Friday, July 5, 2019

రథయాత్ర


జగన్నాథుని వైభవానికి, వేడుకకు నిలువెత్తు నిదర్శనంగా, కన్నుల పండుగగా జరిగేది జగన్నాధుని రథయాత్ర.

 ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభమవుతుంది. 

ఈ రథయాత్రలో మూడు ప్రధాన రథాలు వుంటాయి.

1. బలభద్రుని రథం
2. సుభద్రా దేవి రథం
3. జగన్నాధుని రథం

ఈ మూడు రథాలు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తవి తయారుచేస్తారు.

రథయాత్ర ముగిసాక ఈ రథాలను భగ్నం (విరిచేస్తారు) చేస్తారు.

జగన్నాధుడు ఊరేగే రథాన్ని నందిఘోష అంటారు.

ఈ రథం 34న్నర అడుగుల ఎత్తు వుంటుంది.
18చక్రాలు వుంటాయి.

'బలభద్రుడు ' ఊరేగే రథాన్ని ' తాళద్వజ' అంటారు. ఈ రధం 33 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. ఈ రథానికి 16 చక్రాలు వుంటాయి.

సుభద్రాదేవి ఊరేగే రథాన్ని దేవదాలన అంటారు.
ఈ రథం 31న్నర అడుగుల ఎత్తు వుంటుంది. ఈ రథానికి14 చక్రాలు వుంటాయి.

ఈ మూడు రథాలు అలంకరించడానికి 12 వందల మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబాయిలోని సెంచరీమిల్స్ వారు విరాళంగా సమర్పిస్తారు.

ఈ రథయాత్ర జగన్నాథుని ప్రదాన ఆలయం నుంచి మొదలై, ' గుండిచ' ఆలయం దగ్గర ముగుస్తుంది.
జగన్నాథుడు ' గుండిచ'  ఆలయం దగ్గర9 రాత్రులు ' శ్రీ మందిరం'లో విడిది చేస్తారు.

 ఈ రథయాత్రలో ఎందరో భక్తులు పాల్గోని శక్తి వంచన లేకుండా రథాన్ని లాగుతూ, భజన పాటలు పాడుతూ, స్వామికి సేవలు అందిస్తారు.

ఈ రథయాత్రను ' గుండిచ జాతర' అని అంటారు. జగన్నాథుడు శ్రీమందిరంలో విడిది చేసే 9 రాత్రులను వేసవి సెలవు దినాలుగా భావించి భక్తులు సేవిస్తారు.

ఈ తొమ్మిది రోజులు జగన్నాధుడు అక్కడే పూజాదికాలు అందుకుంటాడు.

 ఈ తొమ్మిది రోజులు జగన్నాధుని ప్రధాన ఆలయం మూలవిరాట్టు శూన్యంగా వుంటుంది. సాధారణంగా రథాలలో ఉత్సవమూర్తులనే ఊరేగిస్తారు. కానీ జగన్నాధుని రథయాత్రలో మూలవిరాట్టులే ఊరేగడం ప్రత్యేకత.

జాతి, మత, కుల భేదాలు లేకుండా అందరూ  పాల్గొంటారు.

పూరీ క్షేత్రానికి సమీప గ్రామమైన నారాయణపూర్ లో నివసించే సుమారు వెయ్యి కుటుంబాలు ఈ మూడురథాల తయారీలోనూ, రథయాత్రలో ' జైజగన్నాథ' అని అరుస్తూ రథాన్ని లాగడంలోనూ పాల్గొనడం మరో ప్రత్యేకత.

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక విశేష పూజ జరుగుతుంది.

 ఈ పూజలో గర్భాలయాలలోని మూల విరాట్టులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఊరిచివర దహనం చేసేస్తారు. తరువాత కొత్త మూలవిరాట్టులను పునః ప్రతిష్టిస్తారు.

 ఔషధసేవ

జగన్నాధునికి నిత్య పూజలు జరిగే సాధారణ దినాలలో రోజుకి ఆరుసార్లు చొప్పున వివిధ రకాలైన సుమారు 54 ప్రసాదాలు నివేదన చేస్తారు.
అందుకే రథయాత్ర ప్రారంభమైన రోజు నుంచి శ్రీమందిరంలో విడిది చేసిన 9 రోజులు స్వామి వారికి సమర్పించే నివేదనలో నియంత్రణ వుంటుంది.

ఏడాది పొడుగునా ఇన్ని రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భావనతో నైవేద్యాలకు ఆటవిడుపు ప్రకటించి స్వామిపారికి రకరకాలైన ఆయుర్వేద ఔషధాలను నైవేద్యంగా సేవింపచేస్తారు.

ఇటువంటి ఔషధసేవ జగన్నాధుని ఆలయంలో తప్ప మరెక్కడా కనిపించదు.

జగన్నాధుడు శ్రీమందిరంలో విడిది చేసిన 9 రోజుల అనంతరం తిరిగి అవే రథాలలో మహా వైభవంగా గర్భాలయాన్ని చేరుకుంటాడు.

దూరదర్శన్ ప్రసారాలు, యితర ప్రయివేటు ఛానల్స్ వారి ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక జగన్నాధుని రతయాత్ర ప్రపంచంలోని ప్రతి యింటి ముంగిటలోకి వస్తోంది. ఇది సంతోష పరిణామమే. అయినా జగన్నాధుని రథ యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొని, ఆ స్వామిని సేవించడంలోనే నిజమైన ఆనందము, సంతోషము ఉందనే నిజం అనుభవించిన వారికే తెలుస్తుంది. అదే ఈ మానవ దేహం చేసుకునే నిజమైన రథయాత్ర. 

🌸 జై  జై జగన్నాధ 🌸

మరణించిన తర్వాత తల దగ్గర దీపం ఎందుకు పెడతారు?

హిందూ దీపం అనేది వెలుగును ప్రసాదిస్తుంది. మన హిందూ సంప్రదాయంలో దీపం అనేది జ్ఞానదీపం. హిందువులు ప్రతి రోజు ఇంటిలో దీపాన్ని వెలిగిస్తారు. ఏదైనా కార్యాన్ని ప్రారంభించినప్పుడు దీపాన్ని వెలిగించడం ఆచారంగా వస్తుంది. శుభ కార్యాల్లో అయితే దీపం వెలిగించకుండా ఏ పని చేయరు. అలాగే మరణించిన తర్వాత తల దగ్గర దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకంటే శవాన్ని చీకటిలో ఉంచకూడదు అంటుకే దీపాన్ని వెలిగిస్తారు. మరి  పగలు వెలుతురు ఉంటుంది కదా..మరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అనే అనుమానం రావొచ్చు. దీనికి కూడా కారణం ఉంది.

మనం బతికి ఉన్నప్పుడు దీపం చీకటిలో ఎలా దారి చూపిస్తుందో అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా దీపం మోక్ష మార్గం చూపుతుందట. మరణించిన తర్వాత వారి ఆత్మ బ్రహ్మ కపాలం నుంచి బయటకు వస్తేనే వారి ఆత్మకు మోక్ష మార్గం దొరుకుతుందని పురాణాలు చెబుతున్నాయి.

మరణించిన తర్వాత బ్రహ్మ కపాలం నుంచి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మమోక్ష మార్గానికి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఉత్తరమార్గం, రెండోది దక్షిణ మార్గం. దక్షిణ మార్గంలో చీకటి ఉంటుంది. ఉత్తరమార్గంలో వెలుగు ఉంటుంది. బయటకు వచ్చిన ఆత్మకు తల పక్కన ఉన్న దీపం ఉత్తరమార్గం వైపునకు వెళ్లడానికి దారి చూపిస్తుందట. తల దగ్గర ఉన్న దీపమే వెలుగు చూపించి సహాయం చేస్తుందని, అందుకే మరణించిన తర్వాత తల దగ్గర దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.

Thursday, June 27, 2019

సప్తఋషులు

అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

సప్తఋషి ధ్యాన శ్లోకములు :

కశ్యప ఋషి :
 కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||

అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||

భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||

విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||

గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    ఓం అహల్యా సహిత గౌతమాయనమః||

జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వసిష్ఠ ఋషి : శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా|| 
 ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||
                                       సప్తఋషిభ్యో నమః

కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!

ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలి కూడా.

 ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.
సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.


ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!

వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.

ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1. కశ్యపుడు,
2. అత్రి,
3. భరద్వాజుడు,
4. విశ్వామిత్రుడు,
5. గౌతముడు,
6. జమదగ్ని,
7. వసిష్ఠుడు...

వీరు ఏడుగురు పూజనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.


⭐ 1. కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.


⭐ 2. అత్రి మహర్షి:-
 సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.


⭐ 3. భరద్వాజ మహర్షి:-
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.


⭐ 4. విశ్వామిత్ర మహర్షి:-
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.


⭐ 5. గౌతమ మహర్షి:-
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.


⭐ 6. వశిష్ఠ మహర్షి:-
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.


⭐ 7. జమదగ్ని మహర్షి:-
జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు

Tuesday, June 25, 2019

దశ మహా విద్యలు - వాటి ఫలితాలు.



1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి


కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి


దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే

శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే

శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. 
    శ్రీ కాళీ రాఘవేంద్రాచార్యులు

శ్రీ హనుమాన్ కవచం



శ్రీ రామచన్ద్ర ఉవాచ:-

హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః |
అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః ||


లంకా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరంతరం |
సుగ్రీవ సచివః పాతు మస్తకం వాయునన్దనః ||


భాలం పాతు మహావీరో భృవోర్మధ్యే నిరంతరం |
నేత్రే ఛాయాపహారీ చ పాతు నః ప్లవగేశ్వరః ||


కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామకింకరః |
నాసాగ్రం అంజనీసూనుః పాతు వక్త్రం హరీశ్వరః ||


వాచం రుద్రప్రియః పాతు జిహ్వాం పిఙ్గల లోచనః |
పాతు దేవః ఫాల్గునేష్టః చిబుకం దైత్యదర్పహా ||


పాతు కణ్ఠం చ దైత్యారిః స్కంధౌ పాతు సురార్చితః |
భుజౌ పాతు మహాతేజాః కరౌ చ చరణాయుధః ||


నగరన్ నఖాయుధః పాతు కుక్షౌ పాతు కపీశ్వరః |
వక్షో ముద్రాపహారీ చ పాతు పార్శ్వే భుజాయుధః ||


లంకా నిభంజన: పాతు పృష్ఠదేశే నిరంతరం |
నాభిం చ రామదూతస్తు కటిం పాత్వనిలాత్మజః ||


గుహ్యం పాతు మహాప్రాఙ్యో లింగం పాతు శివప్రియః |
ఊరూ చ జానునీ పాతు లంకాప్రసాద భంజనః ||


జంఘె పాతు కపిశ్రేష్ఠోః గుల్ఫౌ పాతు మహాబలః |
అచలోద్ధారకః పాతు పాదౌ భాస్కర సన్నిభః ||


అఙ్గాన్యమిత సత్వాఢ్యః పాతు పాదరఙ్గులీస్తథా |
సర్వాంగాని మహాశూరః పాతు రోమాణి చాక్మవిత్ ||


హనుమత్ కవచం యస్తు పఠేద్ విద్వాన్ విచక్షణః |
స ఏవ పురుషశ్రేష్ఠో భుక్తిం ముక్తిం చ విన్దతి ||


త్రికాలమేకకాలం వా పఠేన్ మాసత్రయం నరః |
సర్వాన్ రిపూన్ క్షణాన్ జిత్వా స పుమాన్ శ్రియమాప్నుయాత్ ||


ఇతి శ్రీ శతకోటిరామచరితాంతర్గత శ్రీమదానన్దరామాయణే వాల్మికీయే మనోహరకాణ్డే

శ్రీ హనుమత్కవచం సంపూర్ణం ||

Friday, June 21, 2019

షోడశ గణపతి స్తోత్రం


విఘ్నేశవిధి మార్తాండ చండేంద్రోపేంద్ర వందితః!
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే!!

1. ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్!
తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీరవిఘ్నకమ్!!

2. పంచమం శక్తి విఘ్నేశం, షష్ఠం ధ్వజ గణాధిపమ్!
సప్తమం పింగళదేవ మష్ట మోచ్చిష్టనాయకమ్!!

3. నవమం విఘ్నరాజం చ దశమం క్షిప్ర నాయకమ్!
ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీ నాయకమ్!!

4. త్రయోదశం మహావిఘ్నం భువనేశం చతుర్దశమ్!
నృత్తాఖ్యం పంచదశకం, షోడశోర్ధ్వ గణాధిపమ్!!

గణేశ షోడశం నామ ప్రయతః ప్రాతరుత్థతః!
సంస్మరేత్ సర్వకుశలం స ప్రయాతిన సంశయః!!

శ్లోకములు:
కార్యారంభే గణేశశ్చ పూజనీయః ప్రయత్నతః!
సర్వే విఘ్నాశ్శమం యాంతి గణేశస్తవ పాఠతః!!

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం!
పుత్రార్థీ లభతే పుత్రం మోక్షార్థీ పరమం పరమ్!!

ఓం నమో గణపతీయే నమః

30 రకాల శివలింగములు మరియు వాటి ప్రతిఫలం !


సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే..అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం.

కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి.

అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి. అపూరూపమైనవి..

ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం..

రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి....

ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయంటే.....

1) గంధపు లింగం.
రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

2) నవనీత లింగం.
వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

3) పుష్పలింగం.
నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

4) రజోమయ లింగం.
పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు

5) ధ్యాన లింగం.
యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.

6 ) తిలిపిస్టోత్థ లింగం.
నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.

7) లవణ లింగం..
హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .

8 ) కర్పూరాజ లింగం .
ముక్తి ప్రదమైనది.

9) భస్మమయ లింగం.
భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది

10) శర్కరామయ లింగం..
సుఖప్రదం..

11) సద్భోత్థ లింగం..
ప్రీతికరని కలిగిస్తుంది.

12) పాలరాతి లింగం..
ఆరోగ్యదాయకం.

13) వంకాకురమయ లింగం.
వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .

14) కేశాస్థి లింగం .
వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.

15) పిష్టమయ లింగం..
ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16) దధిదుగ్థ లింగం .
కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.

17) ఫలోత్థ లింగం..
ఫలప్రదమైనది.

18) రాత్రి ఘజాత లింగం.
ముక్తి ప్రదం

19) గోమయ లింగం..
కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు

20) దూర్వాకాండజ లింగం.
గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది

21) వైడూర్య లింగం..
శత్రునాశనం , దృష్టి దోషహరం

22) ముక్త లింగం .
ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది

23) సువర్ణ నిర్మిత లింగం.
బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది

24) ఇత్తడి - కంచు లింగం..
ముక్తిని ప్రసాదిస్తుంది

25) రజత లింగం..
సంపదలను కలిగిస్తుంది

26) ఇనుము - సీసపు లింగం.
శత్రునాశనం చేస్తుంది

27) అష్టధాతు లింగం.
చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం

28) స్ఫటీక లింగం.
సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది

29) తుష్టోత్థ లింగం..
మారణ క్రియకు పూజిస్తారు

30) సీతాఖండ లింగం.
ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది

పరమేశ్వర పూజా పుష్పఫలము ..

శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు!
ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!

జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !
కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !

బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !
జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !

మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !
అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !

కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !
నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !

తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !
నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !

లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు..
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది.
అవేంటంటే....

* రుద్రుడు !
* భవుడు !
* శర్వుడు !
* ఉగ్రుడు !
* భీముడు !
* పశుపతి !
* ఈశానుడు !
* మహాదేవుడు !

1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!

2) శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!

3) భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!

5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!

7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!

8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...