Wednesday, November 22, 2017

“లంఖణం పరమౌషధం” అని చెప్పిన మన పూర్వీకులు అనాగరికులా?

నిన్న మొన్నటి వరకు మన పెద్దలు, వైద్యులు చెప్పిన ఉపవాసం గురించి లంఖణం గురించి నేటి వైద్యవిధానం అనుసరించిన ఎందరో వైద్యులు, అభ్యుదయవాదులు ఇదంతా కేవలం అనాగరికం అని, మూర్ఖత్వం అని ఎద్దేవా చేసేవారు. పూర్వం మనకు జ్వరాలు కానీ పెద్ద రుగ్మతలు వచ్చినప్పుడు లంఖణాలు చేయించేవారు. దానివల్ల ఎలాగూ నీరస పడేవారు. అసలది అవసరం లేదని కేవలం అంటిబయోటిక్స్ మాత్రమె మందులని మనకు బాగా తలకేక్కించారు. ఈమధ్య వైద్యంలో ప్రకటించిన నోబెల్ బహుమతి గురించి తెలుసుకుంటే ఒకసారి మనం ఆశ్చర్యపోతాము. జపాన్ సైంటిస్ట్ యోశినోరి ఒహ్సుమి కి ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఆటోఫాగి (AUTOPHAGY) మీద ఆయన చేసిన పరిశోధనకు గాను ఇచ్చారు. ఆటోఫాగి అంటే కణాల రీసైక్లింగ్ పద్ధతి అంటే “స్వయం భక్షం”. ఒక శరీరం ఆహారం తీసుకోకుండా వదిలేసినప్పుడు ఆ శరీరం తన లోపలి కణాలు, ఉపయోగించని ప్రోటీన్లను తిని తన అస్తిత్వం నిలుపుకుంటుంది. ఈ ఆటోఫాగి పద్ధతిని శరీరం కోల్పోతే శరీరం రోగ గ్రస్తం అవుతుంది.

మనకు ఏకాదశి, కార్తీక సోమవారం లాంటి ఎన్నో పద్ధతుల ద్వారా శరీరానికి ఉపవాసం చేయించే పద్ధతి ఉంది. ప్రతీ 15 రోజులకు వచ్చే ఏకాదశి నాడు పూర్తిగా నిరాహారంగా వుండడం అనేది మనవారు ఎప్పటినుండో అనుసరిస్తూ వస్తున్న పద్ధతి. దైవచింతనతో ఉపవాసాలతో ఆరోజును చెయ్యడం మన ఆధ్యాత్మిక పురోగతికి చెప్పిన ఒక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా ఆటోఫాగి అన్న ప్రక్రియను మనం ఉపయోగించుకుని తద్వారా శారీరక సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు మన పూర్వీకులు. దీనిద్వారా హానికర కణాలను ప్రక్షాళన చేసుకుని, శారీరక సౌఖ్యాన్ని పెంచి, ఉపయోగించని ప్రోటీన్స్ ను కొవ్వును కరిగించుకుని శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచుకునేవారు. ఎప్పుడెప్పుడు నేటి సైన్సు కొత్త విషయం కనుక్కుంటూ ఉంటె దానికి మన పూర్వపు పద్ధతులకు ఒక లంకె కనబడుతుంది. పక్షంలో ఒక్క రోజు దేవుని స్మరిస్తూ ఆయన గురించి చింతిస్తూ ఉపవాసం చేస్తూ ఆధ్యాత్మిక, శారీరక ఉన్నతిని పొందేవారు.


ఇంతేకాదు వరుసగా మూడు రోజులు నిరాహారంగా ఉండడం వలన శరీరం కొత్త స్టెమ్ సెల్స్ తయారు చేసి తద్వారా తేల్లకణాలను సృష్టించి  రోగ నిరోధక శక్తిని అమితంగా పెంచుతుంది అని సథరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనకు పూర్వం మూడు రోజుల లంఖణాలు చేయించేవారు. ఎంతమందికి గుర్తుందో లేదో కానీ చేసిన నాకు అనుభవం ఇది. శరీరం నీరసబడ్డా రోగం, రోగానికి కారణం అయిన ఆ రోగ సెల్స్ సగమై, తెల్లకణాలు ఇతోధికంగా పెరగడం వలను ఆ రోగం నయం అవుతుంది.

కేవలం ఉపవాసం చేస్తే ఎప్పుడూ ఆహారం మీద దృష్టి ఉంటుంది కాబట్టి మనస్సుకు ఆలంబనగా భక్తి అనే పరమ ఔషధాన్ని జత చేసి మనస్సు దేవుని మీద లగ్నం చేయించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించారు. నిస్సందేహంగా మన పూర్వీకులు, ఋషులు మానసిక, ఆధ్యాత్మిక, శారీరక సంపూర్ణ వైద్యాన్ని నిర్దేశించడానికి ఇటువంటి పద్ధతులను అనుసరించేవారు. మనకు పూర్తి అవగాహన లేక చాలా వాటిని కోల్పోయాము. వారికి త్రికరణశుద్ధిగా తల వంచి పాదాభివందనం చేసి వారు చూపిన బాటలో పయనించడం మన తక్షణ కర్తవ్యంగా భావిస్తూ
శ్రీకంఠం రమణయ్య

!! ఓం నమో వేంకటేశాయ !!

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...