Tuesday, August 20, 2019

అష్టాక్షరీ మంత్ర మహిమ

” ఓం నమో నారాయణాయ ” అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు

మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం.

వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.

అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా

"ఓం" కారం శుక్ల (తెలుపు) వర్ణం,
"న" కారం రక్త (ఎరుపు) వర్ణం,
"మో" అనే అక్షరం కృష్ణ (నలుపు),
"నా" అనే అక్షరం ఎర్రగానూ,
"రా" అనే అక్షరం కుంకుమరంగులోనూ,
"య" అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,
"ణా" అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.

ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.

సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.

నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు.

ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...