Friday, February 6, 2026

కేశవ నామాలు - వాటి విశిష్టత

ఈ రోజు మొదటి నామం

-------------------------------------------------------------

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముందుగా ఆచమనము చేస్తూ

కేశవాయ నమః! నారాయణాయ నమః! మాధవాయ నమః!

అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని మూడు సార్లు తీర్థము తీసుకుని, తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము. ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి?

దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది. ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది. ప్రీతితో కార్యము చేస్తాము.

కేశవ నామాలు (24 చతుర్వింశతి నామాలు) విష్ణువు యొక్క వివిధ రూపాలను సూచిస్తాయి,  ఈ నామాలు శరీర శుద్ధిని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని నమ్ముతారు, ముఖ్యంగా కేశవ, నారాయణ, మాధవ నామాలు త్రివిధ తాపాలను నివారిస్తాయి.

కేశవ నామాలలో మొదటి నామం అయిన కేశవ రూపంలో స్వామి వారికి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము… ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో గద, చక్రం పట్టుకుని కనిపిస్తాడు.


 01. ఓం కేశవాయనమః (శంఖం-చక్రం-గద-పద్మం)

“కేశవాయ నమః” అని మనం నమస్కరిస్తున్నప్పుడు, అది కేవలం ఒక నామస్మరణ కాదు —

అది సర్వాత్ముడైన శ్రీమన్నారాయణునికి సంపూర్ణ శరణాగతి. కేశవుడు అంటే ఎవరు?  కేశి అనే దుష్ట అసురుణ్ని సంహరించినవాడు, అలాగే బ్రహ్మ (క), విష్ణు (ఈశ), శివ (వ) ఈ మూడు తత్త్వాల సమన్వయ స్వరూపుడు. అందుకే “కేశవ” నామం సృష్టి–స్థితి–లయలకు అధిపతి అయిన పరమేశ్వరుని సూచిస్తుంది. “నమః” అన్న మాటలో అహంకారానికి స్థానం లేదు. “నా బలం కాదు, నా జ్ఞానం కాదు, అన్నీ నీ కృపే స్వామీ” అనే వినయ భావం ఉంది. భక్తితో “కేశవాయ నమః” అని స్మరిస్తే —మన అహంకారం కరిగిపోతుంది, మనస్సు స్థిరపడుతుంది, హృదయంలో భక్తి వేర్లు వేస్తుంది. ఈ నామం ఏమి చెబుతుంది? కేశవుడే రక్షకుడు, కేశవుడే కర్త, కేశవుడే శరణ్యం. అందుకే ప్రతి కార్యం ప్రారంభంలో ఈ నామాన్ని స్మరించితే ఆ కార్యం మంగళమయమవుతుంది.

ఓం కేశవాయ నమః!!

No comments:

Post a Comment

కేశవ నామాలు - వాటి విశిష్టత

ఈ రోజు మొదటి నామం ------------------------------------------------------------- మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ...