Friday, July 30, 2021

ఐదు ప్రాణములు

 శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.


1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయువు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

అంతర్నేత్రం

అన్ని పనులూ అయిపోయాక, కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవటం సాధారణంగా మనలో చాలామందికి అలవాటు ఉండదు. చక్కగా కళ్లు మూసుకుని కూర్చోవడం ఒక కళ. ఆ కళను అభ్యసించాలి.

ఈ గందరగోళ జీవితంలో ప్రశాంతంగా కూర్చోవడం సాధ్యపడటంలేదు. నిర్మలమైన ఆకాశాన్ని చూడటం మరిచిపోయాం. నిశ్చలమైన మనసును అనుభూతి చెందటం మనకు తెలియటం లేదు.


కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం మనల్ని వదలిపోదు. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. లోపల ఎన్నో అద్భుతాలు. ఓ చిన్న కనురెప్ప రెండు ప్రపంచాలను వేరుచేస్తూ, కలుపుతూ ఉంటుంది.


కళ్లు మూసుకుని లోపలికి వెళుతున్న కొలది, కళ్లు తెరుచుకుని చూస్తున్నప్పుడు కనిపించేదంతా ఓ కలగా, మాయగా చివరికి శూన్యంగా మారిపోతుంది. అక్కడ గొప్ప ప్రశాంతత ఉంటుంది.


ఒక గురువు కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అతణ్ని ఓ వ్యక్తి సమీపించి 'మీరు చేస్తున్నది ఏమిటి?' అని అడిగాడు.


'లోపల చూస్తున్నాను' అని ఆ గురువు చెప్పాడు. ఆ వ్యక్తి గందరగోళంలో పడిపోయాడు.


'కళ్లు మూసుకుని చూస్తున్నారా?' ఆశ్చర్యపోతూ అడిగాడు.


'అవును... అదే నిజమైన చూపు'


కళ్లు తెరుచుకున్నప్పుడు అవి అనంతంలోకి చేరుకోగలవు. కాని అవే కళ్లు మూసుకుని లోపలికి చూసినప్పుడు అనంతత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ మన స్వస్వరూపం కనిపిస్తుంది. అప్పుడే విశ్వరూపం బయటపడుతుంది.


కనిపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు. ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నవాణ్ని చూడాలని అనుకోరు. ఈ అందాలకు, ఆనందాలకు, అనుభూతులకు కారణం... లోపల ఉంది.


రబియా అనే ఒక యోగిని ఉండేది. ఓ సుందరమైన ప్రభాతవేళలో ఎవరో 'రబియా! కుటీరంలో ఏం చేస్తున్నావు? బయటికి రా, ఇక్కడికొచ్చి చూడు. ఎంత అందమైన ఉదయాన్ని సృష్టించాడో దేవుడు!' అన్నారు.


కుటీరం లోపలి నుంచి రబియా ఇలా అంది. 'నీకు బయట కనిపిస్తున్న ఆ సుందర ఉదయాన్ని సృష్టించిన వాణ్ని నేను ఇక్కడినుంచే చూస్తున్నాను. ఓ మిత్రుడా! నువ్వే లోపలికొస్తే మంచిది. బయట ఉన్న ఏ అందమూ అందం అనిపించుకోదు- ఇక్కడున్న అందం ముందు!'


దర్శింపజేస్తున్నవాణ్ని దర్శించాలి!


కాని, కళ్లు మూసుకునే ఉంటాం. లోపల ఉండం. ఎప్పుడూ బయటే ఉంటాం. మూసుకున్నంత మాత్రాన కళ్లు మూతపడతాయా? కళ్లు మూసుకున్నా బయట దృశ్యాలు వేదిక మీద ప్రదర్శించే దృశ్యాల్లా అలా వెంటాడుతూనే ఉంటాయి...


కనురెప్పలు మూతపడటం- కళ్లు మూసుకోవడం కాదు. కళ్లు మూసుకోవడం అంటే లోపలికి దిగి వస్తున్న కలల నుంచి, ఆలోచనల నుంచి స్వేచ్ఛను పొందడం.


కళ్లు మూసుకోవడం అంటే- దృశ్యాలన్నీ మాయమైపోయి అంతరంగంలో నిశ్చలంగా ఉండిపోవడం. కళ్లు మూసుకోవడం అంటే, నిశ్చలానందాన్ని అనుభవించడం. కళ్లు మూసుకోవడం అంటే, దివ్య చైతన్యాన్ని నీ ముందర సాక్షాత్కరింపజేసుకోవడం. అదే సత్యం. అదే బ్రహ్మానంద పారవశ్యం. అదే జగత్తును ఆడిస్తున్న క్రీడ. అదే శివం. అదే సుందరం.

Wednesday, July 28, 2021

గాయత్రీ మంత్రం

 గాయత్రీమంత్రంచాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. 


కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.


నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.


గాయత్రీ మంత్రము అంటే…


“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 

భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”


ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…


ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్


ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.


ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.


గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.


1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.


2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.


3. పురాణ కధనం ప్రకారం 24మంది  

మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకునిధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.


4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.


5. 24 కేశవ నామాలు


6. 24 తత్వాలు : 

*ఐదు జ్ఞానేన్ద్రియాలు, 

*5 కర్మేంద్రియాలు, 

*పంచ తన్మాత్రలు, 

*5 మహాద్భుతాలు, 

*బుద్ధి, *ప్రకృతి, *అహంకారం, *మనస్సు


7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”


8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.


9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.


10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.


11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.


“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతాః పర దైవతం” అన్నారు పెద్దలు . 


24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. 


సకల దేవతా స్వరూపం గాయత్రీ. 

రామాయణ సారం గాయత్రీ . 

కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.

సకలకోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రీ 

24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. 


అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

పూజా నియమాలను

1. పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.

2. నేతిదీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.

3. ఎడమచేతితో ఉద్ధరణె నీళ్ళు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.

4. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మిసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.

5. గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదు.

6. పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.

7. పూజులో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది.

8. తూర్పు - ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.

9. పూజలకు, జపానికి వినియోగించే ఆసనం - అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి - ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.

10. జపం చేసేటప్పుడు మాలమధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.

11. నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపుల కొనలకు పసుపుపెట్టి ఇవ్వాలి.

12. అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.

13. వట్టి నేలపై కూర్చొని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు.

14. ''పూజ'' అంటే ''భోగములను ప్రసాదించునది (కలిగించునది)'' అని అర్ధం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.

15. మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప ధూపాలు, కుసుమాలు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుకే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.

16. బహిష్టులు స్త్రీలు మసలేచోట వారి దృష్టి పడేచోట దేవతాపూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో, ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు

పెద్దల అనుభవాల తో ఆచరించి చెప్పిన సామెతలు మీకోసం, మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు:

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక  

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు

తుకారాం ... పాండురంగడి భక్తుడు

 తుకారాం ... పాండురంగడి భక్తుడు ... మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి. 


 పాండురంగడిని సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. పాండురంగడి ఆదేశం మేరకు అనేక 'అభంగాలు' రచించి వాటిని ఆ స్వామికే అంకితం చేసిన పరమభక్త శిఖామణి. తనకున్న కొద్దిపాటి ఆస్తి పాస్తులను పాండురంగడి సేవకే ధారపోసిన తుకారాం, మానవసేవే మాధవ సేవగా భావించి భక్తి మార్గాన రాగ పరిమళాలు వెదజల్లాడు.


ఒక వైపున భార్యా బిడ్డలు ఆకలితో అలమటించి పోతున్నా, పాండురంగడి గురించి మాత్రమే ఆలోచించిన అనితర సాధ్యమైన భక్తి ప్రపత్తులు ఆయనలో కనిపిస్తాయి.


 పాండురంగడు ప్రసాదించినది మినహా వేరెవరు ఏది ఇచ్చినా స్వీకరించనంటూ, శివాజీ మహారాజు పంపిన కానుకలను సైతం తిప్పి పంపిన మహనీయుడు ఆయన.


 తనను అన్ని విధాలుగా పరీక్షించిన పాండురంగడిని, ఒకానొక సమయంలో తుకారాం నిరసించాడు. అలాంటి పరిస్థితుల్లోనే తుకారాంకి పాండురంగడు దర్శనమిచ్చాడు.


తుకారాం జీవితంలో దైవ లీలలకు సంబంధించిన ఎన్నో అపూర్వమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి



తుకారాంకి పాండురంగడి ధ్యాస తప్ప మరో ఆలోచన వుండేది కాదు. ఆ స్వామిపై అనేక అభంగాలను రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోయేవాడు. తనకి మంచి జరిగినా ... చెడు జరిగినా ఆ పాండురంగడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు. అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది.


తుకారాం పాండురంగడిపై అభంగాలను రాసి పాడుతుండటం ... అవి వింటూ ప్రజలు మైమరచి పోతుండటం, అగ్రవర్ణానికి చెందిన రామేశ్వరభట్టుకి అసూయ కలిగించింది. గ్రామ ప్రజలు తన కంటే తుకారాంనే ఎక్కువగా గౌరవించడాన్ని ఆయన సహించలేకపోయాడు. గ్రామస్తుల సమక్షంలో తుకారాంని దోషిగా నిలబెట్టి, తక్కువ కులంలో పుట్టిన ఆయనకి భగవంతునిపై భజనలు ... కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు. ఇక నుంచి ఆ అలవాటు మానుకోవడమే కాకుండా, అంతవరకూ రాసినవి ఇంద్రాణి నదిలో పారేయ్యాలని ఆదేశించాడు.


అది పాండురంగడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించిన తుకారాం, తాను అభంగాలను రాసిన తాళపత్రాలపై నాపరాతి పలకలు పేర్చి వాటిని గుడ్డలో మూటగట్టి ఇంద్రాణి నదిలో ముంచేశాడు. తనకి ఎంతో ఇష్టమైన అభంగాలను వదిలేసినందుకు బాధతో ... భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన నిద్రాహారాలను మానేశాడు. అలా ఓ 13 రోజులు గడిచిపోయాక తుకారాం ఇంద్రాణి నదిలో ఎక్కడైతే ఆ అభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు కనిపించాయి. అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా వుండటం చూసి అంతా ఆశ్చర్య పోయారు.


ఈ విషయం తుకారాంకి తెలియగానే ఆయన నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తాళ పత్రాలు ఆయనున్న దిశగా కొట్టుకువచ్చి ఆగాయి. ఆ పాండురంగడికి తనపై దయ కలిగిందంటూ ఓ బిడ్డను దగ్గరికి తీసుకున్నట్టుగా ఆయన ఆ తాళపత్రాల మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ దైవలీలను చూసిన వారంతా ఆశ్చర్య చకితులయ్యారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం రామేశ్వర భట్టుకి తెలిసింది. అంతే ఆయన పరుగు పరుగునా వచ్చి తుకారాం పాదాలపై పడ్డాడు. అతని పట్ల అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించమంటూ ప్రాధేయపడ్డాడు

ఈ సంఘటన తరువాత తుకారాం విషయంలో గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పువచ్చింది. తుకారాం మాత్రం సాధారణమైన వ్యక్తిగా అతి సాధారణమైన జీవితాన్నే గడిపాడు ... ఆ పాండురంగడి సేవలోనే తరించాడు.


విఠలా విఠలా..పాండురంగ విఠలా..జయ  పాండురంగ విఠలా.

Tuesday, July 27, 2021

100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు

0.  స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు


చదవండి. పిల్లలతో చదివించండి ఇంతకు మంచిన గొప్ప సంపద పిల్లలికి ఇవ్వలేమేమో

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...