Friday, December 30, 2016

రమణ మహర్షి

➖➖➖➖👋🏻➖➖➖➖➖➖➖👋🏻➖➖➖➖
మహా మౌని, ఆద్యాత్మకం.! రమణీయం..!!
నేడే భగవాన్ రమణ మహర్షి జయంతి   - 30-Dec-2016
➖➖➖➖➖🙏🏻➖➖➖➖➖➖➖➖➖🙏🏻➖➖➖➖➖
🔸భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి.

🔸మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు.

🔸తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో  1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సం"లున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్ కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు.

🔸విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని 'కావ్యకంఠ గణపతి ముని' సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.

🔸అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా  మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు.

🔸 రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకా లీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.

🔸అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువు లు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు.  ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవం గా దర్శనమిచ్చారు. ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్‌గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.

🔸‘‘గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందు తుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు. కొన్ని వందలమంది పై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు. ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది మరి!
 〰〰〰〰〰〰
రమణ వాణి....👋🏻
〰〰〰〰〰〰
🍥మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్ర మంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం.

🍥మానవత్వాన్ని వదులుకోకుం డా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం.

🍥భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతదూరంలో ఉంటాడు.

🍥సావధానంగా వినటం, సంయమనంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం.

🍥నీ సహజస్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడ మే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం.

🍥భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమై నవే ప్రయత్నం, సాధన.

🍥మన జీవితంలో అనివార్య మైన, నిశ్చయమైన ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి, చనిపోయేవరకు సకల జీవుల పట్ల సంయమనంతో, విచక్షణ తో మెలగడం అందరికీ అత్యవసరం.

🍥జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అయితే అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని తెలుసుకుని, భారాన్ని ఆయన మీద వేసి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి.

🍥మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు.

🍥సజ్జనులతో సహవాసం జన్మజన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది.

🍥మనం నమ్మిన వారిని భౌతికంగా మాత్రమే కాదు, వారిని స్మరించడం, ధ్యానించడం, వారితో మానసికంగా అనుబంధం పెట్టుకోవడం ద్వారా కూడా వారి సాయం లభిస్తుంది.

🍥నీ విశ్వాసమే నీ ఆయుధం.

🍥“ నిన్ను నీవు తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలను కుంటే, అది నిన్ను చూసి వెక్కిరి స్తుంది. నీ మనస్సు యొక్క ఫలితమే, ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకో. తర్వాత జగత్తును చూడు. అప్పుడు అది ఆత్మ కంటే అన్యంగా, భిన్నంగా , విడిగా లేదని తెలుసుకుంటావు” అంటారు రమణులు.

🍥ఒక భక్తుడు “ ఉద్యోగానికి రాజీనామా చేసి , నిరంతరం భగవాన్ సన్నిధిలో వుండాలనే తలంపు వుంది నాకు “ అని అడిగినప్పుడు భగవాన్ ఇలా సమాధానమిచ్చారు. “ భగవాన్ ఎప్పుడూ మీతోనే, మీలోనే మీరయ్యే వున్నారు. ఈ సత్యా సాక్షాత్కారా నికి ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. ఇంటి నుంచి పలాయనం చేయనవ సరం లేదు. పరిత్యాగమంటే వస్త్రాల్ని మార్చడం, కుటుంబ బండాల్ని బహిష్కరిం చడం, ఇంటిని, ఇల్లాలిని వదలడం కాదు. కానీ, వాటిపై వున్న కోర్కెల్ని,బంధాల్ని, అనుబంధాల్ని విడుచుటే. ఉద్యోగానికి రాజీనామా చేయవలసి పని లేదు. కానీ, ఈ సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. అందరి భారాల్ని మోసే వాడు అతనే. కోర్కెల్ని పరిత్యుజించువాడు విశ్వంలో లీనమై, సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాడు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన దైవభక్తుని లక్షణాలు. పరిత్యాగం కంటే . ఎందుకంటే, సన్నిహితమైన తన బంధాన్ని, ప్రేమను, జాతి-మత-కుల పరిమితులను దాటుటే, వాటిని అధిగమించుటే నిజమైన పరిత్యాగం.

🍥సన్యాసి తన వస్త్రాల్ని, ప్రపంచాన్ని, ఇంటిని విసర్జిస్తున్నాడంటే, విరక్తి వల్ల కాదు. అట్లా చేయడం కానీ, తన చుట్టూ వున్న ప్రపంచాన్ని ప్రేమించి, సేవించాలనే కోరికతో అలా పరిత్యాగం చేస్తాడు. ఆ వికాసం కలిగినప్పుడు , తాను ఇంటి నుండి పారిపోతున్నాననే భావన వుండదు. కానీ, అది చెట్టు నుంది రాలిపోయిన పండు వలె సహజంగా జరుగుతుంది. పరిపక్వత రానంత వరకూ ఇల్లు , ఉద్యోగం వదులుట తెలివితక్కువ తనం.” అని ఎంతో సమగ్రంగా, వివరంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు భగవాన్.
〰〰 🌸🙏🌸. 〰〰

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...