Sunday, September 8, 2019

బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే ఈ పద్యం గురించి మీకు తెలుసా !?


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి.

 ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం.

కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను.

అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు

’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.

అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.

మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.

కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి?

ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.

ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ

సర్వేజనా సుఖినోభవంతు ..

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...