Saturday, July 5, 2025

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం - ఫలశృతి - భావము!!

నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం |

ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ ||


సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు|

ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరిః ||


ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదా (అ)వతు |

దేవ దేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః ||


సర్వత్ర సర్వ కాలేషు మాంగాంబాజా నిరీశ్వరః |

పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు ||


ఫలశృతి: 💐


య యేతత్ వజ్రకవచ మభేద్యం వేంకటేశశితుః |

సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః!!

మృత్యుం తరతి నిర్భయః

మృత్యుం తరతి నిర్భయః


||ఇతి శ్రీ మార్కండేయ కృత వేంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణమ్!! 


   🪷┈┉┅━❀🌀❀┉┅━🪷


"వేంకట వజ్ర కవచస్తోత్రం" మార్కండేయ మహర్షి చెప్పిందని ప్రసిద్ధి. 


ఈ స్తోత్రంలో నాల్గు శ్లోకాలు 'నన్ను రక్షించు గాక ' అని అర్ధం వచ్చేవి. 


చివరి ఒక్కశ్లోకం "ఫలశృతి"  రూపమైనది. 


మొత్తం ఐదు శ్లోకాలు.


భావం : 💐


1.  శ్రీ వేంకటేశ్వరుడు -  సాక్షాన్నారాయణుడు.  పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను.  శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆ స్వామిని స్మరించుటే) నాకు భద్రకవచమై రక్షించుగాక !


2.  వేయి తలలు - అంటే అనంతమైన శిరసులు కల పరమాత్ముడైన వేంకటేశుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువూ, అందరి ప్రాణాలకు నిలయుడూ అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక !


3.  ఆకాశరాజుకూతురు పత్మావతికి భర్త అయిన వేకటేశుడు  నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక ! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక !


4.  అలమేలుమంగమ్మపతి అన్నిటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్ని చోట్లా, అన్ని కాలాలలో నా సత్కర్మల నన్నింటిని రక్షించి వాటిని సఫలం చేయుగాక !


ఫలశృతి భావం: 🕉️


ఈ వేంకటేశ్వరవజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినమూ భక్తితో పఠించేవాళ్ళు మృత్యుభయం లేకుండా ఆనందంగా ఉంటారు. 


లఘు వివరణ: 💐


కవచమంటే శరీరాన్ని రక్షించే సాధనం. అది వజ్రంతో తయారయిందంటే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది.  ఈ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం భక్తులపాలిటికి వజ్రకవచమై వాళ్ళను కాపాడుతుంది.  


శ్రీస్వామివారిని శరణు పొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్ళు అన్ని ఆపదలనుండీ, శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు.  మృత్యుభయం లేకుండా హాయిగా వుంటారు (మృత్యువు కంటే మృత్యు భయం గొప్పది).


🙏 ,సర్వం శ్రీ వేంకటేశ్వారార్పణమస్తు! 💐


🙏 ఆ ఏడుకొండలవాడు, ఆపదమోక్కులవాడి కరుణ కటాక్షములు మీ మీద ఉండాలని కోరుతూ.....


 🙏 ||ఓం నమో వేంకటేశాయ|| 🙏


        ❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 సర్వే జనాః సుఖినోభవంతు

రేపు తొలి ఏకాదశి , శయన ఏకాదశి

తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.

తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.

ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 

అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 

అన్నదానం చేయడం చాలా మంచిది. 

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు ,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

ప్రాశస్త్యం

ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం - ఫలశృతి - భావము!!

నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం | ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ || సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు| ప్రాణేశః ప్రాణ నిలయః ప్రా...