.
58. భోజనానంతరం భోజనం చేసిన ప్రదేశమునందు చేతులు కడుగరాదు (చేతులు కడిగే
చోటికి వెళ్ళి చేతులు కడగాలి)
59. తాంబూలమును స్వీకరించవచ్చునే గాని , తాంబూలమును నమిలి మ్రింగరాదు.
60. శవమును చూడకూడదు అట్లు చూచినచో మరల తలస్నానం చేసి విభూతి , చందన ,
కుంకుమాదులు ధరించి దీపం వెలిగించి భగవంతునికి నమస్కరించవలెను.
61. అశౌచము కలిగిన (మైల కలిగిన) వారి ఇండ్లకు వెళ్ళకూడదు.
62. స్త్రీలను కనీసం తాకనైన తాకకూడదు. ప్రాణాపాయ స్థితిలో తప్ప
63. స్వామికి ఇష్టమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహించుట లేక ప్రత్యేకపూజలలో భక్తిగా
పాల్గొనుట చేయవలెను.
64. పుణ్యక్షేత్రములను దర్శించవలెను.
ఈ 64 భక్తి అంగములు సరియైన రీతిలో ఆచరిస్తే మనలోని వాచిక , కాయక , మానసిక కర్మలన్నీ సంస్కరించబడి , దశేంద్రియ సిద్ధి కలిగి ( జ్ఞానేంద్రియ , కర్మేంద్రియాలను దశేంద్రియాలంటారు) మన హృదయంలో భగవంతుణ్ణి దర్శించగలుగుతాం. ఏకాగ్రతతో స్వామిని పూజించేటప్పుడు , భక్తిగా పాడేటప్పుడు భగవంతునిలో తాదాత్యం చెందే భాగ్యం కలుగుతుంది.
అప్పుడు వర్ణించలేనంత ఆనందం కలుగుతుంది. ఆ సమయంలో ఆనందంతో మన కళ్ళవెంట ఆనంద భాష్పాలు వస్తాయి. రోమాంచం కలుగుతుంది. కొద్దిక్షణాలు మనకళ్ళకు దివ్యకాంతి గోచరిస్తుంది. గగుర్పాటు కలుగుతుంది. మన హృదయంలో ఏదో చెప్పలేని దివ్యమైన భక్తి అనుభూతి కలుగుతుంది. మనం అర్చించే చిత్రపటంలోని అయ్యప్పస్వామివారి నేత్రాలలో జ్యోతి కనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప అనుభవంగాని , అనుభూతిగాని జీవితంలో మరొకటి ఉంటుందా ! ఇంతకంటే భాగ్యం , ఐశ్వర్యం మరొకటి ఉంటుందా ? ఇట్టి అనుభూతిని 41 రోజుల దీక్షాకాలంలో ఒక్కరోజైనా పొందగలగడమే అదృష్టం. అట్టి అనుభూతి కలగాలని ప్రయత్నించ కూడదు. ఏదో విశేషభక్తి కలిగియుంటే భగవానుడే అట్టి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు. అంతటి భాగ్యాన్ని భక్తులందరూ పొందాలి. అందుకే త్యాగరాజ స్వామివారు “నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా" అని గానం చేస్తూ రాముని సన్నిధే అసలైన పెన్నిధి అనే సందేశాన్ని మనకు అందజేసారు. గురువుల అనుగ్రహంతో మనమూ ఆ పెన్నిధిని పొందుదాం.