Friday, April 27, 2018

భగవద్గీత

వేదాంతగ్రంథములలో భగవద్గీత కున్నంత ప్రాముఖ్యము మరొక గ్రంథమున కుండదు. దేశభాషలలోనేకాక పాశ్చాత్యభాషలలో సహితము గీతకు అనువాదములు వ్యాఖ్యానములు ఎన్నియో కలవు. యుద్దభూమిలో అర్జునునికి కృష్ణభగవానుడిచ్చిన సందేశము నాడేకాక నేటికిని అనుగుణమై చదివినవారికి ఉత్తేజకరమై వెలయుచున్నది. గీతతో సమానోత్కష్టతగల మరికొన్ని గ్రంథములు గీతలని పేరుపెట్టుకొన్నను భగవద్గీతకే ఇంతటిపేరు. పార్థునికి బోధింపబడి, దివ్యజ్ఞాన సంపన్నమై సత్యామార్గదర్శినియై చిరతరోన్నత స్థాయిని వహించిన ఈ గ్రంథరాజము - ప్రాముఖ్యమునకు కారణము గీతాభూమికయందు కాననగును.

ఈ మధురనాటకమున అర్జునునిది ప్రధానపాత్ర. అర్జునుడు రథోపనిష్టుడై యుండును. రథమునకు సారథి కృష్ణుడు. ఒక్క క్షణము క్రితము అర్జునుడు కృష్ణుని 'సేవయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత' అని అడిగియుండెను. కాని ఇపుడొ? గురుచరణ సాన్నిధ్యమున వినతుడగు శిష్యునివలె అతడు శరణుజొచ్చి తన్ను అనుగ్రహించి మార్గము చూపుమని కృష్ణుని వేడుకొనెను.

'శిష్య స్తే హం శాధి మాం త్వాం ప్రపన్నం'

చెప్పుటకుకాని, చదువుకొనుటకుకాని ఎంతతగినచోటు ఆ రణభూమి! మరుసటి క్షణమున శిరసు ఉండునో లేక తెగిపడి రక్తసిక్తమై రణభూమిలో దొరలాడునో అర్జునునికి తెలియదు. ఒక వేదాంతసభ జరుగుచున్న దనుకొనుడు. చిన్న వానవచ్చిన చాలును. శ్రోతలు అటులనే కరగిపోవుదురు. వినుచున్న తత్త్వమెంత గొప్పదైనను శ్రోతలకు ఉపన్యాసము కంటే తమ వస్త్రరక్షణమే ముఖ్యము. కాని ఇచట తత్త్వమును వినగోరువాడు మృత్యుదంష్ట్రాగ్రస్తుడు. అతనికి తత్త్వ బోధచేయుటకు భగవానుడు సిద్ధుడైయే యుండును. భగవద్గీత తదితర గ్రంథములకంటె ప్రశస్తినొందుటకు ఈ భూమికయే కారణము. ఈసన్నివేశమునే మరొకదృష్టిని చూడవచ్చు. తాను జ్ఞానోపదేశము పొందుటకు అర్హుడని అర్జనుడు భగవానునికి నిరూపించుకొనెను. యుద్ధమపుడే జరుగబోనున్నది. యుద్ధము మొదలుపెట్టినయెడల ఇరుసేవలలో బ్రతికి బయటపడువారెవరో ఎవరికిని తెలియదు. యుద్ధము చేయనని చెప్పినను అర్జునుడు భీరువుకాడు. యుద్ధభూమినుండి పారిపోవలెనని కాదు అతడుకోరుకొన్నది. అతని యుద్దవైముఖ్యమున కొక్కటియే కారణము. యుద్ధమున పెద్దలను బంధువులను చంపవలసి వచ్చును. అది అతని కిష్టములేదు. తాను నిరస్త్రుడైనను శత్రువులు తన్ను చంపిననుసరే వెనుదీయనని అతడు కృష్ణునితో విన్నవించెను. నిజమున కాతడు అట్టిస్థితిని నిరీక్షించు చుండెను. తాను చచ్చిననుసరే యుద్ధములోని హింసాకాండ నివారణమగునని అతని ఆశ. అనగా అర్జునుడు తన కోరికలన్నిటిని అణచుకొని విరాగియాయెను. వైరాగ్య మెపుడాతనికి కల్గెనో సత్యజ్ఞాన గ్రహణమున కాతడు పాత్రుడాయెను. వైరాగ్య మొకనికి సిద్ధించినదా లేదా యని పరీక్షించుటకు యుద్ధభూమికి సమానమగు ఒరపిడిరాయి మరొకటి కానుపించదు. అర్జునుడు జ్ఞానమునకై ఆతురపడు చుండెను. పరీక్షలోనెగ్గి తన పాత్రను నిరూపించుకొన్నందున భగవానుడతనికి జ్ఞానబోధచేసెను. గీతాసందేశపు శాశ్వతౌన్నత్యమున కిదియే పునాది.

యుద్ద బహిష్కరణకై అర్జునుడు పరమాత్మతో ఎంతయో హేతువాదము చేసెను. ఏ సందర్భమైనను సరియే యుద్ధము అక్రమము. ప్రతిపక్షము మూంåతతో యుద్ధమును కోరుకొని యుద్ధోత్సుకతను ప్రదర్శించినను మనము యుద్ధముచేయ నిరాకరించవలెను. అట్టితరి హానితక్కువ - న్యాయస్థానమున న్యాయాధికారి విధించు శిక్షకును యుద్ధమునకును ఎట్టి పోలికయునులేదు. న్యాయాధికారి నిష్పక్షపాతి. అతడు విధించెడి శిక్ష ఇతరులను క్రూరకర్మలనుండి మరలించును. శిక్షితుడయినాడన్న దుర్యశము, చెరసాలలోని కష్టజీవనములు నేరముచేసిన వానికి ఒక గుణపాఠము నేర్పును. వాడు మరల అట్టి కార్యము చేయడు. కావున శిక్షయనునది నేరముల కొకవిధమైన నిరోధమే కాని యుధ్దవిషయ మటుకాదు. యుద్ధమున వృద్ధులు పెక్కుమంది మరణింతురు. అప్పడు స్త్రీ బాలురకు సదుపదేశము లీయజాలని అసహాయస్థితి యేర్పడును. అందుచే కుల నాశనమున కులధర్మచ్యుతియును సంభవించును. కుల స్త్రీలు చెడిపోవుదురు. వారి వినష్టతచే వర్ణసంకరమగును. వర్ణ సంకరమునకు కారణభూతులు నరకమునబడి అమితబాధలనొందుదురు. అందుచే యుద్దము మోక్షమునకుగాని నిత్యసుఖమునకుగాని దారిదీయుటకు బదులు నిత్యదుఃఖమునకు హేతువగును. ధర్మరక్షణార్థము మనము నాశనమైననుసరే, యుద్ధోన్ముఖులపై మరింత మానవక్షీణతకు మనము కారకులమగుట తప్పు. ఇట్లు తన ఉద్దేశమును అర్జనుడు భగవానునితో చెప్పి శోకసంనిగ్న మానసుడై కూర్చుండెను.

దీనికి భగవాను డేమి బదులిచ్చును? ఆయన ప్రత్యుత్తరమున మందలింపు గర్భితమై ఉండును. 'ఈ హృదయదౌర్బల్యము వదలిపెట్టు.' అర్జునా!లే! లెమ్ము.

'క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ'

నీవు యుద్ధమునుండి - వారు చచ్చెదరని. వీరు చచ్చెదరని దుఃఖమునకు భయపడి విరమించుకొనిన అదితప్పు. నీకు అహంకారము మమకారము ఇంకను వదలలేదని అర్ధము, నీవు క్షత్రియుడవు. యుద్దము చేయుట నీవిధి. ఇప్పటికి మనస్థ్సితిలో నీకు కర్మసన్యాసమునకు అధికారములేదు. నిస్సంగికి కర్మ అవసరము లేదు. కానీ నీకు కాదు. నీ పెద్దలయందును బంధువు అందును గురువులయందును సంగముంచి వారెక్కడ నశింతురోయని దుఃఖించుచున్నావు. అందుచే నీవు కార్యవిముఖుడవు కారాదు. ఆకర్తృత్వసిద్ధి నీకు ఇంకను లభించలేదు. అట్టి సిద్ధిని నీవు పొందవలెననిన, నీస్వధర్మము నీకు ఏకర్మను విధించియున్నదో దానిని నీవు చేయక తప్పదు అని భగవానుడు అర్జునుని మందలించును.

ఇందు భగవానుడు 'జీవకారుణ్యభూతమగు యుద్ధవిముఖతకు అధికారము కావలెనని ఒకడు ఇచ్చగించిన తన్ను తాను ముందు సంస్కరించుకొనవలె' నని అర్జునునకు బోధించును. మన లోపములు మనము సంస్కరించుకొనని పక్షమున లోక క్షేమముకొరకు యత్నించుటకు మనకు అధికారములేదు. దుఃఖమునకును క్రోధమునకును లొంగిన యొకడు ఇతరుల దుఃఖ క్రోధములనెట్లు తొలగించగలడు? భ్రాంతియుక్తుడైన మానవుడు ప్రపంచములోని యితరుల భ్రాంతినెట్లు పోగొట్టగలడు? అట్లుగాక మానసిక దౌర్బల్యమును అణచి దుఃఖాతీతుడై యొకడు ఆత్మోపలబ్థినందుచో అతని ఉనికి ప్రపంచసౌఖ్యమునకు కారణమగును. అతడు ప్రపంచసంస్కరణ కొరకు పాటుపడ నవసరములేదు. లోకక్షేమమునకై యత్నపడ నక్కరలేదు. అతనిని చూచి లోకము తన్ను, తనవర్తనము సంస్కరించుకొనుము. అట్టి పరివర్తనము కల్గినవాడు లోకక్షేమము తానుగ సిద్ధించును. దుఃఖాదులు తొలగవలెనన్న జ్ఞానమే సాధనము. అందు చేతనే భగవానుడు అర్జునునికి ఆత్మజ్ఞానమును బోధించుట, దానిని సాంతము విన్న అర్జునుడు 'నష్టో మోహః' అని ఆత్కంఠతతో పల్కుట.

అర్జునుని విషాదముతో గీత ప్రారంభమగును. విషాద గ్రస్తుడగు అర్జునుని ప్రథమమున భగవానుడు మందలించును. కడపట 'మాశుచః' యని ఊరడచేయును. తస్మాత్ 'యధ్యస్వ' యని ఆజ్ఞాపించుటచే ఇరుప్రక్కల, ఎంతమంది వీరులు హతులైనను క్షత్రియుడు తన స్వధర్మమును చేసితీరవలెనని తెలియుచున్నది. జ్ఞానప్రాప్తికి చిత్తశుద్ది అత్యావశ్యకము. అది సంగరాహిత్యముతో దైవమునందు భారమువైచి స్వధర్మము చేయుటచే కల్గును. అట్టి జ్ఞాని పవిత్రహృదయుడై తన యునికి చేతనే లోకసంగ్రహ మాపాదించును. తన్నుద్ధరించుకొన్న వాడే ఎదుటవారిని ఉద్ధరించగలడు.                     

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...