Friday, March 8, 2019

వివేకచూడామణి

1. వివేకచూడామణి
(శంకరాచార్యులవారి) 
పరిచయము

శ్రీ శంకరాచార్యులవారు వివేకచూడామణి అనే అత్యంత ప్రాచుర్యము పొందిన ఆధ్యాత్మిక గ్రంధ రాజము, అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదిస్తూ 580 సంస్కృత శ్లోకాలతో వ్రాయగా దానిని స్వామి మాధవానందుల వారు ఆంగ్లములోకి అనువాదము చేసియున్నారు.
దానిని పరిశీలించి అందులోని అద్వైత తత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందే విధానమును తెలుగు భాషలోకి నా యొక్క స్వేచ్ఛానువాదము ద్వారా తెలియజేయు నా ప్రయత్నము సాహసమే అవుతుంది. అయినను వ్రాయాలనిపించి నాదైన సులభ శైలిలో వ్రాసినాను. నా యొక్క ఇతర పుస్తకములవలె దీనిని కూడా ఆదరిస్తారని తలచెదను.
వివేకచూడామణి అనగా సత్యాసత్యములను, మంచి చెడులను విడదీసి తెలుసుకొనుటలో ఈ గ్రంధము మణిశిఖ వంటిదని అర్థము.

2. మానవ జన్మ

1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ''గురువే ప్రత్యక్ష దైవ'' మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.

2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము. అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.

3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ అను మూడు ముఖ్య విషయములు అవసరము.

4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన్మ రాహిత్యానికి కృషి చేయకుండా, ఆత్మహత్య సదృశమైన లౌకికానందములో చిక్కుకొనుట అనుచితము.

5. మనిషి తనకు లభించిన పురుష మానవ జన్మను జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయకుండుట ఎంత తెలివి తక్కువ తనము.

6. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అను సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచమున్నంత కాలము 432 మిలియన్ల సంవత్సరములు యగ్నయాగాదులు చేసి, దేవతలను తృప్తి పరచినను జన్మ రాహిత్య స్థితి లభించదు.

 7. సంపదలు, వేదాల పఠనము, యగ్నయాగాదులు మొదలగు వాటి వలన పరమాత్మను పొందలేము. జన్మ రాహిత్యము లభించదు.

8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.

9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.

10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.

11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగలము. కర్మలు 10 లక్షలు చేసినను సత్యాన్ని గ్రహించలేము.

12. తాడును చూసి పామని భ్రమించి భయభీతులు చెందువాడు మనస్సులో తగినట్లు విచారణ చేసిన అది పాము కాదు తాడని గ్రహించగలడు.

13. సత్యాసత్య జ్ఞానాన్ని పొందిన జ్ఞానులతో సంభాషణ ద్వారా మాత్రమే సత్యము అవగతమగును. ఇతరత్రా నదీ జలాలలో స్నానాలు, దేవతలకు పూజలు, సమర్పణలు మరియు ప్రాణాయామము ద్వారా ప్రాణ శక్తిని అదుపుచేసినను సత్యము అవగతము కాదు.

14. శాస్త్ర పరిజ్ఞానముతో సత్యాసత్య వివేకము పొంది, శాస్త్ర చర్చలలో ప్రశ్నించుట, వాదనలలో ప్రావీణ్యం పొందిన వాడే విజయాన్ని పొందగలడు. సమయము, ప్రదేశము మరియు ఇతరత్రా ఏవైన, కేవలము అందుకు సహాయకారులు మాత్రమే.

🍃 3. సాధకుడు🍃

15. సాధకుడు ఆత్మ జ్ఞానము పొంది, వివేకముతో దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞానమును పొందిన సద్గురువును ఆశ్రయించవలెను.

16. ఆత్మ జ్ఞానము పొందాలంటే సాధకుడు 14వ శ్లోకములో చెప్పినట్లు శాస్త్ర పరిజ్ఞానము పొంది, శాస్త్ర చర్చలలో విస్తారముగా పాల్గొనగల్గి ఉండవలెను.

17. ఏ వ్యక్తి సత్యాసత్య జ్ఞానమును పొంది అనిత్య స్థితులకు అతీతముగా మనస్సును మళ్ళించి ప్రశాంతతను పొంది, సత్వగుణ ప్రధానుడై జన్మ రాహిత్య స్థితికై ఆపేక్ష గల్గినవాడే బ్రహ్మన్ని గూర్చి తెలుసుకొనగలడు.

18. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు యోగులు నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిరి. అలా కానిచో విజయమును సాధించలేరు.

19. మొదటిది సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట. రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము. మూడవది ప్రశాంతత, విశ్రాంతి. నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.

20. మానసికంగా దృఢ నిశ్చయంతో బ్రహ్మము యొక్క సత్యాన్ని, ప్రపంచము యొక్క అసత్యాన్ని గూర్చిన నిర్ణయము. అందుకు సత్యాసత్యములను గ్రహించుటలో విచక్షణా శక్తి కల్గి యుండవలెను.

21. ప్రతి క్షణానికి మార్పు చెందే ప్రాపంచిక సుఖ దుఃఖాలకు దూరంగా వైరాగ్య భావముతో కోరికలను త్యజించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు తగిన సాధన కొనసాగించాలి.

22. విశ్రాంతితో కూడిన మనస్సు తన లక్ష్యమైన బ్రహ్మమును పొందుటకు, ప్రాపంచిక విషయ సంబందముల నుండి విడివడుటకు, వాటిలోని తప్పులను గమనించుటకు సమత్వ స్థితితో కూడిన నిశ్చలత్వమును పొందును.

23. రెండు విధములైన జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియమును వస్తు సముదాయముల నుండి మరల్చుట దమ మనియూ లేక ఆత్మ నిగ్రహమనియు చెప్పబడినది. అలానే ఉపరతి ద్వారా మనస్సును బాహ్య వస్తువుల ఎడ ఆకర్షణ నుండి ఉపసంహరించు కొనవలెను.

24. తితిక్ష లేక విముక్తి ద్వారా అన్ని విధములైన ప్రేమలు, ఆపేక్షలు తొలగించుకొని దుఃఖము, ఆదుర్దాల నుండి విముక్తి పొందాలి.

25. యోగులచే చెప్పబడిన నమ్మకము లేక శ్రద్ద అను విధానము ద్వారా, గురుదేవుల నిర్ణయములు, శాస్త్రములు యదార్ధములని దృఢమైన నమ్మకము కలిగి ఉండాలి.

26. సత్యము ఎడల కేవలము కుతూహలము, ఆలోచన మాత్రమే కాక స్థిరమైన ఆధ్యాత్మిక దృష్టితో బ్రహ్మ జ్ఞానము ఎడల ఏకాగ్రత కల్గియుండుటను సమాధానము లేక స్వయం స్థిరత్వమని చెప్పుట జరిగింది.

27. అజ్ఞానముతో కూడిన బంధనాల నుండి విముక్తిని పొందుట, కోరికల నుండి విడివడుట ద్వారా అహంకారమును తొలగించు కొనుటనే ముముక్షుత్వమని చెప్పబడింది.

28. బద్దకము, పాలుమాలికను వదలి గురువు యొక్క దయతో స్వేచ్ఛను పొంది వైరాగ్యముతో సమత్వ స్థితిని, శాంతిని పొందుట చేయాలి.

29. ఈ విషయములలో ముఖ్యముగా లౌకిక విషయాలకు అతీతముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు ప్రాకులాడుచూ, ఉన్నతమైన శాంతిని పొందుతూ ఇతర సాధనలు చేయుట నిజమైన ఫలితాలను ఇస్తుంది.

30. ఎడారిలోని నీటిలాగ కేవలము ప్రాపంచిక విషయాలకు దూరముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు ప్రశాంతత కొరకు చేయు సామాన్య ఫలితములన్నియూ నిష్ఫలము.

31. జన్మ రాహిత్యానికి, భక్తికి చేయు ప్రయత్నాలు అత్యున్నత స్థానమును ఆక్రమిస్తాయి. భక్తి అనేది ద్వైత సిద్దాంతము ప్రకారము ఒక దివ్యాత్మ మీద ప్రేమను వ్యక్తము చేస్తున్నప్పటికి, అద్వైత సిద్ధాంతము ప్రకారము పరమాత్మ ఒక్కడే. పూజింపదగినవాడు. ఈ రెండు వేరుగా చెప్పబడినప్పటికి, పరమాత్మ అంశయైన దివ్యాత్మకు, పరమాత్మకు ఎక్కువ భేదము లేదని, అవి దాదాపు సమానమని చెప్పవచ్చు.

32. కొన్ని ఇతర సిద్ధాంతముల వారు స్వయం ఆత్మయే నిజమైన సత్యమని చెప్పు చుండిరి. నిజానికి మనమే స్వయం ఆత్మలమైనప్పటికి ఆజ్ఞానము వలన మన ఆత్మను మనము తెలుసుకొనలేకున్నాము. అందువలన మనము నిజమైన ఆత్మ తత్వమును గ్రహించుటకు బంధనాల నుండి, అజ్ఞానము నుండి విముక్తి పొందుటకు ఆత్మ జ్ఞానము పొందిన గురువును ఆశ్రయించాలి.

33. మనం ఎంచుకొనే గురువు వేద జ్ఞానము కలిగి, తనకు తాను బ్రహ్మములో సదా చరించువాడై, కోరికలను త్యజించినవాడై, పరిశుద్దుడై, భౌతిక ప్రపంచము యొక్క కర్మల నుండి విడివడినవాడై ఉండవలెను. మరియు ప్రశాంత చిత్తుడై కోరికలను దగ్దము చేసినవాడై, దయా సముద్రుడై ఉండవలెను. అందరిని ప్రేమించువాడై ఉండవలెను.

34. అట్టి గురువును భక్తితో పూజింపవలెను, సేవించవలెను. వినయ విధేయతలతో తన సందేహములకు సమాధానము పొందవలెను.

35. హే ప్రభూ! దయాసాగరా! నిన్ను నమ్మినవారిని బ్రోచే నీకివే నా వందనములు. నన్ను రక్షింపుము చావు పుట్టుకలతో కూడిన సంసార బంధనముల నుండి విముక్తి కలిగించుము. మీ దయా దృష్టిని నాపై ప్రసరింపజేసి నీ యొక్క కరుణామృతమును నాపై కురిపించుము.

36. ప్రపంచములోని సంసారమనే మహారణ్యములో, దావాలనములో చిక్కుకొని మరణించే చావు నుండి మమ్ములను రక్షించుము ప్రభూ! మేము గత జన్మలలో చేసిన పాపకర్మల వలన, ఇప్పుడు మేము అనుభవించుచున్న భయంకరమైన తుఫాను గాలులవంటి సంసార బాధల నుండి విముక్తి పొందుటకై మాకు మీరే దిక్కు ప్రభూ!

37. కొన్ని ఉన్నతమైన ఆత్మలు ప్రశాంత స్థితిలో ఔన్నత్యము సాధించి తాము ఇతరుల ఉన్నతికి, వసంత ఋతువులో ప్రకృతి ప్రతిస్పందించినట్లు, వారు తాము భయంకరమైన పుట్టుక, చావుల నుండి విముక్తి చెంది, ఇతరుల ఉద్దరణ కొరకు నిస్వార్ధముగా తోడ్పడుచుండురు.

38. ఉన్నత స్థితిని పొందిన జ్ఞానులు తమ స్వభావాన్ని అనుసరించి స్వార్ధ రహితులై ఇతరుల కష్టాలను తొలగించుటకు కృషిని చేయుచుందురు. ఉదాహరణకు చంద్రుడు ఎవరు కోరకుండానే భూమి యొక్క ఉన్నతికి సూర్యకిరణాలను మళ్ళించి తన చల్లని కిరణాలతో ప్రకృతికి తోడ్పడుట జరుగుచున్నది.

39. ఓ ప్రభూ! మీ యొక్క అమృత వాక్కుల ద్వారా మాలో బ్రహ్మ జ్ఞానము యొక్క మాధుర్యమును నింపి, చల్లని మీ యొక్క వాక్కు అనే అమృత భాండము నుండి అమృతమును కురిపించి, మా చెవులకు వీనులవిందును కలిగించిన, మా యొక్క ప్రాపంచిక విషయ వాంఛలు అడవిలోని దావాలనమువలె దగ్దమవుతాయి. చల్లని నీ దయా దృష్టిని మాపై ప్రసరింప జేయవలసినదిగా కోరుచున్నాము.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...