Friday, April 20, 2018

శంకర జయంతి......ఆది శంకరాచార్య...



ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.

జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు) కేరళ రాష్ట్రం, కాలడి లో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు.

ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.

ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం మొదలుపెట్టారు. మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.

శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ “కనకధారా స్తవం” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు.

ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. ఒకసారి శంకరులు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు.తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు.

ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.

ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి.
ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ,ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు.

ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు,పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.
ధర్మసంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ, ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.

ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు, తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.

(Courtesy with: www.meepurohit.com › shankara-jayanthi)

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...