Thursday, September 21, 2023

వినాయకుడూ - విష్ణువూ ఒకరేనా!

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ I 

ప్రసన్నవదనం ధ్యాయేత్ 

సర్వవిఘ్నోపశాంతయే ॥

ఇది అందఱమూ అన్ని సందర్భాలలోనూ ప్రార్థనా శ్లోకంగా చదువుతాం.

ఈ శ్లోకం 


1. వినాయకునికి సంబంధించి,

* శుక్ల + అంబరధరమ్ = తెల్లని వస్త్రాలని ధరించినవాడు, 

* శశివర్ణం = చంద్రునిలా తెల్లనైన శరీరం కలవాడు, 

* చతుర్భుజమ్ = నాలుగు చేతులతో ఉండేవాడు, 

* ప్రసన్న వదనమ్ = అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలవాడు, 

* విష్ణుమ్ = సర్వవ్యాపి అయినవాడు, 

* సర్వ విఘ్న + ఉపశాంతయే = అన్ని విఘ్నాలనుంచీ బయటపడేసి, శాంతి పొందించేవాడు,

అయిన "వినాయకు"ని 

* ధ్యాయేత్ = ధ్యానిస్తున్నాను. 

      అని అర్థం.


 2. విష్ణువుకి  సంబంధింది కాదుకదా! 

 ఈ శ్లోకంలో "చతుర్భుజమ్", "విష్ణుమ్" అనే మాటతో ఇది విష్ణువుకి సంబంధించింది అంటారు. కానీ,

* తెల్లవస్త్రాలు ధరించి అని ఉంటే, మరి విష్ణువు పసుపుబట్టలు ధరించే "పీతాంబర ధారి" కదా!

* చంద్రునిలా తెల్లని రంగుగలవాడు అని ఉంటే, మరి విష్ణువు "నీలమేఘశ్యాముడు" కదా!

* విఘ్నాలు తొలగించేవాడు అని ఉంటే, మరి "సృష్టి స్థితి లయా"లలో స్థితికి సంబంధించి , విష్ణువు "పుట్టిన వాడిని పోషించడం వరకే బాధ్యతగా కలవాడు" కదా! , ---------- ఇలా అంటూ,

ఈ శ్లోకం విష్ణువుకు వర్తించదు అంటారు.

మరి విష్ణువుకు ఎలా అన్వయిస్తాము?


2. విష్ణువునకు సంబంధించి అన్వయం 

* శుక్ల + అంబరధరమ్ 

- తెల్లనైన ఆకాశాన్ని(అంబర) ధరించేవాడు.

 ( విష్ణువునకు,

నాభిర్వియత్ - ఆకాశం బొడ్డు

 ఆ బొడ్డులోనుంచీ సృష్టికర్త "బ్రహ్మ" వచ్చాడు. 


ఆకాశాద్వాయుః - వాయోరగ్నిః - అగ్నేరాపః - అబ్భ్యః పృథివీ - పృథివ్యా ఓషధయః - ఓషధీభ్యోన్నమ్ - అన్నాత్పురుషః - స ఏవా పురుషో అన్నరసమయః -

ఆ ఆకాశం నుండీ వాయువూ - వాయువు నుండీ అగ్నీ - అగ్ని నుండీ నీరూ - నీటి నుండీ భూమీ - భూమి నుండీ ఓషధులూ - ఓషధుల నుండీ అన్నమూ - అన్నము నుండీ ప్రాణులూ కలుగుతాయి)

* విష్ణుమ్ 

    — అంతటా వ్యాపించినవాడు

 (విశ్వం వ్యాప్నోతీతి విష్ణుః )

* శశివర్ణమ్ 

  "శశము" అంటే కుందేలు.

కుందేలు ఒక అడుగువేసి, మళ్ళీ గంతువేసి, మళ్ళీ దూకుతూ నడుస్తుంది.

 అలాగే 'కాలం' కూడా రోజు - పక్షం - నెల - సంవత్సరం అని కొలవబడుతూ, సంవత్సరాన్ని ప్రమాణంగా కొలవబడుతూంటుంది.

విష్ణువు 'కాలాన్ని' అధీనంలో ఉంచుకున్నవాడూ, 'కాల స్వరూపుడు'గా "శశివర్ణమ్"

* చతుర్భుజమ్ 

    నాలుగు చేతులలో 

శంఖ - చక్ర - గద - పద్మాలు కలవాడు.

గద - అహంకారాన్ని అణుస్తుంది.

పద్మం - చిత్తాన్ని వికసింపచేస్తూ, విశ్లేషింపజేస్తుంది.

చక్రం - సంశయాత్మకమైన మనస్సులో సంశయనివృత్తి చేస్తుంది.

శంఖం - నిర్ణయాత్మకమైన బుద్ధిని ప్రామాణికమైన జ్ఞానంతో సరియైన నిర్ణయాన్నిస్తుంది.

 

శంఖ - చక్ర - గద - పద్మాలు నాలుగు చేతులలో  మారుతూ 24 రకాలుగా( Factorial 4 = 4x3x2x1 = 24) కనబడే మూర్తులే

కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ -అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరయ  - శ్రీకృష్ణ.

   "మనో బుద్ధి చిత్త అహంకారాల"నే నాలుగు భాగాలుగా ఉండే "అంతఃకరణ" శుద్ధి అనుగ్రహించే స్వామి "విష్ణువు". 


* ప్రసన్న వదనం

భృగు మహర్షి వచ్చి కాలుతో తన్నినా వదనంలో మార్పులేదు.

 (చేయవలసిన పనిని హావభావాలు కనబడనీయక నిశ్శబ్దంగా చేస్తాడు)

* సర్వవిఘ్నాలు పారద్రోలి శాంతి కల్గించే "స్థితి కారకుడై"న "విష్ణుమూర్తి"ని 

* ధ్యాయేత్ 

- ధ్యానిస్తాను. 


పార్వతీపరమేశ్వరులకు దేవతలు విఘ్నం కల్గించడంవల్ల సంతానం కలుగలేదు. 

 ఆదిదంపతుల ప్రార్థనతో విష్ణువే పుత్రుడుగా జన్మిస్తాడు.    

శని దృష్టివలన ఆతని శిరస్సు ఖండింపబడితే, గజశిరస్సు అమర్చారు. గజాననుడు సాక్షాత్తూ విష్ణువు  అవతారమే 

 - బ్రహ్మ వైవర్త పురాణం 


వినాయకుడూ విష్ణువూ ఒకరే కాబట్టి స్వామిని  "లక్ష్మీ గణపతి"  విగ్రహ రూపంలో ఆరాధిస్తాం.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...