Saturday, October 28, 2023

గ్రహణ కాలమందు మంత్ర పురశ్చరణము, దీక్షలు

శ్లో ll చంద్ర సూర్యగ్రహే తీర్దే మహా పర్వాదికే తథా మంత్ర దీక్షాం ప్రకుర్వాణో మాపర్ క్షాదీన్న శోధయేత్ ॥


తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ కాలమందును, తీర్ధమందును,

మహాపర్వము మొదలగువాటి యందును మంత్రపురశ్చరణ దీక్షను గాని ఉప లక్షణములచే మంత్రోపదేశమును చేయువారికి మాస నక్షత్రాది (ముహూర్తము)  శోధన అక్కరలేదు. దీక్షాక్రమమును మంత్ర శాస్త్రోక్త ప్రకారముగ తెలియవలెను. 


శ్లో॥ యుగేయుగే తు దీక్షాసీ దుపదేశః కలౌయుగే చంద్రసూర్యగ్ర హేతీర్ధే సిద్ద క్షేత్రే శివాలయే మంత్రమాత్ర ప్రకథన ముపదేశస్య ఉచ్యతే ॥


తాత్పర్యము : ప్రతి యుగమందును మంత్రోపదేశము దీక్షారూపమై అనేక నియమములు కలిగి యుండును. కలియుగమందు మాత్రమే మంత్రోపదేశమే అయిఉండును. అదియును సూర్యచంద్ర గ్రహణములలో తీరమందును, సిద్ధక్షేత్రమందును, శివాలయమందును చేయవలయును.


మంత్రగ్రహణ విషయమై సూర్యగ్రహణమే ముఖ్యము చంద్ర గ్రహణమైనచో దారిద్ర్యాది దోషములు కలవని కొందరి వచనము.


మంత్ర పురశ్చరణ లేక జప నియమములు :


శ్లో॥ చంద్ర సూర్యోపరాగేచ స్నాత్వా పూర్వ ముపోషితః స్పర్శాది మోక్ష పర్యంతం జపేన్మంత్రం సమాహితః జపాద్దశాంశతో హోమస్తథా హోమాచ్చ తర్పణం హోమాశక్తౌ జపం కుర్యా ద్దోమ సంఖ్యా చతుర్గుణం || 


తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ దినమందు భోజనము విడచి స్పర్శ  కాకముందే స్నానము చేసి అది మొదలుకొని శుద్ధమోక్ష మగునంతవరకు మంత్రమును ఏకాగ్రతతో జపించవలయును. అట్టి జపసంఖ్యకు పదియవ వంతు  హోమమును, దానికి పదియవ వంతు తర్పణమును చేయవలెను. హోమము చేయలేని ఎడల దాని సంఖ్యకు (నాలుగు రెట్లు)  చతుర్గుణముగ జపమే చేయవచ్చును. 


 తర్పణములు వదలునప్పుడు మూలమంత్రము ఉచ్చరించి మంత్ర దేవత నామమును ద్వితీయాంతముగ ఉచ్చరించి (దేవత పేరు) ....... దేవతాం తర్పయామి" (యవలతో కూడిన )  యవాదులతో కూడిన జలము దోసిలితో అర్పించవలయును. ఇట్లు నమశ్శబ్దమంతమగునట్లు మూలమంత్రము ఉచ్చరించి "....... దేవతా మహమభిషించామి" అని తన శిరస్సుయందు చల్లుకొనుచు మార్జనము తర్పణమునకు పదియవ భాగము చేయవలయును. మార్జన సంఖ్యకు దశమ భాగము బ్రాహ్మణ భోజనము. ఇట్లు జపహోమ తర్పణమార్జన, విప్ర భోజనమను అయిదు భాగములు కలది పురశ్చరణము. 'తర్పణముల'లో ఏదైన సంభవించని ఎడల అనగా చేయలేని ఎడల దాని సంఖ్యకు(నాలుగు రెట్లు ) చతుర్గుణము జపమే చేయవలయును. ఇట్టి పురశ్చరణము గ్రస్తోదయము, గ్రస్తాస్తమయము లందు అవసరము లేదు. పురశ్చరణాంగమైన ఉపవాసము పుత్రవంతుడైన గృహస్థు చేయ వచ్చును. పురశ్చరణ చేయువానికి స్నాన, దానాది నైమిత్తిక లోపముచే (పాపము) 'ప్రత్యవాయము కలుగును. కనుక అవి భార్యా పుత్రుడు మొదలగు ప్రతినిధులచే చేయించవలెను.


పురశ్చరణ చేయు విధానము :


 స్పర్శకు ముందే స్నానము, ఆసనము వేసుకొని (గోత్రము చెప్పవలయును)..... గోత్రో .......(పేరు చెప్పవలయును)..... శర్మాహం రాహుగ్రస్తే దివాకరే నిశాకరే వా "......... దేవతాయా....... మంత్రసిద్ది కామోగ్రాసాది ముక్తి పర్యంత .......మంత్రస్య జపరూపం పురశ్చరణం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్పర్శ మొదలుకొని మోక్ష పర్యంతము జపము చేయవలయును. ఆపైన పర దినమందు స్నానాది నిత్యకర్మలు చేసి "........ మంత్రస్య కృతై తద్గ్రహణ కాలికా...... సంఖ్యా జప సాంగతా సిద్ధ్యర్థం తర్దశాంగ హోమ తద్దశ్శాంశాంశ మార్జన తద్దశాంశ విప్ర భోజనాని కరిష్యే" అని సంకల్పించి హోమాదులైనను, తత్ చతుర్గుణ మంత్ర జపమైననూ చేయ వలయును. ప్రతినిధిగా ( నియమింపబడిన) ప్రేరణ చేయబడిన పుత్రాదులు గ్రహణ కాలమందే "...... గోత్రస్య........ శర్మణో గ్రహస్పర్శ స్నాన ప్రయుక్త శ్రేయః ప్రాప్త్యర్థం స్పర్శ స్నానం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్నాన దానాదికము చేయవలెను. పురశ్చరణ చేయనివారును తమతమ ఇష్ట దేవతా మంత్రజపమును గాయత్రి మంత్ర జపమును తప్పక చేయ వలయును. లేనిచో మంత్రమునకు మాలిన్యమగును.


గ్రహణకాలమందు శయనించినచో రోగము, మూత్రము విడిచినచో దారిద్ర్యము, (మలము) పురీషము విడిచినచో (పురుగు) కృమి జన్మము, మైథునము చేసినచో ఊరపంది జన్మము, (తలంటు స్నానము) అభ్యంగము జేసికొనినచో కుష్టురోగము, భోజనము చేసిన నరకము వచ్చును. గ్రహణమునకు ముందు వండిన అన్నము గ్రహణము తరువాత భుజింపకూడదు. గ్రహణకాల స్థితమైన జలమును త్రాగినచో (పాపము) పాదకృచ్చ్ర ము. కనుక త్రాగరాదు. మీగడ, మజ్జిగ, తైల పక్వము క్షీరము పూర్వ సిద్ధమైననూ గ్రహణము తరువాత గ్రహించవచ్చును. కానీ గ్రహణ కాలమందు వాటిలో దర్భముక్కను వేయవలయును.

మహర్షి వాల్మీకి ఎవరు ?

వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి , రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించినవాడిగా ఆదికవి అయ్యాడు.


అయితే వాల్మీకి జన్మము ఎట్టిది ? ఆయన తల్లితండ్రులు ఎవరు ?  అనే విషయము పై అనేక తర్జనభర్జనలు , కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము , పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి , పరాశరుల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి , ఏ పాపము చేయని , అబద్దమాడని మహర్షిని.   సీత నిన్ను తప్ప మనసా , వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము , సీతను ఏలుకో. నా మాటలు తప్పు , అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.”


వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును. ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత , నిజాయతీ ఉట్టిపడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు ?  ప్రచేతసుడు ఎవరి కుమారుడు ? ఆయనది ఏ వంశము ? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక పురాణములను , చరిత్రలను చదవవలసి ఉంటుంది. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము” లో ఉంది. శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.  భారతదేశములోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా మహమ్మదీయులు దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు స్థిరత్వము , ప్రోత్సాహము లేని పరిస్థితులలో చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండకపోవడం జరిగింది. ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క , స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడుకలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.  భారతదేశములో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో , పుణ్యానికో చదవటము , వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అత్యంత విశ్వాసము. 


పురాణములలోని వ్యక్తుల జీవిత కథలను , అందులోని నీతి , నిజాయతీలను , సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు. పురాణాలలోని ఆచార వ్యవహారాలను , వ్రతములను , పూజాదికార్యక్రమములను, జన్మనుండి మరణము వరకు సాగే బారసాల , అన్నప్రాశన , అక్షరాభ్యాసము నుండి పుంసవనము , శ్రీమంతము , వివాహము  తరువాత అప్పగింతలు , మరణము తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. పురాణ రచయతలను భగవత్‌ సమానులుగా కొలుస్తారు. భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ) , వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని,  అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మధ్భాభాగవతము , శ్రీ విష్ణు పురాణము అన్నవి భగవాన్ విష్ణువు , ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో , ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తెలుపబడ్డాయి. శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:


కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర


కస్యా న్వవాయే ప్రఖ్యాతా: కుత్ర వా సత్రామాసత                                       


అర్థము:  గొప్ప భగవత్ భక్తిని గలిగిన ఆచార్యా    “ప్రచేతసులు చేయుచున్న సత్రయాగములో నారదులు గానము జేసితిరని చెప్పితిరి గదా. ఆ ప్రచేతసులు ఎవరు ?వారెవరి కుమారులు ? ఎవరి వంశమందు ప్రసిద్ధిని పొందిరి.” అని విదురుడు  ప్రశ్నిస్తూ మైత్రేయునితో ఇంకా ఇలా అన్నాడు. వైవియస్ఆర్


స్వధర్మశీ లై: పురుషైర్భగవాన్ పురుషోత్తమ:


ఇజ్యమానో భక్తిమతా నారాదేనేరిత:కి ల


అర్థము: క్షత్రియులైన ప్రచేతసులు తమతమ ధర్మముల మూలకముగా శ్రీ హరిని యజ్ఞ యాగాదులచే పూజించుచుండిరి. అచ్చటికి వచ్చిన నారదులు , యజ్ఞమయుడు , పురుషోత్తముడైన విష్ణువును గురించి ఉపదేశించిరని వినియున్నాము.


ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు. క్షత్రియులు. వీరికి విష్ణువు , యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు. ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు , శ్రీహరి ప్రత్యక్షమవటము , వరాల అను గ్రహము , ధ్రువ వంశవిస్తరణ , సూర్యవంశస్థులు , బోయలవంశక్రమము వత్సరుడు , పుష్పార్ణుడు , సాయంకాలుడు , చక్షుడు , ఉల్కకుడు , అంగుడు , వేనుడు , పృథ్వీరాజు , విజితాశ్వుడు , పావనుడు , హవిర్ధానుడు , ప్రచేతసుడు , ప్రాచేతసులు (10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తాంతములు , అంగుడి బాధ , వేనుడి దుశ్చర్యలు , పృథ్వీ రాజు ఔన్నత్యము , నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము , ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జననము వివరించబడ్డాయి.  ఆ 10 మంది ప్రాచేతసులలో 7వ (పదవ) వాడు వాల్మీకి మహర్షి.


ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు , నారదుల ఉపదేశముతోనూ , తండ్రి , తాతల , ముత్తాతల  సుకృతము , శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొక్క నిజకథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి. వాల్మీకి మహర్షి గురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి. రాముడు అనే పాత్రను లోకానికి  ఆదర్శపురుషుడిగా చూపించాలని ఆదికవి తపనే గాని ఆపాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు చెప్పాలనే ఆలోచన తన రచనల్లో కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇతరుల గురించి , వారి బాగుగురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.


మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ , దారి దోపిడీదారుడని వ్రాశారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని , పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు (ఇలపావులూరి  పాండురంగారావు , ఆచార్య సహదేవ , జస్టిస్ భల్లా). భగవధ్గీతలో కూడా అనేక మార్పులు , చేర్పులు జరిగాయని , మూల గీతలో లేని అనేక శ్లోకములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్ , రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు - మతములు - విజ్ఞాన సర్వస్వము , నాలుగవ సంపుటము - ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక , అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందుకో  అల్లిన కట్టు కథలు.


భారతీయ సాహిత్య నిర్మాతలు - వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో ఇలపావులూరి పాండురంగారావు గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.


“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని , సప్తరుషులచే  ఋషిగా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవితాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి , శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి కిరాతుడు అనే కథ బహుళ ప్రచారములో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”  


వాల్మీకి , కిరాతుడు , రత్నాకరుడు , అగ్నిశర్మ పేర్ల కథనాలు , 


విమర్శలు


“ కిరాతుడు ” అనే  పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు , ఆకులను , పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని , తలపాగవలె ధరించి ఉన్నవాడు.    ”కి” అనగా కలిగి అని , రాతుడు అనగా తురాయివాడు అని అర్థము. అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయివాడు లేదా కోడి , జింక , గొర్రె , బర్రె , మేక , తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికేవాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో , సరదాగా ఉంటుందనో , అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు , చేపలు , రొయ్యలు , గొర్రెలు , మేకలు) పెంచి , పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు , కొనేవారు , తినేవారు అందరూ కిరాతులే.


వాల్మీకి శబ్దము చీమలపుట్ట అనే అర్థానికి , కఠోర ధ్యానానికి , నిశ్చల తపోముద్రకు ప్రతీక. అట్టి తపోః ఫలితమే వాల్మీకి మహాకవి. వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘసందేశములోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు. (ఇలపావులూరి పాండురంగారావు)


“వాల్మీకాగ్రాత్ ప్రభవతి  ధనః ఖండమా ఖండాలస్య”  

అర్థము:  సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను చూడండి ! అందులో నుండి ఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు - ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు , ప్రబంధౌచిత్యానికి ప్రతీక. వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.  కిరాతులు క్షత్రియులే , వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).        


కిరాతుడు (ఋషి)గా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే. తపస్సు ఆయన ప్రధానసద్గుణము , నిరంతరాధ్యయనము , సత్ప్రవర్తనల ఫలితమే మహాఋషిగా ఆవిర్భవింపచేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల (వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము. వారిలో రత్నాకరుడు , అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చును.  వీరు మహర్షి , ఆదికవి వాల్మీకి ఉత్ద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్యము లోనికి వచ్చి ఉంటారు. ఆకతాయి రచయతలు ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొరబడి ఉండవచ్చును.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ , హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య , డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహకరిస్తున్నాయి (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్ - జస్టిస్ భల్లా , ద టైమ్స్ ఆఫ్ ఇండియా , ఇంగ్లీష్ డైలీ , 2010 మే 22) పంజాబ్ , హరియానా హైకోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ , హరియానా , విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు. డాక్టరు సహదేవ , చైర్ పర్సన్ గా , వాల్మీకి చైర్ అనే విభాగమును , ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు , అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి). క్రీ.పూ. నుండి  అందుబాటులో ఉన్న వేదములు , శిలాశాసనాలు , ఉపనిషత్తులు , పురాణములు , ఇతిహాసములు , చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా , ఎప్పుడూ దొంగగా , దారి దోపిడీ దారుడిగా వ్రాయబడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్‌ను జస్టిస్ భల్లా ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ , దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడకూడదు , నాటికలు , టి.వి.సీరియల్స్ , సినిమాలు తీయరాదు , వాల్మీకి మహర్షిని దొంగ , దారి దోపిడీదారుడు అని బోయలను , వాల్మీకులను కించపరిచే విధముగా మాట్లాడితే నేరము , వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును. మహర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో ( ఆధ్యాత్మికరామాయణము , స్కాంధపురాణము , తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి  వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు , చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


వాల్మీకిమహర్షిని ఆదికవి , ఋక్షకుడు , భార్గవుడు , కవికోకిల , వాక్యావిశారదుడు , మహాజ్ఞాని , భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకిమహర్షి “ఓం  ఐం హ్రీం  క్లీo శ్రీo” అనే బీజాక్షరాలు సరస్వతీ , లక్ష్మి , మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయము చేశారు. (దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము)    


వాల్మీకిమహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి. వాల్మీకి రామాయణము క్రీ.పూ. 1000 వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని , వాల్మీకిపై విశేషపరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు (ఇలపావులూరి పాండురంగారావు). క్రీ.పూ. 100 సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత అశ్వఘోషుడు వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.


”వాల్మీకి రాదే చ ససర్జపద్యం జగ్రంధన్నచ్యవనో మహర్షి” - ఈ శ్లోకం వాల్మీకి క్రీస్తు శకానికి ముందువాడని ధ్రువ  పరుస్తోంది


బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ. 800 సం.ల నాటి వారు వాల్మీకి అని డా.హెచ్. జాకోబి అభిప్రాయము. పై విషయాలు పరిశోధన చేసి వ్రాసినది ఆచార్య చిప్పగిరి జ్ఞానేశ్వర్.


మహర్షి వాల్మీకి తనకు తాను  పేరు , తండ్రి పేరు చెప్పినది ఒక సందర్భంలో నే అదే వాస్తవం మిగిలిన పేర్లు , కథలు అబద్ధాలు అనువాదాల ద్వారా వ్రాసి ప్రచురించిన వాల్మీకి జన్మ వృత్తాంతములకు ఆధారాలు లేవు. (ఆచార్య మంజు లాసహదేవ , వాల్మీకి ఛైర్ పోర్షన్ , పంజాబ్ అండ్ హర్యానా విశ్వ విద్యాలయం.)


వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు , లవుడు , కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని , బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షిగా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు  మహాశయా” అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పాడని , అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణధర్మముతో బోయవాడిగా   పుట్టినవాడు ఆదికవిగా , మహర్షిగా , బ్రాహ్మణుడిగా  గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొనియాడారు.


ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే “అక్షరలక్ష” అనే  ఈనాటి “ఎన్ సైక్లోపెడియా బ్రిటానికా” వంటి విజ్ఞాన  సర్వస్వము , సర్వశాస్త్ర సంగ్రహమును వెలువరించారు. (పెదబాలశిక్ష - గాజుల సత్యనారాయణ) ఈపుస్తకములో  భూగర్భశాస్త్రము , రసాయనశాస్త్రము , గణితశాస్త్రము , రేఖాగణితము , బీజ గణితము , త్రికోణమితి , 325 రకాల గణిత ప్రక్రియలు , గాలి , ఉష్ణము , విద్యుత్ , జలయంత్ర శాస్త్రము , ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి. యోగవాశిష్టము అనే యోగా , ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు. ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే. రాముడు పది - పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై , మానసిక ధౌర్భల్యమునకు గురి అయినప్పుడు  వశిస్టుడి ద్వారాయోగా , ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది.  వాల్మీకిమహర్షి , పలికింది , బోధించింది వశిస్టుడు , అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే. కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు  వాల్మీకియే. మహర్షివాల్మీకి  “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు. తొమ్మిది లక్షణాలతో జీవితమును సంస్కరించుకోవాలని , ఈ తొమ్మిది గుణములు కలిగిన వారిని , పాటిస్తున్నవారిని  వాల్మీకి మతస్తులుగా గుర్తించారు. ఆటవిక జీవితములో వ్యవసాయము తెలియదు.  అడవులలో దొరికిన ఆకులు ,  అల ములు , దుంపలు , కాయలు , పండ్లు , సాధుజీవుల (కుందేలు , కోడి , పంది , గొర్రె ,   మేకలువంటివి)ను పట్టి , అవి పట్టుబడక పోతే వాటితో పోరాడి స్వంతము చేసుకోవటమే అలవాటు. తమ  వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాగుకోవటము, ఇవ్వకపోతే వారితో పొరాడి , చంపి అయినా సరే తమ స్వంతము చేసుకోవటము ఆటవికతనము , ఈ పోరాటము జరిపే , ధైర్యసాహసాలు గల వారినే “క్షత్రియులు” అని అంటారని భీష్ముడు మహాభారతములో క్షత్రియత్వము గురించి  వివరణ ఇచ్చాడు.  ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్క రించటానికే వాల్మీకి తొమ్మిది లక్షణాలతో జీవనమును సాగించాలని బోధించారు. ఆటవికులలో సంస్కారమును కలుగ చేయటానికే వాల్మీకిమతము ప్రారంభించబడింది. క్రీ.పూ. 600 సంవత్సరములోనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి వ్రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ. ఆటవిక భాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే. ”మా నిషాద” అనే పదముతో మొదలైన శ్లోకములోని మొదటి వ్యక్తి నిషాదుడే , అతనూ బోయవాడే. అజ్ఞానముతో బోయవాడు చేసిన ఆడ పక్షిని చంపటము అనే ప్రక్రియ వాల్మీకిమహర్షిలో బోయలను , ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింప చేసి ఒక ఆదర్శ మానవుడిని  నాయకుడిగా చూపించాలని “రామాయణము” వ్రాసేలా చేశాయి.


క్రౌంచ పక్షి జంటలో ఒకటి చనిపోవుట   రామాయణ కర్తగా వాల్మీకి


వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు , కలుపుగోరులకు , తీసివేతలకు గురి అయింది.


వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు , సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ - కుశలను కన్నట్టూ , వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.


తొలి శ్లోకం


వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:


మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥

యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥


ఓ కిరాతుడా ! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.

ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.


వాల్మీకి వలస


అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం , ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ , అడవి ఆకులు , దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ , తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ

Thursday, September 21, 2023

వినాయకుడూ - విష్ణువూ ఒకరేనా!

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ I 

ప్రసన్నవదనం ధ్యాయేత్ 

సర్వవిఘ్నోపశాంతయే ॥

ఇది అందఱమూ అన్ని సందర్భాలలోనూ ప్రార్థనా శ్లోకంగా చదువుతాం.

ఈ శ్లోకం 


1. వినాయకునికి సంబంధించి,

* శుక్ల + అంబరధరమ్ = తెల్లని వస్త్రాలని ధరించినవాడు, 

* శశివర్ణం = చంద్రునిలా తెల్లనైన శరీరం కలవాడు, 

* చతుర్భుజమ్ = నాలుగు చేతులతో ఉండేవాడు, 

* ప్రసన్న వదనమ్ = అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలవాడు, 

* విష్ణుమ్ = సర్వవ్యాపి అయినవాడు, 

* సర్వ విఘ్న + ఉపశాంతయే = అన్ని విఘ్నాలనుంచీ బయటపడేసి, శాంతి పొందించేవాడు,

అయిన "వినాయకు"ని 

* ధ్యాయేత్ = ధ్యానిస్తున్నాను. 

      అని అర్థం.


 2. విష్ణువుకి  సంబంధింది కాదుకదా! 

 ఈ శ్లోకంలో "చతుర్భుజమ్", "విష్ణుమ్" అనే మాటతో ఇది విష్ణువుకి సంబంధించింది అంటారు. కానీ,

* తెల్లవస్త్రాలు ధరించి అని ఉంటే, మరి విష్ణువు పసుపుబట్టలు ధరించే "పీతాంబర ధారి" కదా!

* చంద్రునిలా తెల్లని రంగుగలవాడు అని ఉంటే, మరి విష్ణువు "నీలమేఘశ్యాముడు" కదా!

* విఘ్నాలు తొలగించేవాడు అని ఉంటే, మరి "సృష్టి స్థితి లయా"లలో స్థితికి సంబంధించి , విష్ణువు "పుట్టిన వాడిని పోషించడం వరకే బాధ్యతగా కలవాడు" కదా! , ---------- ఇలా అంటూ,

ఈ శ్లోకం విష్ణువుకు వర్తించదు అంటారు.

మరి విష్ణువుకు ఎలా అన్వయిస్తాము?


2. విష్ణువునకు సంబంధించి అన్వయం 

* శుక్ల + అంబరధరమ్ 

- తెల్లనైన ఆకాశాన్ని(అంబర) ధరించేవాడు.

 ( విష్ణువునకు,

నాభిర్వియత్ - ఆకాశం బొడ్డు

 ఆ బొడ్డులోనుంచీ సృష్టికర్త "బ్రహ్మ" వచ్చాడు. 


ఆకాశాద్వాయుః - వాయోరగ్నిః - అగ్నేరాపః - అబ్భ్యః పృథివీ - పృథివ్యా ఓషధయః - ఓషధీభ్యోన్నమ్ - అన్నాత్పురుషః - స ఏవా పురుషో అన్నరసమయః -

ఆ ఆకాశం నుండీ వాయువూ - వాయువు నుండీ అగ్నీ - అగ్ని నుండీ నీరూ - నీటి నుండీ భూమీ - భూమి నుండీ ఓషధులూ - ఓషధుల నుండీ అన్నమూ - అన్నము నుండీ ప్రాణులూ కలుగుతాయి)

* విష్ణుమ్ 

    — అంతటా వ్యాపించినవాడు

 (విశ్వం వ్యాప్నోతీతి విష్ణుః )

* శశివర్ణమ్ 

  "శశము" అంటే కుందేలు.

కుందేలు ఒక అడుగువేసి, మళ్ళీ గంతువేసి, మళ్ళీ దూకుతూ నడుస్తుంది.

 అలాగే 'కాలం' కూడా రోజు - పక్షం - నెల - సంవత్సరం అని కొలవబడుతూ, సంవత్సరాన్ని ప్రమాణంగా కొలవబడుతూంటుంది.

విష్ణువు 'కాలాన్ని' అధీనంలో ఉంచుకున్నవాడూ, 'కాల స్వరూపుడు'గా "శశివర్ణమ్"

* చతుర్భుజమ్ 

    నాలుగు చేతులలో 

శంఖ - చక్ర - గద - పద్మాలు కలవాడు.

గద - అహంకారాన్ని అణుస్తుంది.

పద్మం - చిత్తాన్ని వికసింపచేస్తూ, విశ్లేషింపజేస్తుంది.

చక్రం - సంశయాత్మకమైన మనస్సులో సంశయనివృత్తి చేస్తుంది.

శంఖం - నిర్ణయాత్మకమైన బుద్ధిని ప్రామాణికమైన జ్ఞానంతో సరియైన నిర్ణయాన్నిస్తుంది.

 

శంఖ - చక్ర - గద - పద్మాలు నాలుగు చేతులలో  మారుతూ 24 రకాలుగా( Factorial 4 = 4x3x2x1 = 24) కనబడే మూర్తులే

కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ -అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరయ  - శ్రీకృష్ణ.

   "మనో బుద్ధి చిత్త అహంకారాల"నే నాలుగు భాగాలుగా ఉండే "అంతఃకరణ" శుద్ధి అనుగ్రహించే స్వామి "విష్ణువు". 


* ప్రసన్న వదనం

భృగు మహర్షి వచ్చి కాలుతో తన్నినా వదనంలో మార్పులేదు.

 (చేయవలసిన పనిని హావభావాలు కనబడనీయక నిశ్శబ్దంగా చేస్తాడు)

* సర్వవిఘ్నాలు పారద్రోలి శాంతి కల్గించే "స్థితి కారకుడై"న "విష్ణుమూర్తి"ని 

* ధ్యాయేత్ 

- ధ్యానిస్తాను. 


పార్వతీపరమేశ్వరులకు దేవతలు విఘ్నం కల్గించడంవల్ల సంతానం కలుగలేదు. 

 ఆదిదంపతుల ప్రార్థనతో విష్ణువే పుత్రుడుగా జన్మిస్తాడు.    

శని దృష్టివలన ఆతని శిరస్సు ఖండింపబడితే, గజశిరస్సు అమర్చారు. గజాననుడు సాక్షాత్తూ విష్ణువు  అవతారమే 

 - బ్రహ్మ వైవర్త పురాణం 


వినాయకుడూ విష్ణువూ ఒకరే కాబట్టి స్వామిని  "లక్ష్మీ గణపతి"  విగ్రహ రూపంలో ఆరాధిస్తాం.

Wednesday, August 30, 2023

శ్రీహయగ్రీవ జయంతి

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిమ్ 

ఆధారం సర్వ విద్యానామ్ హాయగ్రీవం ఉపాస్మహే 


సింహే శ్రవణ సంజాతం విద్యా నామాధిమం గురుం

జ్ఞానానంద ప్రధాతారం హాయగ్రీవం ఉపాస్మహే


సర్వవిద్యా స్వరూపాయ లక్ష్మీ సంశ్లిష్ఠ వక్షసే

మధుపాసన లక్ష్యాయ హయగ్రీవాయ మంగళం


శ్రీమతే రామానుజాయ నమ:

శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం

 ప్రథమం షణ్ముఖంచ  

ద్వితీయం గజాననానుజం

త్రుతీయం వల్లీవల్లభంచ 

చతుర్ధం క్రౌంచభేదకం

పంచమం దేవసేనానీంశ్ఛ 

షష్ఠం తారకభంజనం

సప్తమం ద్వైమాతురంచ 

అష్టమం జ్ఞానబోధకం

నవమం భక్తవరదంచ 

దశమం మోక్షదాయకం

ఏకాదశం శక్తిహస్తంచ 

ద్వాదశం అగ్నితేజసం

Tuesday, August 22, 2023

మజ్జిగ

ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు.

పెరుగు ఆయుక్షీణం. రాత్రి సమయంలో అసలు తినకూడదు.

మజ్జిగ  5 రకాలు

1. మధితము:
పెరుగులో నీరు కలపకుండా చిలికి చేసిన మజ్జిగ చిక్కగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారంలో తీసుకుంటే నీరసం, ఉదర రోగాలు, పైత్యము, వాతము, రుచి తెలియక పోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి పోయి శరీరానికి బలం కలుగుతుంది.

2. మిళితము:
పెరుగు ఒక వంతులో నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ అరుచిని, అతిసార విరోచనాన్ని, రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది.

3. గోళము:
ఒక వంతు పెరుగు, ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసిన మజ్జిగ శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని, విష దోషాలు, కఫము, ఆమరోగములను పోగొడుతుంది.

4. షాడభము:
ఒక వంతు పెరుగు, అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన మజ్జిగ శ్లేష్మరోగాలను, రక్తమూల వ్యాధిని
పోగొడుతుంది. ఈ మజ్జిగ తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతినిస్తుంది.

5. కాలశేయము:
ఒకవంతు పెరుగు, రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూలవ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది.

మజ్జిగ ఆహారంలో తీసుకోవటం అన్ని కాలాలలో, అన్ని వయసుల వారికి మంచిది

Tuesday, August 8, 2023

యక్ష_ప్రశ్నలు....

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు.... వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు..:


1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)


2. సూర్యుని చుట్టూ తిరుగు వారెవరు? (దేవతలు)


3. సూర్యుని అస్తమింప చేయునది ఏది? (ధర్మం)


4. సూర్యుడు దేని ఆధారంగా నిలచి యున్నాడు? (సత్యం)


5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)


6. దేని వలన మహత్తును పొందును? (తపస్సు)


7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)


8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)


9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)


10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సు వలన సాధు భావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధు భావము సంభవించును.)


11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయము వలన)


12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)


13. భూమికంటె భారమైనది ఏది? (జనని)


14. ఆకాశం కంటే పొడవైనది ఏది? (తండ్రి)


15. గాలి కంటె వేగమైనది ఏది? (మనస్సు)


16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)


17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)


18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)


19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్య చే)


20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుట వలన)


21. జన్మించియు ప్రాణం లేనిది (గుడ్డు)


22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)


23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన)


24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)


25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)


26. బాటసారికి, రోగికి, గృహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)


27. ధర్మానికి ఆధారమేది? (దయ, దాక్షిణ్యం)


28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)


29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)


30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)


31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)


32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)


33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)


34. మనిషి దేని వల్ల సంతసించును? (దానం)


35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)


36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)


37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)


38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)


39. ఎవరితో సంధి శిథిలమవదు? (సజ్జనులతో)


40. ఎల్లప్పుడూ తృప్తిగా పడి యుండునదేది? (యాగ కర్మ)


41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)


42. అన్నోదకాలు వేని యందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశము లందు)


43. లోకాన్ని కప్పి వున్నది ఏది? (అజ్ఞానం)


44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)


45. మనిషి దేనిని విడచి సర్వజన ఆదరణీయుడు, శోక రహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)


46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)


47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)


48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)


49. సర్వ ధనియ అనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)


50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)


51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)


52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)


53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)


54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)


55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)


56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)


57. దానం అంటే ఏమిటి? ( సమస్త ప్రాణుల్ని రక్షించడం)


58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)


59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)


60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)


61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)


62. డంభం అంటే ఏమిటి? (తన గొప్ప తానే చెప్పుకోవటం)


63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)


64. నరకం అనుభవించే వారెవరు? (ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)


65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)


66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)


67. ఆలోచించి పని చేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు)


68. ఎక్కువ మంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)


69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)


70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)


71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ, అప్రియమూ, సుఖమూ, దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)


72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖ దు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధి కలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)

సర్వేజనాసుఖినోభవంతు

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...