Friday, April 24, 2020

పరమ శివుని శత నామాలు - నిత్యమూ స్మరించవలసినవి

1 స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,
2 స్థాణుః = ప్రళయకాలమునందును ఉండువాడు,
3 ప్రభుః = సమస్తమునకు అధిపతి,
4 భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,
5 ప్రవరః = సర్వశ్రేష్టుడు,
6 వరదః = వరములనిచ్చువాడు,
7 సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,
8 సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,
9 సర్వః = సమస్తము తానేఅయినవాడు,
10 సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,
11 భవః = శివుని రూపంలో పుట్టినవాడు,
12 జటీ = జడలు ధరించినవాడు,
13 చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,
14 శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,
15 సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,
16 సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.
17 హరః = సమస్త పాపములను హరించువాడు,
18 హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,
19 సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,
20 ప్రభుః = అధిపతి,
21 ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,
22 నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,
23 నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,
24 శాశ్వతః = నిత్యమైనవాడు
25 ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.
26 శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,
27 భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,
28 ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,
29 అగోచరః = కంటికి కనిపించనివాడు,
30 అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,
31 అభివాద్యః = నమస్కరింప తగినవాడు,
32 మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,
33 తపస్వీ = తపస్సుచేయువాడు,
34 భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.
35 ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః= పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,
36 సర్వలోక ప్రజాపతిః= సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,
37 మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,
38 మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,
39 వృష రూపః = పుణ్య స్వరూపుడు,
40 మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.
41 మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,
42 సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,
43 శ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,
44 మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,
45 లోకపాలః = లోకములను పరిపాలించువాడు,
46 అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
47 ప్రసాదః = అనుగ్రహించువాడు,
48 నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.
49 పవిత్రం = పరిశుద్ధమైన,
50 మహాన్ = గొప్పవాడు,
51 నియమః = నియమం తన స్వరూపమైనవాడు,
52 నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,
53 సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,
54 స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,
55 ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,
56 నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.
57 సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,
58 విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,
59 సోమః = చంద్రుని వంటివాడు,
60 నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,
61 చంద్రః = చంద్రుని వంటివాడు,
62 సూర్యః = సుర్యుని వంటివాడు,
63 శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,
64 కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,
65 గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,
66 వరః = శ్రేష్టుడు.
67 ఆది = మొదలు,
68 అంతః = చివర,
69 లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,
70 మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,
71 అనఘః = పాపరహితుడు,
72 మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,
73 ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,
74 అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,
75 దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.
76 సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,
77 మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,
78 ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,
79 పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,
80 యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,
81 యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,
82 మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,
83 మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,
84 మహాబలః = గొప్పశక్తి కలవాడు.
85 సువర్ణరేతాః = అగ్నిరూపమై యున్నవాడు,
86 సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,
87 సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,
88 బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,
89 దశబాహుః = పది భుజాలు కలవాడు,
90 అనిమిషః = రెప్పపాటు లేనివాడు,
91 నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,
92 ఉమాపతిః = పార్వతి భర్త
93 విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు
94 స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు
95 బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు
96 బలః = బలము కలవాడు
97 గణః = సమూహ స్వరూపమైనవాడు
98 గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు
99 గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు
100 దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు

From ప్రసాద్ భరద్వాజ garu

Tuesday, April 21, 2020

శ్రీ చక్రం

ఈ నాడు శ్రీ చక్రాన్ని మనందరం పూజిస్తాం. ఇంట్లో, దేవుని గుడిలో పెట్టి ఆరాధిస్తాం ఎందుకు. శ్రీ చక్రానికి అధి దేవత శ్రీమాత. ఆది పరాశక్తి. అంటే శక్తిని ఆరాధిస్తున్నాం. అంతేనా ఇంకేమైనా రహస్య సంకేతాలు దీనిలో ఉన్నాయా అనేది ఆలోచించం.

మన ఋషులు మనకు అన్ని విషయాలనూ సంకేత రూపంలో అందించారు. ఈ ఆరాధనలో రెండు మార్గాలను ఇమిడ్చారు. ఒకటి ఆధ్యాత్మిక సాధన రెండు బౌతిక సాధన. రేండూ మానవ మనుగడకు అవసరమే. బౌతిక సాధన లేని ఆద్యాత్మికం వ్యర్థమే, ఆధ్యాత్మిక సాధనలేని భౌతికము వ్యర్థమే. మానవుడు చతుర్విద ఫలపురుషార్థాలను సాధించాలని మన శాస్త్రాలు బోధిస్తాయి. ధర్మం, మోక్షం ఆధ్యాత్మికమైతే. అర్థం, కామం భౌతికం. ఈ రెండింటినీ సమానంగా తీసుకు వెళ్ళగలిగారు కనుకనే మన వారు మహర్షులయ్యారు.

మీరి శ్రీచక్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే శ్రీచక్ర నిర్మాణం నేటి గేర్ సిస్టంను పోలి ఉంటుంది. భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో ఒక విమాన చిత్రం ఇవ్వబడింది. అది కూడా శ్రీ చక్రాన్ని పోలి ఉంటుంది. నేడు మన వెహికల్స్ అన్నీ శక్తి ఉత్పత్తి జరిగాక ఆ శక్తిని గేర్లకు అనుసంధానం చేసి వాహనం లేదా యంత్రం తిరేగేటట్లు చేస్తున్నారు. అవే గేర్లు శక్తి ఉత్పాదన చేస్తాయి.

శ్రీ చక్రం ఒక శక్తి ఉత్పత్తి సాధనంగా భావించండి. అప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. భరద్వాజు మహర్షి వైమానిక శాస్త్రంలో పాదరసాన్ని సూర్యశక్తితో అనుసంధానించి శక్తి ఉత్పత్తి చేసినట్లు వ్రాశారు. శివకర్ బాపూజీ తల్పడే గారు కూడా పాదరసం(మేర్క్యురీ) సూర్యశక్తి(సోలార్ ఎనర్జీ) తో విమానాన్ని తయారు చేసినట్లుగా చెప్పబడింది.

ఆలయ గోపురాలు కూడా శ్రీ చక్ర రూపాన్ని పోలే ఉంటాయి. ఆలయ గోపురాన్ని విమాన గోపురం అని అంటాం. అంటే శ్రీచక్రానికి గేర్ సిస్టంకు, ఆలయ గోపురాలకు, విమానాలకు సంబంధించి ఏదో రహస్య శక్తి ఉత్పాదక విధానం ఉంది అనేది చూచాయగా అర్థం అవుతుంది కదా. మన శాస్త్రాలను ఆధ్యాత్మిక విధానం లోనే కాకుండా బౌతిక విధానంలో కూడా అద్యయనం చేయవలసిన అవసరం చాలా ఉంది.

దీనికి నేటి యువతే నడుంకట్టాలి. పండితుల నేతృత్వంలో యువత ఈలాంటి పరిశోధనలు చేపడితే అధ్బుతాలు సృష్టించడానికి ఎంతో సమయం పట్టదు...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ ఎప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Sunday, April 19, 2020

విష్ణు సహస్ర నామ మహిమ


పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాసముండెడివాడు . ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది , ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను  విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు .  అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చేడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది . అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది . అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది . అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది .అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని  అనుభవిస్తూ  , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువు ని గానంచేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధంలేదయ్యా ! " అంది . భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేది ట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయేడుట .

ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంతమాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట . లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట . లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడ" ని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితి ని వివరించగా లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితి  కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమనుభవించుట తప్పలేదు . అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదన" ని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు . ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినద"ని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మాఇంటికి వచ్చేరో , వెళ్లిపొ "మ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్త కు నేను తరువాత వివరిస్తాన" ని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసేరమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు . ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలినుండి వచ్చి " లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు , "అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? "అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా  " నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారుట , ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ"న్నది . అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువు ను స్తుతిస్తున్నా ఆ స్వామి ని నేను దర్శించలేకపోయాను ,  ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శనభాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో  మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన  నల్లరంగు ను తొలగించాడు . తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ " నగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానంచేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది .
విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి .

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి

ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః ||

న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః ||

మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః||

నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః ||

రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః ||

య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః ||

ణా ణాకా లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః ||

య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః ||

Tuesday, April 14, 2020

నవ గ్రహముల జననము

1) సూర్యుడు: శ్రీ కశ్యప  బుషికి దక్షుని పుత్రికయగు అదితికిని "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని
అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెనుసూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెనుయముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు

2) చంద్రుడు: అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు

3) కుజుడు: శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను

4) బుధుడు: సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను

5) బృహస్పతి: సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)ఇతని భార్య "తారాదేవి"
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
"గురుడు" అనెదరు

6) శుక్రుడు: భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
"ఉశనుడు" జన్మించెను(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను
పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను

7) శని: సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను

8) రాహువు: కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది

9) కేతువు: విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి
ఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...

నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు. ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును.
(అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను).

Tuesday, April 7, 2020

అగ్నులు

పంచాగ్నులు : 

1. ఆకాశాగ్ని సోమ రూపము
2. పర్జన్యాగ్ని వృష్టి రూపము
3. పృథివ్యగ్ని వ్రీహ్య రూపము
4. పురుషాగ్ని రేతో రూపము
5. యోషిదగ్ని పురుష రూపము
         జీవుడు తన శరీర పతనము తరువాత సోమ రూపుడై, వృష్టి రూపుడై, వ్రీహ్య (ధాన్య) రూపుడై, రేతో రూపుడై స్త్రీ యోనిలో చేరి, స్త్రీ గర్భమందు పురుషుడుగా మారుచున్నాడు. పంచాగ్నులలో క్రమముగా పరివర్తన చెందుచు పురుషుడగుచున్నాడు.
              యోగులలో భ్రూమధ్యమందు జ్ఞానాగ్నిగా, పాదకములందు కాలాగ్నిగా, నాభిస్థానమందు క్షుదాగ్నిగా, హృదయమందు శీతాగ్నిగా, నేత్రములందు కోపాగ్నిగా ఉండును. ఈ పంచాగ్నులను జ్వలింప జేసుకొనుచూ పరివర్తన చెందుటకు సాధన చేసే యోగి ముక్తుడగును.

త్రేతాగ్నులు :

1. గార్హ పత్యాగ్ని లేదా జఠరాగ్ని : గృహమనగా శరీరము. శరీరానికి పతిగార్హపతి అనగా జీవుడు. జఠరాగ్ని వలన కలిగే ఆకలి బాధ తీర్చుకొను చున్నప్పుడే శరీరము బలముగా, ఆరోగ్యముగా నుండును. జీవుడు తన శరీర పోషణార్థము మాత్రమే ఈ గార్హపత్యాగ్ని ఉన్నదని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.

2. ఆహవనీయాగ్ని : ఆహవనము అనగా అన్ని వైపులా ఉండే వాటిని తనవైపుకు తెచ్చుకొనుట, మరియు వాటిని తన లోపలకు తీసుకొనుట. విషయములను అన్ని వైపులనుండి తెచ్చుకొనుచు, తన మనస్సులోనికి చేర్చుకొనుట. మనస్సే ఆహవనీయాగ్ని. ఈ మనస్సు యొక్క స్వభావమును తెలుసుకొని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.

3. దక్షిణాగ్ని : హృదయములో ఉండే తేజస్సు, దానివలన కలిగే జ్ఞానమును దక్షిణాగ్ని అందురు. దక్షిణాగ్నియే జ్ఞానాగ్ని. హృదయములో కలిగే జ్ఞానానికి కూడా అతీతమైన పరబ్రహ్మగా సిద్ధిని పొందవలెను.

శ్లో||  విద్యాంచా- విద్యాంచ యస్త ద్వేదో-భయం సహ |
       అవిద్యయా మృత్యుం తీర్థ్వా విద్యయా-మృతమస్నుతే ||

తా|| విద్యను, అవిద్యను రెంటిని తెలుసుకొనవలెను. అవిద్యను తెలిసి విడచుట చేత మృత్యువును అధిగమించును. విద్యను తెలియుటచేత అమృతత్వమును సిద్ధింపజేసుకొనును.

విద్యలు -

విద్య నాలుగు విధములు :

1. సాంకేతికము :
మానవుని జీవితావసరములను తీర్చుచు, తద్ద్వారా సమాజాభివృద్ధికి అవసరమైన వృత్తులకు సంబంధించిన విద్య.

2. శారీరకము :
శరీర ఆరోగ్యమునకు అవసరమైన వ్యాయామము, ఆహార నియమము, యోగాభ్యాసములకు సంబంధించిన విద్య.

3. నైతికము :
సమాజము భౌతికముగా ఎంత పురోగమించినను, సంఘములోని వ్యక్తులు శీలవంతులై యుండుట, పురాణేతిహాసములలోని మహానుభావుల జీవితములను ఆదర్శముగా చూపుచు బోధించు విద్య.

4. ఆధ్యాత్మిక విద్య :
అధి అనగా అత్యధికమైన సత్యము. ఆత్మ అనగా నేనుగా ప్రాకటమైనది. విద్య అనగా తెలుసుకొనవలసినది. ఈ మూడు అర్థములు కలిసినది తనను తాను సత్యస్వరూపమనే బ్రహ్మగా తెలుసు కొనుటకు అవసరమైన బోధ. దివ్యత్వమును గుర్తింపజేసి, పూర్ణానుభవమును అందించునది. అన్ని విద్యలలోకెల్లా గొప్పది. అన్ని విద్యలకు పునాది వంటిది. వివేకము, అర్పణ, కర్తవ్యములను మేళవించి, శిక్షణతో కూడిన విద్య ఆధ్యాత్మిక విద్య.

విద్య కొఱకు త్రివిధ విచారణ :
1. పరబ్రహ్మ స్వరూప నిశ్చయము. 2. మాయా స్వరూప నిశ్చయము 3. ధర్మస్వరూప నిశ్చయము.

అన్వీక్షకీ విద్య :
తర్క వేదాంతమునకు సంబంధించిన విద్య.

విద్యకు శత్రువులు :
పెద్దల సేవ చేయకుండుట, తొందరపాటు, రజో గుణము, ఆత్మ స్తుతి, పరనింద - ఇవన్నీ విద్యార్జనకు ప్రతిబంధకములు, శత్రువులు.

వార్త : అర్థ, అనర్థములను బోధించు విద్యను వార్త అందురు. వార్త అనగా శ్రమ, వ్యవసాయము, ఉపాయములను అవలంబించి, సత్ఫలితమును సాధించుటను తెలియజేయు విద్య.

భగవద్గీతలోని విద్యలు :
1. అభయ విద్య 2. సామ్య విద్య 3. బ్రహ్మ విద్య 4. భగవత్‌ విద్య.

విద్య (జ్ఞానము) : జీవుడే ఈశ్వరుడు, జీవుడే పరమాత్మ అనెడి అఖండ, అభిన్న, అద్వితీయ తత్త్వమును బోధించు శబ్దములు, వాక్యములు, వాక్యార్థములు.

వైశ్వానర విద్య : ఛాయా పురుష లక్షణము గురించిన విద్య.

వారుణీ విద్య : వరుణుడు భృగువునకు బోధించిన విద్య

భార్గవీ విద్య : భృగువు వరుణుడి ద్వారా సంపాదించిన విద్య

హార్ద విద్య : ఆత్మ గురించి హృదయ సమీపమునకు చేర్చబడిన విద్య

బ్రహ్మ విద్య : 1. బ్రహ్మ పరమాత్మ నుండి సంపాదించిన విద్య 2. బ్రహ్మ నుండి అధ్వరుడికి, అతడి నుండి సర్వులకు చేరిన విద్య 3. బ్రహ్మము గురించిన విద్య 4. శ్రేష్ఠమైనది, గొప్ప దానికంటే గొప్పదైన విద్య - అని నాలుగు అర్థములు.

ముక్తి విద్య : పై నాలుగు అర్థములతో ఉన్న బ్రహ్మ విద్య పరంపరగా వచ్చి జీవులకు బంధ విముక్తి కలిగించే విద్య.

నయ విద్య : శాస్త్రము ధర్మము చెప్పువారు 'ఇది ఇంతే' అని ప్రమాణమువలె చెప్పరాదు. ఎంత తెలిసినవాడైనా 'ఇప్పటికి నాకు తెలిసినది ఇంత మాత్రమే' అని చెప్పవలెను. కొన్ని విషయములను ప్రమాణము అని చెప్పినచో అపార్థము, అపకారము జరుగవచ్చును. వినయము, విశిష్ఠత, నేర్పుతో చెప్పగలవానిని నయవిద్య తెలిసినవాడని అందురు.

త్రయీ విద్య : వాయుమధనములో ఊర్థ్వ గతిని ప్రాణగతి అనియు, అధోగతిని అపానగతి అనియు, సమానత్వమును మధ్యగతి అనియు మూడు గతులుగా విభజించి వాయుమధనమును చేయు నేర్పును త్రయీ విద్య అందురు.
         ఈ వాయు మధనమునుండి ఉద్భవించు దానిని అశనము అందురు. అశనమనగా అన్నము. ఈ సాధనతో అశనమును గ్రహించిన ప్రాణుడు బలపడుచున్నాడు. ఇది యోగము.
              త్రయీవిద్య అనగా ధర్మ, అర్థ, కామములనెడి మూడింటిని తెలుసుకొని అర్థ కామములను ధర్మయుతముగా పొందే వివేకము.

పంచాగ్ని విద్య : ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటియందు శ్రద్ధా, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అనే పంచ ద్రవ్యములను, లేక పంచ ఆహుతులను హోమము చేయగా రేతో రూప ఆహుతియందు ఉదకములు పురుష రూపము చెందుచున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములతో చేరి క్రమముగా ఆకాశమున శ్రద్ధా రూపములో చేరి, వర్ష రూపములో భూమిపైబడి, అన్న రూపములో పురుషునిలోనికి చేరి, రేతస్సు రూపములో స్త్రీ గర్భమందు ప్రవేశించి, అక్కడనుండి పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవరూపముగా ఉండుటలో గల ధర్మము.

దహర విద్య : బ్రహ్మ రంధ్రమందు చిన్న కమలము, ఆ కమల మధ్యమున సూక్ష్మమైన శూన్య స్థానము, ఆ శూన్యమే దహరాకాశమనబడును. దీనిని తెలుసుకొన్నవాడు బ్రహ్మను తెలుసుకొనును. ఈ తెలుసుకొనే విద్యను దహర విద్య, లేక ప్రాణ విద్య అందురు.

సంవర్గ విద్య - వాయు సంవర్గ విద్య : వాయువు అనగా హిరణ్య గర్భుడు. ఇతడిలోనే ప్రపంచమంతయు పుట్టి, స్థితిని కలిగి, లయించుచున్నది. సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడిలో చేరి యుండుట అని అర్థము. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రలయకాలములో ఈ వాయువును చేరి అవ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తానుకూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. వాయువులో చేరి యుండుట వలన వాయువే సంవర్గుడు. కేవలము సంవర్గ విద్య అన్నను అదే.

మధు విద్య : సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామరూప క్రియా నటనలను వదలి, అందలి సారమైనట్టి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధువిద్య. ఆ సారమే దైవత్వము, లేక మధువు లేక అమృతము. మధు విద్యోపాసకులకు బ్రహ్మానందము సిద్ధించును.

అపరవిద్య: గడ్డిపరక మొదలు సృష్టి కర్త వరకు గల ప్రకృతి గుణములను, ధర్మములను వివేకముతో సరిగా గ్రహించి, కార్యసిద్ధి బడయుట, ధర్మాధర్మములను తెలుసుకొనుట - ఈ రెండింటికి సంబంధించిన విద్యను అపరవిద్య అందురు.

పరవిద్య : ఉపాసన, తపస్సు, ఇంద్రియ మనో నిగ్రహము, యోగాభ్యాసము, మొదలగు సాధనలకు సంబంధించి మోక్ష లక్ష్యముగా తెలుపు విద్యను పరవిద్య అందురు.

బ్రహ్మ విద్యలు 32 : శ్రీ రామానుజాచార్యుల వారు తెలిపిన బ్రహ్మ విద్యలు 32 రకములు. 1. సద్విద్య 2. శాండిల్య విద్య 3. అంతరాదిత్య విద్య 4. ఆనంద విద్య 5. ప్రాణి విద్య 6. ఇంద్ర ప్రాణ విద్య 7. భూమ విద్య 8. నచికేత విద్య 9. గాయత్రీ జ్యోతిర్విద్య 10. ఆకాశ విద్య 11. అంతర్యామి విద్య 12. దహర విద్య 13. ఉపకోసల విద్య 14. వైశ్వానర విద్య 15. అక్షర విద్య 16. అంగుష్ఠ ప్రమితి విద్య 17. అజా శారీరక విద్య 18. చాలకీ విద్య 19. మైత్రేయీ విద్య 20. మధువిద్య 21. ప్రణవోపాస్య పరమ పురుష విద్య 22.ఆదిత్య స్థామర్మామక విద్య 23. అక్షస్థ ఆహావన్నామ విద్య 24. ఉషక్తి కహోల విద్య 25. గార్లక్ష విద్య 26. వ్యాహృతి శారీరక విద్య 27. పంచాగ్ని విద్య 28. పురుష విద్య 29. సంవర్గ విద్య 30. దేహోపాస్య జ్యోతిర్విద్య 31. ఈశావాస్య విద్య 32. బ్రహ్మ విద్య.

దండనీతి అనే విద్య : మంచి - చెడు, న్యాయము-అన్యాయము, ధర్మము- అధర్మము వీటి గురించియు, మంచి మొదలగు వారికి రక్షణయు, పురస్కారములను మరియు చెడు మొదలగు వాటిని నివారించుటకును, శిక్షించుటకును అవసరమైన నీతిని బోధించే విద్యను దండనీతి అనే విద్య అందురు.

ప్రతిస్మృతి విద్య : ఈ విద్య వలన అధిక తపోవీర్య సంపన్నుడగును. తక్కువ కాలములోనే ఎక్కువ ఫలితమును సాధించును.

Friday, April 3, 2020

శ్రీరాముని వంశవృక్షo




ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం.
బ్రహ్మ కొడుకు మరీచి
మరీచి కొడుకు కాశ్యపుడు.
కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
సూర్యుడు కొడుకు మనువు.
మనువు కొడుకు ఇక్ష్వాకువు.
ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
కుక్షి కొడుకు వికుక్షి.
వికుక్షి కొడుకు బాణుడు.
బాణుడు కొడుకు అనరణ్యుడు.
అనరణ్యుడు కొడుకు పృధువు.
పృధువు కొడుకు త్రిశంఖుడు.
త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)
దుంధుమారుడు కొడుకు మాంధాత.
మాంధాత కొడుకు సుసంధి.
సుసంధి కొడుకు ధృవసంధి.
ధృవసంధి కొడుకు భరతుడు.
భరతుడు కొడుకు అశితుడు.
అశితుడు కొడుకు సగరుడు.
సగరుడు కొడుకు అసమంజసుడు.
అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
అంశుమంతుడు కొడుకు దిలీపుడు.
దిలీపుడు కొడుకు భగీరధుడు.
భగీరధుడు కొడుకు కకుత్సుడు.
కకుత్సుడు కొడుకు రఘువు.
రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
మరువు కొడుకు ప్రశిష్యకుడు.
ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
అంబరీశుడు కొడుకు నహుషుడు.
నహుషుడు కొడుకు యయాతి.
యయాతి కొడుకు నాభాగుడు.
నాభాగుడు కొడుకు అజుడు.
అజుడు కొడుకు ధశరథుడు.
ధశరథుడు కొడుకు రాముడు.
రాముడి కొడుకులు లవ కుశలు . .
ఇది శ్రీ రాముని వంశ వృక్షo.

Wednesday, April 1, 2020

ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము.....

దేహాన్ని క్షేత్రమని, దీనిని తెలుసు కొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు. నేనే క్షేత్రజ్ఞున్ని. క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం. వీటి గురించి క్లుప్తంగా...

ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు. బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి..
పంచభూతాలు,
అహంకారం,
బుద్ధి,
ప్రకృతి,
కర్మేంద్రియాలు,
జ్ఞానేంద్రియాలు,
మనసు,

ఇంద్రియ విషయాలైన..
శబ్ద,
స్పర్శ,
రూప,
రుచి,
వాసనలు,
ఇష్టద్వేషాలు,
తెలివి,
ధైర్యం. ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు.

అభిమానము, డంబము లేకపోవడం, అహింస, ఓర్పు, కపటం లేకపోవడం, గురుసేవ, శుచిత్వం, నిశ్చలత, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం, నిరహంకారం, ఈ సంసార సుఖ దుఃఖాలను నిమిత్తమాత్రుడిగా గుర్తించడం, భార్యాబిడ్డలందు, ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం, శుభాశుభాల యందు సమత్వం, అనన్య భక్తి నాయందు కల్గిఉండడం, ఏకాంత వాసం, నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞానం అని చెప్పబడతోంది. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం.

సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మం ను తెలుసుకొంటే మోక్షం వస్తుంది. ఈ విశ్వమంతా అదే వ్యాపించి ఉంది. ఈ పరబ్రహ్మతత్వం అన్నిటియందు కలిసి ఉన్నట్లు కనిపించినా దేనితోనూ కలవదు. కాని అన్నిటినీ భరిస్తూ పోషిస్తోంది. నిర్గుణమై ఉండీ గుణాలను అనుభవించేదీ అని తెలుసుకోవాలి.

అది సర్వభూతాలకూ లోపలా, బయట కూడా ఉంది. అది సూక్షం. తెలుసుకోవడం అసాధ్యం. గుర్తించిన వారికి సమీపంలోనూ, మిగతా వారికి దూరంలో ఉంటుంది. ఆ పరమాత్మ అఖండమై ఉన్నప్పటికీ అన్ని జీవులలోనూ విభజింపబడి ఉన్నట్లు కనపడుతుంది. సృష్టిస్థితిలయకారకం అదే.
అది సూర్యుడు, అగ్నులకు తేజస్సును ఇస్తుంది. చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం, జ్ఞేయం, సర్వుల హృదయాలలో ఉండేది.

జ్ఞానం, జ్ఞేయం, క్షేత్రం ఈ మూడూ తెలుసుకొన్న వాడు భక్తుడై మోక్షం పొందగలడు. ప్రకృతి పురుషులు తెలియబడని మొదలు గలవి. దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖదుఃఖాలు ప్రకృతి వలనే పుడుతున్నాయి. దేహ, ఇంద్రియాల పనికి ప్రకృతి-సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు మూలం. జీవుడు త్రిగుణాల వలన సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు. వివిధ జన్మలకు గుణాల కలయికే కారణం.

తాను ఈ శరీరమందే ఉన్నప్పటికీ దీనికి అతీతుడు, స్వతంత్రుడు, అనుకూలుడు, సాక్షి, పోషకుడు, భోగి ఐన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఈ విషయాలను గురించి బాగా తెలుసుకొన్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధ సూక్ష్మబుద్దితో హృదయంలోనూ, మరికొందరు యోగధ్యానం వలనా, జ్ఞానయోగం వలనా, కొందరు నిష్కామ యోగం ద్వారా దర్శిస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం తెలియనివారు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా సంసారాన్ని తరిస్తారు. ఈ ప్రాణులంతా క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక కారణం. అన్నీ నశించినా తాను నాశనం కానట్టి ఆ పరమాత్మను చూడగలిగినవాడు మాత్రమే నిజంగా చూసినవాడు.

ఆ దైవాన్ని అంతటా సమంగా చూసేవాడు తనను తాను పాడుచేసుకోడు. పరమగతిని పొందుతాడు. ఆత్మ ఏ కర్మా చేయదనీ, ప్రకృతే చేస్తుందని తెలుసుకొన్నవాడే జ్ఞాని. అన్ని జీవులనూ ఆత్మగా చూస్తూ ఆనీ ఆత్మ అని గ్రహించిన మనిషే బ్రహ్మత్వం పొందుతాడు. పుట్టుక, గుణం, వికారం లేనిది కావడం చే శరీరమందున్నా కర్తృత్వంకానీ, కర్మఫల సంబంధం గాని తనకు ఉండవు.

శరీరగుణాలు ఆత్మకు అంటవు. ఒక్క సూరుయ్డే జగత్తును ప్రకాశింప చేస్తున్నట్టు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రాలైన అన్ని దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, మాయా బంధాన్ని దాటే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసు కొన్నవాడే పరమగతినీ పొందుతాడు...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...