Tuesday, July 4, 2017

తొలి ఏకాదశి - విశిష్టత

  ఆషాఢ శుద్ధ ఏకాదశి - తొలి ఏకాదశి. ఈ సంవత్సరం జులై 4 నాడు జరుపుకునే తొలి ఏకాదశి హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.

సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.

ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం.

ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని ‘స్మృతి పురాణం’ చెబుతోంది.

ఈ వర్షరుతువు ఆరంభంలో, సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నదీ పండుగ సంకేతమే.

ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరిస్తుంది. అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది.

ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.

ప్రసన్నత, శాంతి, సాత్విక చింతన, దానధర్మాలు, జ్ఞాన పిపాసలకు తొలి ఏకాదశి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. భగవన్నామస్మరణ ద్వారా మోక్షాసక్తిని పెంపొందింపజేస్తుంది.
♻🌷♻

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...