Monday, December 20, 2021

ప్రశ్నలు - సమాధానాలు

ఆండాళ్ అని ఎవరికి పేరు?

=గోదాదేవి.


తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


 ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

=శ్రీ విష్ణు చిత్తులు.


ఆళ్వారులు ఎంతమంది?

=12మంది.


 గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

=భూదేవి.


గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

=తమిళ భాష.


తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

=నాలాయిర్ దివ్యప్రబంధము.


 శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

=108.


 గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

=శ్రీవిల్లిపుత్తూరు.


 దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


 శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

=196 అడుగులు.


 ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

=మూడవ పాశురం.


 శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

=తిరుసాదము.


 శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

=కోదై (గోదా)


పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

=గరుడాంశము.


తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

=శ్రీవ్రతము.


మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

=పరమాత్మ చేతిలోని శంఖమువలే.


 శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

=మన్మధుని


తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

=సింహం పిల్లవలె.


తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

=ధృడమైన కోరిక, పట్టుదల.


కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

=మొదటి పాశురం.


 శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

=రెండవ పాశురం.


 తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

=వామన అవతారం.


 ఆళ్వార్లకు మరో పేరేమిటి?

=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

=మూడు.


మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

=యమునా నది.


మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

=దానగుణం.


లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

=వర్షానికి.


పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


 విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

=ఐదవ పాశురం.


విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=నమ్మళ్వారు.


తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=బుద్ధివ్రతం.


 గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

=పిళ్ళాయ్ (పిల్లా).


తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

=ఆళ్వార్లతో.


గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వారు.


తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

=భరద్వాజ (చాతక) పక్షులు.


తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


 సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

=విష్ణుపోతము


(విష్ణువనే ఓడ)


 పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

=ఆయన దాసులే గొప్ప.


ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

=ఎన్ని జన్మలకైనా అని అర్థము.


ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

=అయోధ్య.


వజ్గం అంటే ఏమిటి?

=ఓడ.


 ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

=అమృత కలశం.


ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


గోపికల దివ్యాభరణములేవి?

=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


శ్రీవిష్ణుచిత్తుల వారు


తమ మెడలో ఏ మాల ధరి


ంచెను?

=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

తిరుప్పావై ఎటువంటి మాల?

=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=తొండరపడిప్పొడి

యాళ్వార్....స్వస్తి...


ఆండాళ్ తిరువడిగలే శరణం ...

Tuesday, December 14, 2021

కాశి ఆలయ చరిత్ర


  • కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 
  • కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.
  • క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం
  • క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన
  • క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం
  • క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు
  • క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి
  • క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్
  • క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం
  • క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు
  • శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి
  • క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు
  • క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం
  • క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం
  • క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు
  • క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్
  • కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం
  • ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు
  • కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం
  • 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన. 
  • 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.
  • కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.
  • మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.
  • కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.
  • విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.
  • ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.
  • ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.
  • 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.

Friday, November 26, 2021

తిథి అంటే ఏమిటి > అధిష్టాన దేవతలెవరు .

తిథి అంటే వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరకొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు..  తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.  

(1) చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి.పాడ్యానికి అధిదేవత అగ్ని.

(2) విధియ > బ్రహ్మ

(3) తదియ > గౌరి

(4) చవితి > వినాయకుడు

(5) పంచమి > నాగరాజు

(6) షష్టి > షణ్ముఖుడు

(7) సప్తమి > సూర్యుడు

(8) అష్టమి > రుద్రుడు

(9) నవమి > దుర్గ

(10) దశమి > ఆదిశేషుడు

(11) ఏకాదశి > యమధర్మరాజు

(12) ద్వాదశి > విష్ణు

(13) త్రయోదసి > కాముడు లేదా శివుడు

(14) చతుర్థశి >  కాళికామాత

(15) పౌర్ణమి > చంద్రుడు

(16) అమావాస్య > లక్ష్మి

ఏదెైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.

Wednesday, November 24, 2021

ఆగమం

భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్‌ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి.

వైష్ణవ ఆగమము లలో రెండు రకాలు ఉన్నాయి.

వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము'.

గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'.

వైఖానస ఆగమం:

శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

పాంచరాత్ర ఆగమం:

పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పాద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు.

పూజలు

నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆ సాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

  1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం 

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం 

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం 

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం 

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం 

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం 

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం 

లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం 

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం 

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం 

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం 

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మపురాణం 

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం 

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం 

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్యపురాణం 

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మావైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

Friday, November 19, 2021

Mango leaves

 Mango leaves continue to release oxygen for a couple of days at least, after cutting them. That's why they are used in all festivals and functions to keep the air fresh, specifically when there are many people there.

Reason why our Sanatana Dharma encourages us to tie Mango leaves to our doors....  In this video, a mango leaf is cut in a laboratory and kept under a microscope... The bubbles coming out of leaf is oxygen... Our rishis knew this millennia back and made it a part of our culture.



Thursday, November 18, 2021

బ్రహ్మముహూర్తం

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత *బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, *98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది... 

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...