Monday, February 22, 2021

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం

ఒకసారి ధర్మరాజు లేని సమయంలో  మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగికృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  


ఆయన చెప్పనారంభించాడు.


కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.


కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.


కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.


కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.


ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం...

జన్మనక్షత్రమున చేయదగిన కార్యములు

జన్మ నక్షత్రమున అన్న ప్రాశనము, అక్షరాభ్యాసము, చౌళము, ఉపనయనము, నిషేకము, వ్యవసాయము, భుసంపాదన, మొదలగునవి శుభము. స్త్రీకి జన్మనక్షత్రమున వివాహము చేయుట మంచిది.

పురుషులకు జన్మ నక్షత్రమున ఉపనయనము మంచిది. వారశూలలు -- శని సోమ వారములు తూర్పునకు, దక్షణమునకు గురువారము, పడమరకు ఆది శుక్రవారము ఉత్తరమునకు బుధ మంగళవారములు వారశూలలు. ఆ వారములలో ఆదిక్కునకు ప్రయాణము చేయరాదు.

తిధి శూలలు:

తూర్పునకు- పాడ్యమి, నవమి, తిదులలోను,

ఉత్తరమునకు, విదియ, దశమి యందును,

ఆగ్నేయమునకు, తదియ ఏకాదశి యందును, 

నైరుతి దిక్కునకు చవితి ద్వాదశి తిదులయండును,

దక్షినమునకు పంచమి త్రయోదశి యందును,

పడమరకు, షష్టి, చతుర్దశి యందును,

వాయువ్యమునకు, సప్తమి, పున్నమి యందును,

ఈశాన్యమునకు, అష్టమీ, అమావాస్యలయందును, ప్రయాణము చేయరాదు.

యాత్రా ( ప్రయాణ ) విషయములు:

పాడ్యమి యందు కార్య నాశనము, విదియ ధన లాభము, తదియ యందు శుభము, చవితి యందు సంకటము , పంచమి నాడు, శుభము, షష్టి కలహము, సప్తమి ధనలాభము, అష్టమి కార్యనాశనము, నవమి విచారము, దశమి శుభము, ఏకాదశి కార్యజయము, ద్వాదశి కార్యనాశనము, త్రయోదశి శుభము, చతుర్దశి మరణము, పున్నమి అమావాస్యలలో కార్యనాశనము జుగును. ఈవిషయములు గమనించి ప్రయాణము చేయవలెను. 

Sunday, February 21, 2021

అయ్యప్ప దీక్షా నియమాలు

1. యోగ్యుడైన ఆధ్యాత్మిక గురువు పాదపద్మములను ఆశ్రయించి దీక్షను పుచ్చుకొన వలెను.


2. గురుస్వామి ద్వారా "స్వామియే శరణం అయ్యప్ప" అనే తారకమంత్ర ఉపదేశమును పొంది

భగవంతుని ఎట్లు పూజించవలెనో , ఎట్లు భగవత్సేవ చేయవలెనో నేర్చుకోవలెను.


3. గురువు చెప్పిన విధి విధానాలను , గురువు ఆదేశాలను శ్రద్ధగా పాటించవలెను. గురు

స్వామి ఆజ్ఞను అతిక్రమించకూడదు.


4. ఉదయం , సాయంకాలముల యందు విధిగా పూజ చేయవలెను.


5. భగవంతుని అర్చించిన తరువాత ప్రసాదంగా పూజాపుష్పమును శిరముపై

నుంచుకొనవలెను.


6. పూజ ముగిసిన తరువాత అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా దేవాలయాలకు

వెళ్ళవలెను.


7. తెల్లవారుజామున , సాయంకాలము లందు (రెండు పూటలా) చన్నీటితో తలస్నానం

చేయవలెను.


8. నేలపై చాపవేసుకుని నిద్రించవలెను. (తలగడను ఉపయోగించ గూడదు)


9. బ్రహ్మచర్యమును ఆచరించవలెను.


10. పూజా విధానాన్ని సక్రమముగా పాటించే విధంగా దినసరి కార్యక్రమ ప్రణాళికను

ఏర్పరచుకొనవలెను.


11. అసత్య మాడరాదు.


12. నుదుటను విభూతి , చందన , కుంకుమలు ధరించవలెను.


13. గురుస్వామిగారి పర్యవేక్షణలో ఆ కాలానికి చెందిన సద్ గురుస్వాముల అడుగుజాడలలో

నడుచుకోవలెను.


14. భగవంతుని సన్నిధిలో “పడి" వెలిగించునపుడు ఇతరులకు బాధ కలిగించని రీతిలో

నాట్యమాడవలెను.


15. ప్రత్యేక పూజలు ముగిసిన పిదప గురుస్వాములకు ఒకరి తరువాత ఒకరుగా క్రమపద్ధతిలో

సాష్టాంగ నమస్కారము చేయవలెను.


16. ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తునకు మిగిలిన స్వాములు సున్నితంగా పాదాభివందనం

చేయవలెను.


17. పూజ చేసిన స్వామి కూడా ఇతర స్వాముల పాదాలకు సున్నితంగా , భక్తిగా

నమస్కరించవలెను.


18. స్వామికి సంబంధించిన ఊరేగింపు ఉత్సవాలలో విధిగా పాల్గొని , కనీసం కొంత దూరమైన

నడువవలెను.


19. దేవుని ఊరేగింపు ముగిసిన పిదప అందుకు సంబంధించిన ఆదాయ , వ్యయములను

"స్వామి" సమక్షంలో నివేదించవలెను. ఇదంతా గురుస్వామిగారి ఆజ్ఞమేరకు జరగవలెను.


20. దేవాలయములలోను , ఇంటిలోను వివిధ విశేషపూజలలోను బృందగానములు

చేయవలెను.


21. అయ్యప్ప మాల యందు ఉండే అయ్యప్ప డాలరునకు హారతిని ఇచ్చేటపుడు ఎడమచేతితో

మాలను పట్టుకుని కుడిచేతితో హారతిని చూపించాలి (హారతి మంటల్లో మాలను ,

రూపును త్రిప్పకూడదు.)


22. స్వచ్ఛమైన , శుభ్రత కలిగిన అభిషేక ద్రవ్యములు దొరికినపుడే స్వామికి అభిషేకములు

(చేయించవలెను) చేయవలెను. అభిషేక ద్రవ్యాలు మంచివి కాకపోతే ఆలయంలోని

విగ్రహం పాడైపోతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభిషేకానికి మంచి ద్రవ్యాన్ని

సమకూర్చుకోవలెను.


23. అభిషేక , “ప్రసాదములను" స్వీకరించవలెను.


24. ప్రత్యేక పూజలయందును , స్వామిని అలంకరించుట యందును , అర్చనలలోను మరియు

చేసే ప్రతీ మంచి పనిలోను ఏకాగ్రత , కలిగియుండవలెను.


25. భగవంతునికి చేసేసేవ , భగవద్ భక్తులకు చేసే సేవ ఒక్కటే అని భావించి వినయంతో సేవ చేయవలెను.


26. "స్వామియే శరణం అయ్యప్ప" అనే భగవన్నామమును స్మరిస్తూనే యుండవలెను.


27. తనకు ఆర్థికంగా ఎంత శక్తిగలదో అందుకు తగినట్లుగానే భగవంతుని అర్చించవలెను.


28. ఏదైన ఆహారమునకు సంబంధించిన దానిని భగవంతుని స్మరించి తరువాత తినడంగాని ,

భగవంతునకు సమర్పించి ఆ తరువాత తినడం గాని చేయవలెను.


29. భగవంతునికి ఇష్టమైన కార్యాలను చేయునపుడు భయపడ కూడదు.


30. భగవంతునకు సంబంధించిన ప్రత్యేక సేవా కార్యక్రమాలలో విధిగా పాల్గొనవలెను.


31. మంచి పనులు ఏవి చేస్తున్నా , భగవంతుని తలుస్తూనే చేయవలెను.


32. భోజనమునకు ముందు , భోజనానంతరమును కాళ్లు , చేతులు కడుగుకొనవలెను.


33. హితమైన “సాత్విక ఆహారాన్ని" మితంగా భుజించవలెను.


34. అయ్యప్ప దీక్ష ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవలెను.


35. మనకు ఇష్టమైన పనినైనా పరిత్యజించి , స్వామి యొక్క సేవలో పాల్గొనుటకు సంసిద్ధుడగు

చుండవలెను.


36. దీక్షకు అవసరమైనంత వరకే భౌతిక జగత్తు నుండి స్వీకరించవలెను.


37. మర్రి , మారేడు మొదలగు వృక్షములకు నమస్కరించవలెను.


38. అవసరమైనంత వరకే నిత్య జీవన కార్యక్రమాలను ఆచరించవలెను.


39. దుఃఖము కలిగినపుడు క్రుంగిపోవుట గాని , సుఖము కలిగినపుడు పొంగిపోవుట గాని. చేయకూడదు.


40. వివిధ హోమ , యజ్ఞముల ద్వారా వ్యాపించిన పొగను శ్రద్ధతో పీల్చవలెను.


41. పురాణ కాలక్షేపాలలో పాల్గొనవలెను.


42. భగవానుని అనుగ్రహము కొరకు సదా ప్రార్థించవలెను.


43. భక్తి భావము కలిగియుండి భక్తి గ్రంథాలను చదువుచుండవలెను.


44. ఇష్టముతో దేవునికి సేవ చేయవలెను.


45. దేవుని కీర్తించునపుడు , నామములు ఉచ్ఛరించునపుడు తప్పులు రాకుండా జాగ్రత్త

పడవలెను.


46. స్వామికి సంబంధించిన వివిధ శ్లోకాల , నామముల యందు అర్థాలను తెలుసుకోవలెను.


47. తన కంటే పరిణితి పొందిన భక్తులతో సాంగత్యము చేయవలెను.


48. భక్తి లేనివాని సాంగత్యమును , పరుషముగా మాట్లాడువాని సాంగత్యమును , క్రోధము

కలిగిన వాని సాంగత్యమును పరిత్యజించవలెను.


49. కామ , క్రోధాదులను అదుపులోయుంచుకొనవలెను.


50. ఆలయాలలోను , పూజా మందిరాల వద్దను మంచి నడవడి కలిగి యుండవలెను.


51. ప్రశాంత జీవితమును గడుపవలెను.


52. అన్య దేవతలను దూషించకూడదు.


53. అనవసరంగా ఏ ప్రాణికిని కష్టం కలిగించకూడదు.


54. పూజా ప్రతిమలను చిత్ర పటములను (పూజా సమయంలోను , పూజ తరువాత) శుభ్రంగా

ఉంచుకొనవలెను.


55. పువ్వులు , పత్రి ఒడిలో వేసుకోని పూజించరాదు.


56. తడి వస్త్రములతో పూజకు ఉపక్రమించకూడదు.


57. పూజ చేస్తున్నప్పుడు కటిక నేలపై కూర్చుండరాదు.


58. భోజనానంతరం భోజనం చేసిన ప్రదేశమునందు చేతులు కడుగరాదు (చేతులు కడిగే

చోటికి వెళ్ళి చేతులు కడగాలి)


59. తాంబూలమును స్వీకరించవచ్చునే గాని , తాంబూలమును నమిలి మ్రింగరాదు.


60. శవమును చూడకూడదు అట్లు చూచినచో మరల తలస్నానం చేసి విభూతి , చందన ,

కుంకుమాదులు ధరించి దీపం వెలిగించి భగవంతునికి నమస్కరించవలెను.


61. అశౌచము కలిగిన (మైల కలిగిన) వారి ఇండ్లకు వెళ్ళకూడదు.


62. స్త్రీలను కనీసం తాకనైన తాకకూడదు. ప్రాణాపాయ స్థితిలో తప్ప


63. స్వామికి ఇష్టమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహించుట లేక ప్రత్యేకపూజలలో భక్తిగా

పాల్గొనుట చేయవలెను.

64. పుణ్యక్షేత్రములను దర్శించవలెను.


ఈ 64 భక్తి అంగములు సరియైన రీతిలో ఆచరిస్తే మనలోని వాచిక , కాయక , మానసిక కర్మలన్నీ  సంస్కరించబడి , దశేంద్రియ సిద్ధి కలిగి ( జ్ఞానేంద్రియ , కర్మేంద్రియాలను దశేంద్రియాలంటారు) మన హృదయంలో భగవంతుణ్ణి దర్శించగలుగుతాం. ఏకాగ్రతతో స్వామిని పూజించేటప్పుడు , భక్తిగా పాడేటప్పుడు భగవంతునిలో తాదాత్యం చెందే భాగ్యం కలుగుతుంది.

అప్పుడు వర్ణించలేనంత ఆనందం కలుగుతుంది. ఆ సమయంలో ఆనందంతో మన కళ్ళవెంట  ఆనంద భాష్పాలు వస్తాయి.  రోమాంచం కలుగుతుంది. కొద్దిక్షణాలు మనకళ్ళకు దివ్యకాంతి  గోచరిస్తుంది. గగుర్పాటు కలుగుతుంది. మన హృదయంలో ఏదో చెప్పలేని దివ్యమైన భక్తి  అనుభూతి కలుగుతుంది. మనం అర్చించే చిత్రపటంలోని అయ్యప్పస్వామివారి నేత్రాలలో జ్యోతి  కనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప అనుభవంగాని , అనుభూతిగాని జీవితంలో మరొకటి ఉంటుందా !  ఇంతకంటే భాగ్యం , ఐశ్వర్యం మరొకటి ఉంటుందా ? ఇట్టి అనుభూతిని 41 రోజుల దీక్షాకాలంలో ఒక్కరోజైనా పొందగలగడమే అదృష్టం. అట్టి అనుభూతి కలగాలని ప్రయత్నించ కూడదు.  ఏదో  విశేషభక్తి కలిగియుంటే భగవానుడే అట్టి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు. అంతటి భాగ్యాన్ని  భక్తులందరూ పొందాలి. అందుకే త్యాగరాజ స్వామివారు “నిధి చాలా సుఖమా రాముని సన్నిధి   చాలా సుఖమా" అని గానం చేస్తూ రాముని సన్నిధే అసలైన పెన్నిధి అనే సందేశాన్ని మనకు అందజేసారు. గురువుల అనుగ్రహంతో మనమూ ఆ పెన్నిధిని పొందుదాం.


Friday, February 19, 2021

సూర్య మండల స్త్రోత్రం

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే

 సహస్రశాఖాన్విత సంభవాత్మనే |

 సహస్రయోగోద్భవ భావభాగినే

 సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||


 యన్మండలం దీప్తికరం విశాలం |

 రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

 దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||


 యన్మండలం దేవగణైః సుపూజితం |

 విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |

 తం దేవదేవం ప్రణమామి సూర్యం |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||


 యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |

 త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

 సమస్త తేజోమయ దివ్యరూపం |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||


 యన్మండలం గూఢమతి ప్రబోధం |

 ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

 యత్సర్వ పాపక్షయకారణం చ |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||


 యన్మండలం వ్యాధివినాశదక్షం |

 యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

 ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |

 పునాతు …


శ్రీమహాలక్ష్మి_కవచం

అస్య శ్రీమహాలక్ష్మీకవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః

మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః |


ఇన్ద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం |

ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే || 1 ||


మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |

చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం || 2 ||


శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |

చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరామ్బుజా || 3 ||


ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |

ముఖం పాతు మహాలక్ష్మీః కణ్ఠం వైకుంఠ వాసినీ || 4 ||


స్కందౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |

బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాఙ్గనా || 5 ||


వక్షః పాతు చ శ్రీదేవీ హృదయం హరిసున్దరీ |

కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా || 6 ||


కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |

ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ || 7 ||


ఇన్దిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |

నఖాన్ తేజస్వినీ పాతు సర్వాఙ్గం కరూణామయీ || 8 ||


బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |

యే పఠన్తి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే || 9 ||


కవచేనావృతాఙ్గనాం జనానాం జయదా సదా |

మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ || 10 ||


భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం |

లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ || 11 ||


నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం |

యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్కామానవాప్నుయాత్

  || 12 ||


ఇతి శ్రీ మహాలక్ష్మీ కవచం సంపూర్ణం

మంచి మాటలు

ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !


ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు 


దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._ 


సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు.


కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో ..


జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు.


కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి.


పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !


సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి.


నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !


మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !


 నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో.


వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?


నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !


పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !


ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు.


వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._


నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !


అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_


మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._ 

Thursday, February 18, 2021

మహాతేజం రథసప్తమి : అంటే ఏమిటి , ఎందుకు ?

రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండుగ

మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖంలో అర్యముడు

3. జ్యేష్ఠంలో మిత్రుడు ,

4. ఆషాఢంలో వరుణుడు

5. శ్రావణంలో ఇంద్రుడు

6. భాద్రపదంలో వివస్వంతుడు

7. ఆశ్వయుజంలో త్వష్ట

8. కార్తీకంలో విష్ణువు

9. మార్గశీర్షంలో అంశుమంతుడు

10. పుష్యంలో భగుడు

11. మాఘంలో పూషుడు

12. ఫాల్గుణంలో పర్జన్యుడు

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం

బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరభాను' అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే 'యుగం...12000 ఏళ్లు , సహస్రం 1000 , యోజనం 8 మైళ్లు , మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు

1. గాయత్రి

2. త్రిష్టుప్పు

3. అనుష్టుప్పు

4. జగతి

5. పంక్తి

6. బృహతి

7. ఉష్ణిక్కు

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామ , రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక , మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు , రాత్రికి ప్రతీక అని , చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు , ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది

 అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు , ఐశ్వర్యం , ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి , రోగము , శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు , రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక , ఏడు జన్మల్లో చేసిన పాపములను , ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః !

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే !!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు !

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ !!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ !

మనో వాక్కాయజం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే !

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ !!

పూజా విధానం:-

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి , ఒక్కొక్క దళం చొప్పున రవి , భాను , వివస్వత , భాస్కర , సవిత , అర్క , సహస్రకిరణ , సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం , ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది

ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు , జిల్లేడు , రేగు  పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది

జిల్లేడు , రేగు , దూర్వాలు , అక్షతలు , చందనాలు కలిపిన నీటితోగాని , పాలతో గాని , రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది

మనం చేసే పూజలు , వ్రతాలు అన్నీ పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే !

ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్  ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని , ఐశ్వర్యాన్ని పొందుదాం

చదుకొవలిసిన స్తోత్రాలు

ఆదిత్యహృదయం , సూర్య స్తోత్రం , నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదాయకమని గురు వాక్యం.

మాఘ శుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది లేదా చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘ శుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి

సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యునికి నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు , ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం.

1. ఈ జన్మలో చేసిన

2. గత జన్మలో చేసిన

3. మనస్సుతో

4. మాటతో

5. శరీరంతో

6. తెలిసీ

7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రథం ఆకారం లో ఉంటుంది.

రోగ నివారణ / సంతాన ప్రాప్తి కోసం - రథ సప్తమి వ్రత విధానం

స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదళ పద్మం ముగ్గు (బియ్యం పిండి తో) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి . అష్ట దళ పద్మ మధ్య లో శివ పార్వతులను పెట్టి, పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు

చేయించి కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమపై ఉంచి సూర్యుడికి పూజ చేయాలి.

*సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు , గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా , నిష్ఠగా ఉండాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శక్తి , ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందిl

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...